కోదాడ: కరోనాతో మృతి చెందాడని బంధువులు ముఖం చాటేశారు.. తమకు ఎక్కడ అంటుకుంటుందేమోనని అయినవారు ఆమడదూరం పారిపోయారు. కానీ... మనిషిలో ఇంకా మానవత్వం మిగిలి ఉందని దానికి కుల మతాలు ఉండవని కొందరు ముస్లిం యువకులు నిరూపించగా.. ఎలా పోతే మాకేంటి పైసలే మాకు పరమావధి అన్నట్లు మరికొందరు ప్రవర్తించి దహనసంస్కారాలు చేయడానికి వచ్చిన వారి నుంచి మృతదేహాన్ని కాల్చినందుకు రూ.32 వేలను శ్మశానం సాక్షిగా వసూలు చేసి తమలోని ‘పైసా’చికత్వాన్ని చాటుకున్నారు.
ఈ హృదయవిదారక ఘటన గురువారం కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన మహంకాళి గోపాలకృష్ణమూర్తి (70) కరోనాతో మృతి చెందాడు. ఇతడు దివ్యాంగుడు. ఈయనకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేరు. కరోనాతో మృతి చెందడంతో బంధువులు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించడానికి ముందుకు రాలేదు. కేవలం ఇద్దరు బిడ్డలు, ఆయన సోదరుడు హుస్సేన్‌రావు మాత్రమే వచ్చారు. ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆరుగురు ముస్లిం యువకులు మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. మృతదేహాన్ని ఇంటినుంచి బయటికి తీసుకురావడంతో పాటు హిందూ శ్మశానవాటిక వద్దకు చేర్చారు. అక్కడ కూడా మృత దేహాన్ని వారే చితి మీదకు చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదంతా వారు ఉచితంగా సేవాదృక్పథంతో చేయడం గమనించదగ్గ విషయం..
రూ. 32 వేలు.. నిలబెట్టి వసూలు చేశారు..
కరోనాతో మృతి చెందిన గోపాలకృష్ణమూర్తి అంత్యక్రియలకు కోదాడ హిందూ శ్మశానవాటికలో రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని అక్కడ ఉన్నవారు డి మాండ్ చేసి మరీ వసూలు చేసినట్లు మృతుడి సోదరుడు హుస్సేన్‌రావు తెలిపాడు. చితి కోసం కేవలం ఆరుక్వింటాళ్ల కట్టెలు పెట్టి రూ. 32 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని ఇచ్చిన తర్వాతే మృతదేహాన్ని కాల్చారని వాపోయాడు. ఈ విషయాన్ని ఆయన రికార్డు చేసి సామాజికమాధ్యమంలో పెట్టడంతో చర్చనీయాంశమైంది. కరోనా మృతదేహాల దహనం కోసం సిబ్బందిని పెట్టామని పురపాలకసంఘం అధికారులు చెబుతున్నారని, కానీ వాస్తవంగా అక్కడ ఎవరూ లేరని ఈ దోపిడీపై అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment