బదిలీలతో బరితెగింపు | Vandalism with sudden transfers of Police Officers before polling | Sakshi
Sakshi News home page

బదిలీలతో బరితెగింపు

Published Tue, May 21 2024 3:49 AM | Last Updated on Tue, May 21 2024 3:49 AM

డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు నివేదిక సమర్పిస్తున్న సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌. చిత్రంలో ఎస్పీ రమాదేవి

డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు నివేదిక సమర్పిస్తున్న సిట్‌ చీఫ్‌ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌. చిత్రంలో ఎస్పీ రమాదేవి

ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్‌ నివేదిక

దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలం

పోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండ

దర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి

సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది.  మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్‌ బృందం ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌  ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌­కుమార్‌ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్‌ అధి­కా­రుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. 

బదిలీ చేసిన జిల్లాల్లోనే హింస
పోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్‌ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. 

ఈ క్రమంలో పోలింగ్‌ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

అదనపు సెక్షన్లు చేర్చండి..
విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్‌ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్‌షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్‌ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్‌ స్పష్టం చేసింది.

నాలుగు బృందాలు..
పోలింగ్‌ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్‌ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు  స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.

కుమ్మక్కుతో విధ్వంసకాండ
కాల్‌ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలి
సిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలు
కొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. పోలింగ్‌ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్‌ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్‌ ఇన్‌చార్జ్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. 

టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్‌సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్‌ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్‌ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.

బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి
చంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్‌ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.

అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్‌ 
వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.

హక్కులు కాలరాశారు: రావెల కిషోర్‌ బాబు 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 

33 కేసులు.. 1,370 మంది నిందితులు
పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్‌ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్‌ చేశారు. మరో 94 మందికి సెక్షన్‌ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement