బయోమెట్రిక్ తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) పరిధిలోని కార్మికుల వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. కార్మికుల సమ్మె సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ కార్మికులు, రవాణా విభాగం డ్రైవర్ల వేతనాల పెంపుపై జీహెచ్‌ఎంసీకి అనుమతిచ్చింది. పెంచిన వేతనాలు జూలై 16 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. వేతనాల పెంపు నేపథ్యంలో కార్మికుల సాధారణ హాజరుతో పాటు వారికి బయోమెట్రిక్ విధానం అమలు, సమ్మెలో పాల్గొనరాదనే ఆదేశాలను సైతం ఉత్తర్వులో పేర్కొనడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తికి విఘాతం కలిగేలా కార్మికులు ఎలాంటి సమ్మెలకు దిగినా సహించేది లేదని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ కార్మికులు సమ్మెల్లో పాల్గొనరాదని, వారికి బయోమెట్రిక్ విధానం అమలు చేసే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితం ‘సాక్షి’ వెల్లడించిన సంగతి తెలిసిందే. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నాయని, నగరంలో జీవన వ్యయం ఎక్కువైనందున వారి వేతనాలు పెంచాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ గత నెల 16న ప్రభుత్వానికి లేఖ రాశారు.
కమిషనర్ ప్రతిపాదనలను అంగీకరించిన ప్రభుత్వం.. కార్మికులకు పెరిగిన వేతనాలను జీహెచ్‌ఎంసీ బడ్జెట్ నుంచే అందించాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది. దీనితో పాటు కార్మికులకు బయోమెట్రిక్ హాజరును అమలు చేయాలని, పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, అక్రమాలకు తావివ్వకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విధులకు హాజరయ్యే పారిశుధ్య కార్మికుల ఫొటోలతోపాటు వారు పనిచేసే ప్రాంతాల్లోని డస్ట్‌బిన్ల ఫొటోలను అప్‌లోడ్ చేయడంతోపాటు కార్మికుల బయోమెట్రిక్ హాజరు నమోదు బాధ్యతను శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లకు అప్పగించింది.
ఎంటమాలజీ వర్కర్ల ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ.. ప్రతిరోజూ వారు విధులకు హాజరయ్యే ప్రాంతాల వివరాలను కూడా అందజేయాల్సిందిగా ఎంటమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పజెప్పింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి వాహనానికీ జీపీఎస్ పరికరాన్ని అమర్చి అవి సక్రమంగా పనిచేసేలా చూడాల్సిన బాధ్యత డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ వర్కర్లపై ఉంచింది.