
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య ఏటా భారీగా పెరిగిపోతోంది.. అందులో సగానికిపైగా కేసుల్లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలే లిటిగెంట్లుగా ఉంటున్నాయి.. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల తీరు వివాదాలకు కారణమవుతోంది. దీంతో ఆయా శాఖలను ప్రతివాదులుగా చేస్తూ పిటిషన్లు దాఖలవుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో 3.21 లక్షల పెండింగ్ కేసులు ఉండగా.. అందులో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై దాఖలైనవే 1.68 లక్షల కేసులు కావడం గమనార్హం.
కోర్టుకు వెళ్లమంటున్నారు!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు తీసుకుంటున్న పలు నిర్ణయాలు, చర్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తే ‘కోర్టుకు వెళ్లి తేల్చుకోండి’అంటూ అధికారుల నుంచి సమాధానం వస్తోంది. దీంతో చాలా మంది హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
న్యాయమూర్తులు మధ్యంతర ఉత్తర్వుల రూపంలో పిటిషనర్లకు కొంతవరకు ఉపశమనం కల్పిస్తున్నారు. కానీ కేసు విచారణకు వచ్చినా ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయకపోవడం, తగిన వివరణ ఇవ్వకపోవడం, ఆదేశాలను అమలు చేయకపోవడం, పదే పదే వాయిదాలు కోరడం వంటి చర్యలు విచారణలు సుదీర్ఘంగా కొనసాగేందుకు కారణమవుతున్నాయి. కొన్ని కేసుల్లో రెండు సంవత్సరాలకు కూడా కౌంటర్ దాఖలు చేయాలని సందర్భాలున్నాయి.
4 పరిష్కరించేలోపు.. 40 కేసులు
ఓ కేసులో తుది విచారణ చేపట్టాలంటే దాని పూర్వాపరాల్లోకి వెళ్లి లోతుగా వాదనలు వినాల్సి ఉంటుంది. ఇందుకు గంటలకు గంటలు సమయం వెచ్చించాల్సి వస్తుంది. అది కూడా ప్రభుత్వాలు కౌంటర్లు దాఖలు చేయడం, సరైన వివరణ ఇవ్వడం వంటివి జరిగిన సందర్భాల్లోనే.
దీంతో న్యాయమూర్తులు తొలుత ఉపశమనం కోసం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి తర్వాత ఎప్పుడో తుది విచారణ చేపట్టాల్సి వస్తోంది. ఇక ఓవైపు నాలుగు కేసులను పరిష్కరించే సమయంలోనే.. మరోవైపు ప్రభుత్వ చర్యలపై నలభై కొత్త కేసులు దాఖలువుతున్నాయి. అయితే అవకాశమున్న సందర్భాల్లో మాత్రం న్యాయమూర్తులు ప్రభుత్వాలకు నిర్ధిష్టమైన ఆదేశాలిస్తూ కేసులను వేగంగా పరిష్కరిస్తున్నారు.
మళ్లీ మళ్లీ కోర్టు మెట్లెక్కిస్తున్నారు
ఇక కోర్టులు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులను అధికారులు అమలు చేయకపోవటంతో కక్షిదారులు తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. కోర్టు ధిక్కార పిటిషన్లు వేయాల్సిన పరిస్థితి ఉంటోంది. దీంతో న్యాయమూర్తులపై అదనపు భారం పడుతోంది. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తేనో, జైలుకు పంపాల్సి ఉంటుందని, జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరిస్తేనో తప్ప అధికారులు స్పందించడం లేదు. ఏకంగా ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను హాజరుకావాల్సిందిగా ఆదేశించాకే కోర్టుల ఉత్తర్వులు అమలైన ఉదంతాలూ ఉన్నాయి. 2015లో 2,534 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలుకాగా.. 2016లో 2,651కి పెరిగింది. ఈ ఏడాది నవంబర్ 20 నాటికి 2,398 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలయ్యాయి.
పెరుగుతున్న పెండింగ్ కేసులు
ఉమ్మడి హైకోర్టులో రెండు దశాబ్దాల కింద దాఖలైన పలు కేసులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి 2.85 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండగా.. ఈ ఏడాది నవంబర్ 17 నాటికి ఆ సంఖ్య 3.21 లక్షలకు చేరింది. ఇందులో ప్రభుత్వ చర్యలపై దాఖలైన రిట్ పిటిషన్లే 1,68,324 ఉన్నాయి. అంటే సగానికిపైగా పెండింగ్ కేసులు ప్రభుత్వాలకు సంబంధించినవే.
‘పెండింగ్’కు సమస్యలెన్నో..
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో ప్రభుత్వాలే అతి పెద్ద లిటిగెంట్ అని స్వయంగా ప్రధాని మోదీ గతేడాది జరిగిన జాతీయ న్యాయ సదస్సులో అంగీకరించడం గమనార్హం. ప్రభుత్వ లిటిగేషన్‌ను తగ్గించేందుకు నేషనల్ లిటిగేషన్ పాలసీ (ఎన్‌ఎల్‌పీ)ని రూపొందిస్తున్నామని ప్రకటించారు. కానీ అది అమల్లోకి రాలేదు. ఇక హైకోర్టులో న్యాయమూర్తుల పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవడం పెండింగ్ కేసులు పెరిగేందుకు కారణమవుతోంది. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 61 కాగా.. ప్రస్తుతం 31 మంది ఉన్నారు. మిగతా 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
రెవెన్యూ శాఖపైనే ఎక్కువ
రిట్ పిటిషన్లలో అత్యధికంగా రెవెన్యూశాఖపైనే దాఖలవుతున్నాయి. గ్రామస్థాయిలో భూ వివాదాలకు సంబంధించి ప్రజలు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేర్ల మార్పు, చేర్పులకు నిరాకరించడం, అసలు యజమాని స్థానంలో మరొకరిని చేర్చడం, రికార్డుల్లో పట్టా భూమి ఉంటే దానిని ప్రభుత్వ భూమిగా చూపడం, రీ సర్వే అండ్ రీ సెటిల్‌మెంట్ రిజిష్టర్ (ఆర్‌ఎస్‌ఆర్)లో ఖాళీలపై వివాదం వంటి చిన్న అంశాలపైనా అధికారులు వివాదం సృష్టించడం ఎక్కువైపోయిందనే విమర్శలు ఉన్నాయి.
దాంతో ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేరుస్తూ రిట్ పిటిషన్లు దాఖలవుతున్నాయి. పాస్ పుస్తకాలు, ఎన్‌వోసీలు, సేల్‌డీడ్ల రిజిస్ట్రేషన్లు తదితర వ్యవహారాల్లోనూ ఇదే పరిస్థితి. ఇలా దాఖలవుతున్న కేసులను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. దాంతో న్యాయమూర్తులు ఒకే అంశానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తూ.. వీలైనంత త్వరగా తీర్పులు ఇస్తున్నారు.
అయినా ప్రభుత్వాల తీరుతో ఫలితం లేకుండా పోతోంది. జి.సత్యనారాయణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో లక్షలాది మందికి, ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేలా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం అమలు చేయకుండా అప్పీలు చేసి వివాదాన్ని పెద్దది చేసింది. ఇక ఇటీవల భూసేకరణలో ప్రభుత్వాలు అడ్డగోలుగా వ్యవహరిస్తుండడంతో.. దీనిపై దాఖలవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరిగింది.
రెండో స్థానం పోలీసుశాఖదే!
పోలీసులు, వారు వ్యవహరిస్తున్న తీరుపై దాఖలవుతున్న కేసులు కూడా భారీగా ఉన్నాయి. ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయని సందర్భాల్లో హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఇక పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరుస్తుండటంతో బాధితులు న్యాయం కోసం హైకోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇక తెలంగాణకు పరిపాలనా ట్రిబ్యునల్ లేకపోవడంతో ఉద్యోగ వివాదాలూ హైకోర్టుకే చేరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment