న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కాలంలో కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29న హోంశాఖ ఆదేశాలను ఉల్లంఘించిన కంపెనీలూ, యాజమా న్యాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ మే 15న ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 12కి సుప్రీంకోర్టు పొడిగించింది. కోవిడ్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో ఎటువంటి పనీ జరగకపోయినప్పటికీ, కార్మికుల వేతనాల్లో ఎటువంటి కోతలూ విధించరాదనీ, పూర్తి జీతాలు చెల్లించాలంటూ హోంమంత్రిత్వ శాఖ కంపెనీలకూ, యాజమాన్యాలకూ సర్క్యులర్ జారీచేసింది.
ఎవ్వరినీ ఉద్యోగాల్లోంచి తీసివేయవద్దనీ, వేతనాల్లో కోత విధించవద్దంటూ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్‌కి లేఖలు కూడా రాసింది. వంద శాతం వేతనం ఇవ్వకపోవడాన్ని నేరపూరితమనీ, వారిపై చర్యలు తీసుకొంటామన్న హోంమంత్రిత్వ శాఖ సర్క్యులర్‌లోని అంశాల పట్ల జస్టిస్ అశోఖ్ భూషణ్, ఎస్.కె.కౌల్, ఎంఆర్.షాల తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వ సర్క్యులర్‌ని సవాల్ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సహా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది. చిన్న పరిశ్రమలకు రాష్ట్రాలు చేయూతనివ్వాల్సి ఉంటుందనీ, దీనిపై యాజమాన్యాల్లోనూ, కార్మికుల్లోనూ చర్చలు జరగాలని కోర్టు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment