Workers wages
-
పూర్తి వేతనాలు చెల్లించని కంపెనీలపై చర్యలు వద్దు
న్యూఢిల్లీ: లాక్డౌన్ కాలంలో కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలంటూ మార్చి 29న హోంశాఖ ఆదేశాలను ఉల్లంఘించిన కంపెనీలూ, యాజమా న్యాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ మే 15న ఇచ్చిన ఉత్తర్వులను జూన్ 12కి సుప్రీంకోర్టు పొడిగించింది. కోవిడ్ కారణంగా లాక్డౌన్ ప్రకటించిన సమయంలో ఎటువంటి పనీ జరగకపోయినప్పటికీ, కార్మికుల వేతనాల్లో ఎటువంటి కోతలూ విధించరాదనీ, పూర్తి జీతాలు చెల్లించాలంటూ హోంమంత్రిత్వ శాఖ కంపెనీలకూ, యాజమాన్యాలకూ సర్క్యులర్ జారీచేసింది. ఎవ్వరినీ ఉద్యోగాల్లోంచి తీసివేయవద్దనీ, వేతనాల్లో కోత విధించవద్దంటూ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్‌కి లేఖలు కూడా రాసింది. వంద శాతం వేతనం ఇవ్వకపోవడాన్ని నేరపూరితమనీ, వారిపై చర్యలు తీసుకొంటామన్న హోంమంత్రిత్వ శాఖ సర్క్యులర్‌లోని అంశాల పట్ల జస్టిస్ అశోఖ్ భూషణ్, ఎస్.కె.కౌల్, ఎంఆర్.షాల తో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రప్రభుత్వ సర్క్యులర్ని సవాల్ చేస్తూ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ సహా దాఖలైన పలు పిటిషన్లపై విచారణ చేపట్టింది. చిన్న పరిశ్రమలకు రాష్ట్రాలు చేయూతనివ్వాల్సి ఉంటుందనీ, దీనిపై యాజమాన్యాల్లోనూ, కార్మికుల్లోనూ చర్చలు జరగాలని కోర్టు అభిప్రాయపడింది. -
కడుపు మాడ్చుతున్న ఉపాధి
జిల్లాలో కరువు తీవ్ర రూపం దాల్చి విలయతాండవం చేస్తోంది. కనీసం మేరకు పంటలు కూడా లేక వ్యవసాయ భూములు బీళ్లుగామారి ఎడారిని తలపిస్తోంది. కూలీలకు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఉపాధి పనులైనా ఆదుకుంటాయన్న ఆశ కూడా కూలీలకు కానరావడం లేదు. నెలల తరబడి ఉపాధి పనులు చేస్తున్నా వేతనాలు అందక ఇక్కట్లు పడుతున్నారు. సాక్షి, చిత్తూరు:బతుకు జీవనం కోసం ఉపాధి పనులకు వెళుతున్న కూలీలకు మూడు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాల మొత్తాన్ని తెప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో మొత్తం 47,206 శ్రమ శక్తి సంఘాల ద్వారా 6,41,061 మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో ఇప్పటి వరకు రూ.622.07 కోట్ల మేరకు వెచ్చించి ఉపాధి పనులు చేశారు. మొత్తం 1.69 లక్షల పనులు చేపట్టగా 85 వేల పనులు పూర్తయ్యాయి. మరో 84 వేల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 2,76,402 కుటుంబాలకు చెందిన 4,47,354 మంది కూలీలకు 1,62,53,426 పనిదినాలు కల్పించడం జరిగింది. అందులో పురుషులు 2,01,978 మంది, మహిళలు 2,45,376 మంది ఉన్నారు. అందని వేతనాలు గత ఏడాది డిసెంబర్ 2వ తేది నుంచి ఇప్పటి వరకు చేపట్టిన ఉపాధి పనులకు సంబంధించి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు 1.25 లక్షల మంది కూలీలకు 25.14 లక్షల పని దినాలకు గాను రూ. 50,29,57,865 మేరకు వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అదేగాక మెటీరియల్ కాంపెనెంట్ కింద రూ. 103.85 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉండగా, అందులో పంచాయతీరాజ్ పనులకు రూ. 65.69 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపెనెంట్ మొత్తం రూ. 154 కోట్ల మేరకు ఉపాధి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పట్టించుకోని ప్రభుత్వం జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సాధారణంగా ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలకు శనివారం వేతనాలను అందించాల్సి ఉంది. ఈ వేతనాలను కేంద్ర ప్రభుత్వం నేరుగా కూలీల బ్యాంకు, పోస్టాఫీసుల్లోని ఖాతాలకు జమచేయాల్సి ఉంది. అయితే గత డిసెంబర్ 2 నుంచి ఇప్పటి వరకు వేతనాలు పూర్తిగా నిలిచిపోవడంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి. దీని ప్రభావంతో కూలీల సంఖ్య 90 వేల నుంచి 65 వేలకు పడిపోయింది. వేతనాలు అందక.. పనులులేక ఉపాధి హామీ పనుల వేతనాలు నెలల తరబడి రాకపోవడంతో కూలీలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇతర పనులకు వెళ్లాలన్నా కరువు పరిస్థితుల దృష్ట్యా పంటల సాగు కూడా అంతంత మాత్రంగా ఉంది. దీంతో కూలీలకు ఇతర పనులు దొరక్క, ఉపాధి పనులకు వెళ్లలేక అవస్థలు పడాల్సి వస్తోంది. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఇప్పటికే వేలాది మంది కూలీలు తమిళనాడు, కర్ణాటక రాష్టాలకు వలసలు వెళ్లి కూలి పనులు చేసుకుంటూ చాలీచాలని బతులతో జీవనం సాగిస్తున్నారు. ముఖ్యమంతి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోనే నిత్యం సుమారు 10 వేల మంది కూలీలు ఉదయం బెంగళూరుకు వెళ్లి కూలీ పనులు చేసి రాత్రికి ఇళ్లకు చేరుకుంటున్నారు. -
బయోమెట్రిక్ తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోని కార్మికుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. కార్మికుల సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ కార్మికులు, రవాణా విభాగం డ్రైవర్ల వేతనాల పెంపుపై జీహెచ్ఎంసీకి అనుమతిచ్చింది. పెంచిన వేతనాలు జూలై 16 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. వేతనాల పెంపు నేపథ్యంలో కార్మికుల సాధారణ హాజరుతో పాటు వారికి బయోమెట్రిక్ విధానం అమలు, సమ్మెలో పాల్గొనరాదనే ఆదేశాలను సైతం ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తికి విఘాతం కలిగేలా కార్మికులు ఎలాంటి సమ్మెలకు దిగినా సహించేది లేదని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మెల్లో పాల్గొనరాదని, వారికి బయోమెట్రిక్ విధానం అమలు చేసే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితం ‘సాక్షి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నాయని, నగరంలో జీవన వ్యయం ఎక్కువైనందున వారి వేతనాలు పెంచాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ గత నెల 16న ప్రభుత్వానికి లేఖ రాశారు. కమిషనర్ ప్రతిపాదనలను అంగీకరించిన ప్రభుత్వం.. కార్మికులకు పెరిగిన వేతనాలను జీహెచ్ఎంసీ బడ్జెట్ నుంచే అందించాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది. దీనితో పాటు కార్మికులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, అక్రమాలకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విధులకు హాజరయ్యే పారిశుధ్య కార్మికుల ఫొటోలతోపాటు వారు పనిచేసే ప్రాంతాల్లోని డస్ట్బిన్ల ఫొటోలను అప్లోడ్ చేయడంతోపాటు కార్మికుల బయోమెట్రిక్ హాజరు నమోదు బాధ్యతను శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్పగించింది. ఎంటమాలజీ వర్కర్ల ఫొటోలను అప్లోడ్ చేస్తూ.. ప్రతిరోజూ వారు విధులకు హాజరయ్యే ప్రాంతాల వివరాలను కూడా అందజేయాల్సిందిగా ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పజెప్పింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి వాహనానికీ జీపీఎస్ పరికరాన్ని అమర్చి అవి సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ వర్కర్లపై ఉంచింది. -
సౌదీలో సగం వేతనాలే..
* అంతర్యుద్ధంతో కోత విధించిన కంపెనీలు * ఇబ్బందుల్లో తెలంగాణ కార్మికులు మోర్తాడ్: సౌదీ అరేబియాలో అంతర్యుద్ధం కారణంగా ఇక్కడి నుంచి వెళ్లిన కార్మికుల వేతనాలను యాజమాన్యాలు సగానికి తగ్గించాయి. స్వదేశాలకు వెళ్తామని కార్మికులు చెబుతున్నా పాస్‌పోర్టులు ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒక్కో కార్మికుడికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనాలు చెల్లించేందుకు తొలుత ఒప్పందాలు కుదుర్చుకున్న యాజమాన్యాలు ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం వేతనాలనే చెల్లిస్తున్నట్లు అక్కడి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ భోజనం, వసతి ఉన్న కార్మికుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, మిగిలిన కార్మికుల పరిస్థితి మరింత భిన్నంగా తయారైంది. ఒక్కో వీసాకు రూ.75 వేల నుంచి రూ. లక్ష వరకు ఏజెంట్లకు చెల్లించి గల్ఫ్‌కు వచ్చిన కార్మికులకు ఇప్పుడు తక్కువ వేతనాలు అందుతుండటంతో దిక్కుతోచకున్నారు. విదేశాలకు వెళ్లడానికి బంగారం అప్పుగా తీసుకుని తులానికి అర్ధ తులం వడ్డీగా చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని, తక్కువ వేతనంతో పని చేస్తే తమ ఖర్చులు పోనూ వడ్డీలకే సరిపోవని వారి ఆవేదన. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కార్మికులకు పూర్తి వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
షూటింగ్‌లు బంద్..చాంబర్లో చర్చలు..
సోమవారం తెలుగు సినిమా షూటింగులు బంద్ అయ్యాయి. చలనచిత్ర సీమకు చెందిన కార్మికుల వేతనాలు, ఇతర అంశాలపై ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులకూ, నిర్మాతలకు మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఫెడరేషన్ సోమవారం నుంచి షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. షూటింగ్‌లకు అవాంతరం ఏర్పడడంతో సోమవారం సాయంత్రం నుంచి ఇరు వర్గాల మధ్య హైదరాబాద్‌లోని ఏ.పి. ఫిలింఛాంబర్లో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి. దీనిపై తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు కొమర వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి. కొందరు నిర్మాతల్లో మిశ్రమ స్పందన కనిపించినా... సినీ కార్మికులకు అనుకూలంగానే ఫలితం వస్తుందని ఆశిస్తున్నాం. సోమవారం చర్చ ఆసాంతం కార్మికుల పనివేళలు, బేటాల పైనే జరిగింది. ఆ వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి రాలేదు. ఇంకా వేతనాలు, తదితర అంశాల గురించి చర్చించాల్సి ఉంది’’ అని వివరించారు. ఈ వార్త ప్రచురించే సమయానికి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ‘‘మంగళవారం కూడా షూటింగ్‌ల బంద్‌ను కొనసాగించాలా, వద్దా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. అది రాత్రి పొద్దుపోయాక వచ్చే చర్చల ఫలితాన్ని బట్టి ఉంటుంది’’ అని వెంకటేశ్ చెప్పారు.