శ్మ'శాన' పనుంది! | Though Funds Released For Graveyards, Work Left Unfinished In Andole | Sakshi
Sakshi News home page

శ్మ'శాన' పనుంది!

Published Sat, Jul 27 2019 2:11 PM | Last Updated on Sat, Jul 27 2019 2:11 PM

Though Funds Released For Graveyards, Work Left Unfinished In Andole - Sakshi

డాకూరులో అసంపూర్తిగా శ్మశాన వాటిక  నిర్మాణ పనులు

సాక్షి, అందోల్‌: జనన మరణాలు రెండే మానవ జన్మలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్న కార్యాలు. జననం ప్రతీ ఒక్కరిలో ఆనందాన్ని కలిగించి.. మరణం మాత్రం కుటుంబాల్లో ఆత్మీయుల్లో విషాదాన్ని నింపుతుంది. జన్మనెత్తిన ప్రతీ వారు జీవిత పయనంలో ఒకనాడు కాలం చేయక తప్పదు. చివరి పయనంలో జ్ఞాపకాలన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చే స్థలమే శ్మశానం. అంత్యక్రియలు నిర్వహించే స్థలం అక్కడ కనీస సౌకర్యాలు లేకపోతే ఎంతో బాధని కలిగిస్తుంది. స్వాతంత్య్ర సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా కనీసం శ్మశానవాటికలకు స్థలం కోసం ఇంకా పాలకులకు ప్రాధేయపడాల్సి రావడం విచారకరం.  

ప్రజల అవస్థలు.. 
అందోలు మండలంలోని అనేక గ్రామాల్లో శ్మశానవాటికలు వాటిల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు గ్రామాలలోకి వచ్చిన సమయంలో శ్మశానవాటికలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని మొరపెట్టుకున్నా అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాలలో స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ స్థలాలు ఉంటే వాటి సమీపంలో ఉన్న రైతులు ఆక్రమించుకోవడం లేదా కంప చెట్లతో కనీస సౌకర్యాలు లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చేసేదిలేక చెరువుల్లో ఖననం చేయాల్సిన దుస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అందోలు మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో డాకూరు గ్రామంలోనే శ్మశాన వాటిక పనులను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు.  

శ్మశాన వాటికలనూ వదలడం లేదు.. 
గ్రామాలల్లో శ్మశానవాటికలు ఉన్నప్పటికీ వాటి పక్కనే స్థలం ఉన్న వ్యక్తులు వాటిని ఆక్రమించుకుంటున్నారు. పలుసార్లు గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పరిష్కారం చేయకపోవడంపై విమర్శలను ఎదుర్కొంటున్నారు. స్థలాలు లేక రోడ్ల పక్కనే ఖననం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.   

మండలంలో 14 శ్మశానవాటికలకు నిధులు 
మండలం పరిధిలోని 14 గ్రామాలల్లో శ్మశానవాటికలు నిర్మించేందుకు గాను ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఒక్కొక్కదానికిగాను రూ.10 లక్షలు మంజూరు చేశారు. మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉండగా స్థలాలు అనుకూలంగా ఉన్నందుకుగాను 14 గ్రామాలకే నిధులు మంజూరు అయ్యాయి. మిగతా పది గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదు. మండలంలో డాకూరు, నాదులాపూర్‌ గ్రామాలలో మాత్రమే పనులు ప్రారంభించగా అవి కూడా అసంపూర్తిగానే మిగిలిపోయాయి.  

కొత్త సర్పంచ్‌లు అనుకూలంగా ఉన్నారు 
శ్మశాన నిర్మాణాలకు నిధులు మంజూరైన చోట కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌లు నిర్మించేందుకు సానుకూలంగా ఉన్నారు. ఒక్కొక్క శ్మశానవాటికకు రూ.10లక్షలు మంజూరు అయ్యాయి. అసంపూర్తిగా ఉన్న డాకూరు, నాదులాపూర్‌ గ్రామాల్లో కూడా తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కేవలం 14 పంచాయతీల్లో మాత్రమే నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయి.  
          – సత్యనారాయణ, ఎంపీడీఓ, అందోలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement