ఇక ఓఎస్‌ ప్రమోషన్లకు చెల్లు | Telangana Police Department Bringing New Service Rules Over Promotions | Sakshi
Sakshi News home page

ఇక ఓఎస్‌ ప్రమోషన్లకు చెల్లు

Published Tue, Nov 23 2021 1:35 AM | Last Updated on Tue, Nov 23 2021 1:35 AM

Telangana Police Department Bringing New Service Rules Over Promotions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదోన్నతుల్లో సమస్యలు రాకుండా, సీనియారిటీ సమస్యలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేలా కొత్త సర్వీస్‌ రూల్స్‌ను పోలీస్‌ శాఖ తీసుకొస్తోంది. ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌ కింద తాత్కాలిక పద్ధతిలో ఇచ్చే పదోన్నతులను ఆపేయాలని, యాగ్జిలేటరీ ప్రమోషన్లకు ప్రత్యేక రూల్‌ ఉండాలని ప్రతిపాదన చేసింది. ఈ కొత్త రూల్స్‌ ప్రతిపాదనలను హోం శాఖ ద్వారా ప్రభుత్వానికి పంపింది. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఆ ప్రతిపాదనలను న్యాయ శాఖకు హోం శాఖ పంపించే ఏర్పాట్లు చేస్తోంది. న్యాయ శాఖ నుంచి క్లియరెన్స్‌ రాగానే ప్రభుత్వం ఆమోదించనున్నట్టు తెలిసింది.  

నాలుగేళ్లు స్టడీ..: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించిన కఠినమైన పోలీస్‌ సర్వీసు రూల్స్‌ను రాష్ట్ర పోలీస్‌ శాఖ పూర్తి స్థాయిలో సమీక్షించింది. సర్వీస్‌ రూల్స్‌లో అనుభవమున్న రిటైర్డ్‌ అధికారులతో కమిటీ వేసి నాలుగేళ్లు అధ్యయనం చేసింది. పాత సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించి విచక్షణాధికారం పేరుతో గతంలో అధికారులు చేసిన తప్పిదాల వల్ల కోర్టుల్లో కొన్ని వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇలాంటి కేసుల్లో ప్రతి కోర్టు తీర్పును కమిటీ అధికారులు ముందు పెట్టుకొని కొత్త రూల్స్‌ను రూపొందించినట్టు ఉన్నతాధికారులు చెప్పారు. సీనియారిటీ విషయంలోనే 2,800 కేసులను కమిటీ అధ్యయనం చేసిందని తెలిసింది.  

యాగ్జిలేటరీలో ప్రమోషన్లు ఇలా ఇద్దాం..: మావోయిస్టు, ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణలో బాగా పనిచేసే పోలీస్‌ సిబ్బంది, అధికారులకు యాగ్జిలేటరీ పద్ధతిలో పదోన్నతులు కల్పించడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన ఓ జీవో ద్వారానే ఇలా ప్రమోషన్లు ఇస్తున్నారు. ప్రత్యేకంగా రూల్‌ అంటూ సర్వీస్‌ రూల్స్‌లో లేదు. దీంతో సమయం ప్రకారం పదోన్నతి రాని అధికారులు అభ్యంతరం తెలపడం, కోర్టులకు వెళ్లడంతో సమస్యలు వచ్చి బ్యాచ్‌ల మధ్య సీనియారిటీ సమస్య ఏర్పడింది.

ఈ నేపథ్యంలో యాగ్జిలేటరీ పదోన్నతుల్లో కీలకమైన రూల్స్‌ను కమిటీ ప్రతిపాదించింది. ఇలా ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు అతని కన్నా ముందు బ్యాచ్‌ చివరి స్థానంలో, అతడి బ్యాచ్‌ ముందు వరుసలో సీనియారిటీ కల్పిస్తే సమస్యలుండవని వివరించింది.  

ఓఎస్‌ పదోన్నతుల్లో సమస్యలు 
పోలీస్‌ శాఖలో డ్యూటీలో మెరుగైన సేవలందించే వాళ్లకు ఓఎస్‌ (ఔట్‌ ఆఫ్‌ సర్వీస్‌)కింద తాత్కాలిక పద్ధతిలో పదోన్నతి కల్పించే వారు. అయితే ఆ హోదాలోకి సీనియారిటీ ప్రకారం వేరే అధికారులు పదోన్నతి పొందితే ఓఎస్‌ పద్ధతిలో పనిచేస్తున్న అధికారి మళ్లీ పాత హోదాలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ కొంత మంది అధికారులు, సిబ్బంది ఓఎస్‌పై కోర్టులకు వెళ్లి ఓఎస్‌ హోదాలోనే ఉండేలా తీర్పులు తెచ్చుకున్నారు. దీంతో సర్వీస్‌ సమస్యలు ఎక్కువయ్యాయి. పాత సర్వీస్‌ రూల్స్‌ను సమీక్షించిన కమిటీ.. ఓఎస్‌ పద్ధతిలో తాత్కాలిక పదోన్నతులను ఆపాలని ప్రతిపాదించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement