న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ విభాగాల్లో మహిళలు కేవలం 7.28 శాతమే ఉన్నారని హోంశాఖ తాజా గణాంకాల్లో తేలింది. దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులతో తమిళనాడు పోలీస్‌శాఖ తొలిస్థానంలో నిలిచింది. కేవలం 2.47 శాతం మహిళా ఉద్యోగులతో తెలంగాణ పోలీస్ విభాగం చివరన ఉంది. కశ్మీర్‌లోని 80వేల మంది పోలీస్ సిబ్బందిలో 3.05 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. దేశవ్యాప్తంగా 2015లో మహిళలపై 3,29,243 నేరాలు జరగగా.. ఈ సంఖ్య 2016 నాటికి 3,38,954కు చేరింది.
పోలీస్ విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 33 శాతానికి పెంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2009, 2012, 2016ల్లో మార్గదర్శకాలు జారీచేసినప్పటికీ పరిస్థితి మారలేదని హోంశాఖ తెలిపింది. తెలంగాణలోని 60,700 మంది పోలీస్ సిబ్బందిలో కేవలం 2.47 శాతం మహిళలు ఉండగా, యూపీలోని 3.65 లక్షల సిబ్బందిలో 3.81 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయలలోనూ మహిళా పోలీసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
తమిళనాడు తర్వాత హిమాచల్, మహారాష్ట్ర, గోవాలలో మహిళా పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్ పోలీస్‌విభాగంలో మహిళలు అత్యధికంగా ఉండగా, ఢిల్లీ పోలీస్ విభాగంలో కేవలం 8.64 శాతం మహిళా సిబ్బంది ఉన్నారు. దేశవ్యాప్తంగా 2015లో 34,651 రేప్ కేసులు నమోదుకాగా, 2016 నాటికి ఆ సంఖ్య 38,947కు చేరుకుందని పేర్కొంది. దేశంలో అత్యాచారాలు అధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ట్రలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. మహిళలపై నేరాల్లో భర్త, కుటుంబ సభ్యులపై నమోదైన కేసులే ఎక్కువ. మహిళలపై దాడి, అపహరణ, అత్యాచారం వంటి నేరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment