బయోమెట్రిక్
నగరం ఇక మరింత ‘స్వచ్ఛం’!
నేటి నుంచి 3 సర్కిళ్లలో పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ హాజరు
వారంలోగా అన్ని సర్కిళ్లలో అమలు
జీహెచ్‌ఎంసీ కసరత్తు పూర్తి..
నగరవ్యాప్తంగా పారిశుధ్య సేవలు మెరుగు
సిటీబ్యూరో: నగరంలో వీధులు ఇకపై మరింత పరిశుభ్రంగా కనపడనున్నాయి. స్వచ్ఛ హైదరాబాద్ అమలులో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ..పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ ద్వారా ఆధార్‌తో కూడిన హాజరును తప్పనిసరి చేస్తోంది. ఇప్పటి వరకు పారిశుధ్య గ్రూపుల్లో 12 మంది కార్మికులు ఉండాల్సి ఉండగా కేవలం ఆరేడుగురు మాత్రమే విధులు నిర్వహిస్తూ, మిగతా వారి పేరిట వేతనాల చెల్లింపులు జరిగిపోయేవి. తాజా బయోమెట్రిక్ విధానంతో ఇకపై విధుల్లో లేని కార్మికులను ఉన్నట్లుగా చూపించడం కుదరదు. విధుల్లో లేకుండా కేవలం కాగితాల్లోనే ఉన్న కార్మికులకు వేతనాలు చెల్లించడమూ కుదరదు. బయోమెట్రిక్ వల్ల కచ్చితంగా ఎవరైతే ఉండాలో, వారే విధుల్లో ఉండాలి. ఒకరి పేరిట మరొకరిని చూపించడానికి కూడా కుదరదు. అంతేకాదు.. బయోమెట్రిక్ మెషిన్‌నే తీసుకువెళ్లి హాజరు నమోదు చేయించడమూ కుదరదు. ఏ పరిధిలో.. ఏ వీధిలో పనిచేయాల్సిన కార్మికులు, వారిపై అజమాయిషీ చెలాయించే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ తమ పరిధిలోనే ఉండాలి. అక్కడ మాత్రమే పనిచేసేలా మెషిన్లలో చర్యలు తీసుకున్నారు. అంతే కాదు.. హాజరు నమోదు కాగానే కనిపించకుండా మాయమయ్యేందుకూ కుదరదు. మొత్తం మూడు పర్యాయాలు బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు. అంటే.. జీహెచ్‌ఎంసీ రికార్డుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులంతా ఇకపై పనివేళల్లో కచ్చితంగా విధుల్లో ఉంటారు. తద్వారా వీధులు, రోడ్లు చెత్త లేకుండా శుభ్రమవుతాయి. గైర్హాజరయ్యేవారి స్థానే ఇతరులను నియమిస్తారు.
అక్రమాల కట్టడికి..
పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.7500 నుంచి రూ.12,500లకు పెరిగాక, బినామీ కార్మికులెక్కువయ్యారు. తమ బదులు వేరొకరిని విధుల్లో పనిచేయిస్తూ, వారికి నెలకు నాలుగైదు వేలు మాత్రమే చెల్లిస్తున్న కార్మికులు కూడా ఉన్నారు. వీటన్నింటికీ చెక్ పెట్టి వాస్తవ కార్మికులకు మాత్రమే వేతనాలు చెల్లించేందుకు జీహెచ్‌ఎంసీ ఈ విధానాన్ని చేపట్టింది.
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పారిశుద్ధ్య కార్మికులతోపాటు ఎంటమాలజీ విభాగంలోని కార్మికులను కలుపుకొని మొత్తం 22 వేల మంది కార్మికులకు ఆధార్ లింకేజీతో కూడిన బయోమెట్రిక్ హాజరు విధానాన్ని మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీ రామారావు, మేయర్ బొంతు రామ్మోహన్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్, మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి నవీన్‌మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఉప్పల్, అంబర్‌పేట, కూకట్‌పల్లి సర్కిళ్లలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రారంభిస్తుండగా, వారంలోగా అన్ని సర్కిళ్లలో ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకుగాను 1200 బయోమెట్రిక్ నమోదు యంత్రాలను టెండరు ద్వారా అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. సంబంధిత శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ (ఎస్‌ఎఫ్‌ఏ) పరిధిలో ని కార్మికులకు రోజుకు మూడు పర్యాయాలు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తారు. ఒక ప్రాంతంలోని కార్మికులకు సంబంధించిన బయోమెట్రిక్ మెషిన్ మరో ప్రాంతంలో పనిచేయకుండా చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు ఎస్‌ఎఫ్‌ఏలను కూడా జియోట్యాగింగ్‌కు అనుసంధానం చేసినందున వారి పరిధిలోనే ఈ మెషిన్లు పనిచేస్తాయని అధికారులుపేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా అనలాజిక్స్ ఇండియాటెక్ అనే సంస్థ ఒక్కో మెషిన్‌కు నెలకు రూ.1175ల వంతున కాంట్రాక్టును దక్కించుకుంది.
గతంలో ఆబిడ్స్ సర్కిల్‌లో ప్రయోగాత్మకంగా చేపట్టినప్పుడు అక్రమార్కుల అవినీతి దందాకు బ్రేక్ పడినప్పటికీ గత కమిషనర్ బదిలీకాగానే బయోమెట్రిక్ యంత్రాలను నేలకు విసిరికొట్టి అటకెక్కించారు. గతంలోని అక్రమాల వల్ల ఏడెనిమిదేళ్లలో దాదాపు రూ. 250 కోట్లు పక్కదారి పట్టాయి. పారిశుధ్య కార్మికులకు బయోమెట్రిక్ హాజరు ఉంటే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మార్కులు పెరిగే అవకాశం కూడా ఉంది.