అలెప్పీలో వరద బాధితులకు ఆరోగ్య పరీక్షలు
న్యూఢిల్లీ/కొచ్చి: ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా దెబ్బతిన్న కేరళకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం లేదా ప్యాకేజీ అందించేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పట్టే అవకాశముందని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నష్టాన్ని పూర్తిగా అంచనా వేయడం దగ్గరి నుంచి నిధుల విడుదల వరకూ ఇదో సుదీర్ఘ ప్రక్రియ అని వెల్లడించారు. విపత్తుల సందర్భంగా నిధుల విడుదలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాల ప్రకారం.. సాధారణ రాష్ట్రాల విపత్తు సహాయ నిధి(ఎస్డీఆర్‌ఎఫ్)కి 75 శాతం, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 90 శాతం నిధులను కేంద్రం అందజేస్తుందన్నారు.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని కేంద్రం భావిస్తే సదరు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన సాయంలో గరిష్టంగా 25 శాతం నిధుల్ని ముందస్తుగా విడుదల చేయొచ్చు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి వాయిదాలో సర్దుబాటు చేస్తారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కేరళ పునర్నిర్మాణానికి నెల రోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని దేశ, విదేశాల్లో ఉన్న మలయాళీలకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ పిలుపునిచ్చారు. ఓ నెల వేతనం మొత్తాన్ని వదులుకోవడం కష్టమైన విషయమనీ, నెలకు 3 రోజుల వేతనం చొప్పున పది నెలల పాటు అందించి ప్రజలను ఆదుకోవాలన్నారు.
కేరళ కోసం గాంధీజీ విరాళాలు సేకరించిన వేళ..
తిరువనంతపురం: దాదాపు వందేళ్ల క్రితం కూడా కేరళలో ఇప్పటి స్థాయిలో వరదలు విధ్వంసం సృష్టించాయి. దీంతో మహాత్మా గాంధీ కేరళ ప్రజలను ఆదుకోవాలని దేశ ప్రజలకు పిలుపునివ్వగా చాలామంది ఉదారంగా స్పందించారు. 1924, జూలైలో మలబార్ (కేరళ)లో వరదలు విలయతాండవం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఊహకందని నష్టం సంభవించిందని యంగ్ ఇండియా, నవజీవన్ పత్రికల్లో గాంధీజీ వ్యాసాలు రాశారు. మలయాళీలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరారు.
దీంతో చాలామంది స్త్రీలు తమ బంగారు ఆభరణాలు, దాచుకున్న నగదును దానం చేయగా, మరికొందరు రోజుకు ఒకపూట భోజనం మానేసి మిగిల్చిన సొమ్మును సహాయ నిధికి అందించారు. ఈ విషయాన్ని గాంధీజీ స్వయంగా తాను రాసిన కథనాల్లో ప్రస్తావించారు. ఓ చిన్నారి అయితే మూడు పైసలను దొంగలిం చి వరద బాధితుల కోసం ఇచ్చిందని గాంధీ వెల్లడించారు. 6,994 రూపాయల 13 అణాల 3 పైసలు వసూలైనట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment