పోలీస్, హోంశాఖల మధ్య కోల్డ్‌వార్
- పదోన్నతులపై పీటముడి వేసిన హోంశాఖ
- బదిలీల్లోనూ అడ్డుపుల్ల వేసిన వైనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హోం మంత్రిత్వశాఖ, రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం మధ్య కోల్డ్‌వార్ సాగుతోంది. ఈ రెండింటి మధ్య రోజురోజుకూ వివాదం రాజుకుంటోంది. ముఖ్యంగా పదోన్నతులు, బదిలీల విషయంలో రెండు విభాగాల మధ్య సమన్వయ లేమి కనిపిస్తోంది. పదిహేను రోజుల కిందట పలువురు అదనపు ఎస్పీల బదిలీల ప్రతిపాదనను పంపితే ఇప్పటివరకు ఆదేశాలు వెలువడకుండా అడ్డుకున్నారని పోలీస్ అధికారులు హోం విభాగంపై రుసరుసలాడుతున్నారు. అదే విధంగా మంత్రిమండలి ఆమోదంతో కొత్త పోస్టుల్లో పదోన్నతులకు ప్రతిపాదనలు వెళ్లినా దీనిపై హోంశాఖలో పీటముడి పడ్డట్టు డీజీపీ కార్యాలయంలో చర్చ జరుగుతోంది.
హోంమంత్రి.. ఐపీఎస్‌ల మధ్య గ్యాప్..
పదిహేను రోజుల క్రితం రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం నుంచి 9 మంది అదనపు ఎస్పీల బదిలీలకు చెందిన ఫైలు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి వెళ్లింది. అక్కడి నుంచి హోం మంత్రి చాంబర్‌కు వాటి ఆమోదం కోసం పంపారు. ఆ తర్వాత ఆ ఫైలు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. ప్రదిపాదిత జాబితాలో తమకు చెందిన అధికారులకు సరైన పోస్టింగులు లేవని తెలుసుకున్న కొంతమంది అదనపు ఎస్పీలు రాజకీయంగా ఒత్తిడి తెచ్చి బదిలీల ఫైలు ఆమోదంకాకుండా ఆపారని వెల్లడైంది. దీనితో హోంమంత్రి, సీనియర్ ఐపీఎస్‌ల మధ్య అఘాతం పెరిగిపోయినట్టుగా చర్చ జరుగుతోంది.
వాస్తవానికి మహబూబాబాద్, వికారాబాద్ జిల్లా ఎస్పీ, హైదరాబాద్‌లోని ఈస్ట్‌జోన్ డీసీపీ, టాస్క్‌ఫోర్స్‌అదనపు డీసీపీ, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ, రాచకొండలోని ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి డీసీపీ పోస్టుల్లో అధికారుల బదిలీపై సీనియర్ ఐపీఎస్‌లు సీఎంతో ఆమోదముద్ర వేయించారు. అయినా హోంశాఖలో ఫైలు పెండింగ్‌లో పడటంపై ,ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే ఆయనకు ఫిర్యాదు చేయాలని సీనియర్ ఐపీఎస్‌లు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
పదోన్నతులకు విభజన బ్రేక్..
బదిలీల కథ అలా ఉండగా డీఎస్పీ నుంచి అదనపు ఎస్పీ, నాన్‌క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర పోలీస్ శాఖ ముఖ్య కార్యాలయం ప్రతిపాదన పంపిం చింది. అయితే సివిల్ అధికారులు(డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీ) విభజనపై హైకోర్టులో స్టే ఉండటం, సీనియారిటీ వ్యవహారం తేలక పోవడంతో పదోన్నతులు కుదరవని హోంశాఖ తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. అధికారుల కొరతతో కొత్తగా పోస్టులు మంజూరు చేయించుకోవ డం, తాత్కాలిక కేటాయిం పుల్లో భాగంగా రాష్ట్రానికి కేటా యించే వారికే తాము పదోన్నతులు కల్పించి అధికారుల కొరత తీర్చు కోవాలని భావిస్తున్నా మని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అయినా కూడా హోంశాఖ ప్రతిపాదనలను తిప్పి పంపడంపై సీనియర్ ఐపీఎస్‌ల్లో అసహనం ఏర్పడింది. అటు పదోన్నతులు, ఇటు బదిలీలపై సీఎం వద్దే తేల్చుకోవాలని రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.