సాక్షి, ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని, ప్రచారానికి వచ్చే నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. ఇటీవల కాలంలో వరుసగా కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తున్నారు. దీంతో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఏజెన్సీ ప్రాంత నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారే అవకాశం కనిపిస్తోంది.
గోదావరి తీరంలో..
ఒకప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు నల్లమల అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు కంచుకోటలుగా ఉండేవి. ప్రభుత్వ ఆదేశాల కంటే మావోయిస్టుల హెచ్చరికలే పల్లెల్లో ప్రభావం చూపించేవి. రానురాను మావోయిస్టుల ప్రభావం తెలంగాణలో తగ్గిపోయింది. పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టులు బలంగా తమ ఉనికి చాటుతున్నారు. ఆ ప్రభావం సరిహద్దు పంచుకుంటున్న మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలపై కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దు ఉన్న గోదావరి ఏజెన్సీలో స్థానిక సంస్థలు మొదలు చట్టసభల వరకు ప్రతీ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం తలపిస్తోంది.
గంట ముందుగానే
సాధారణ పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. కానీ మావోయిస్టుల ప్రభావం ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను అక్కడి నుంచి తరలిస్తారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వచ్చే దారులు, మార్గమధ్యలో ఉన్న కల్వర్టులను పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు చేస్తారు.
అయినా ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించారు.
అప్రమత్తమైన పోలీసులు
ఎన్నికల నేపథ్యంలో ఇటు పోలీసులు, అటు కేంద్ర బలగాలు సరిహద్దులో అడవులను విస్తృతంగా జల్లెడ పడుతున్నాయి. భద్రాద్రి జిల్లా ఎస్పీ వినీత్ ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తూ పోలీసు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించడంతో పాటు అటవీ సమీప గ్రామాల్లో ప్రజలకు భరోసా కల్పించేలా పోలీసు కవాతు నిర్వహిస్తున్నారు.
కరపత్రాల కలకలం
ఈసారి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పక్షం రోజులకు మావోయిస్టుల నుంచి లేఖలు వచ్చాయి. ఓట్ల కోసం వస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులను నిలదీయండి. మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఎన్నికలను బహిష్కరించండి.. అంటూ మావోయిస్టు తెలంగాణ కమిటీ పేరుతో చర్లలో కరపత్రాలు వెలువడ్డాయి. అంతకు ముందు అల్లూరి సీతారామరాజు – భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందు – నర్సంపేట డివిజన్ కమిటీల పేరుతోనూ లేఖలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment