funds allocated
-
ఫార్మా క్లస్టర్స్‌కు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఫార్మా క్లస్టర్లు, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమిచ్చే బాటలో ప్రభుత్వం రూ. 500 కోట్లతో పథకాన్ని ప్రారంభించింది. తద్వారా దేశవ్యాప్తంగా ఆయా సంస్థల ఉత్పత్తి మెరుగు, నిలకడకు మద్దతివ్వనుంది. ఫార్మాస్యూటికల్స్, ఎరువులు, రసాయనాల శాఖ ఈ పథకానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) నుంచి 2025–26వరకూ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ పటిష్టతకు వీలుగా రూ. 500 కోట్లు కేటాయించినట్లు తెలియజేసింది. పెరుగుతున్న డిమాండుకు అనుగుణమైన మద్దతిచ్చేందుకు పథకాన్ని ఉద్దేశించినట్లు పేర్కొంది. ఈ పథకం ప్రస్తుత ఫార్మా క్లస్టర్లు, ఎంఎస్ఎంఈలు మెరుగైన ఉత్పత్తిని సాధించడం, నాణ్యత, నిలకడను అందిపుచ్చుకోవడం తదితరాలకు దన్నుగా నిలవనున్నట్లు వివరించింది. ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలను పటిష్టం చేయడం ద్వారా ఫార్మాస్యూటికల్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొంది. దీనిలో భాగంగా ఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈలు జాతీయ, అంతర్జాతీయ నియంత్రణా ప్రమాణాలు అందుకునే బాటలో వెచ్చించే పెట్టుబడి రుణాలపై వడ్డీ రాయితీ లేదా సబ్సిడీ అందించనున్నట్లు తెలియజేసింది. చదవండి: బైజూస్ భారీగా నిధుల సమీకరణ -
శ్మ'శాన' పనుంది!
సాక్షి, అందోల్: జనన మరణాలు రెండే మానవ జన్మలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్న కార్యాలు. జననం ప్రతీ ఒక్కరిలో ఆనందాన్ని కలిగించి.. మరణం మాత్రం కుటుంబాల్లో ఆత్మీయుల్లో విషాదాన్ని నింపుతుంది. జన్మనెత్తిన ప్రతీ వారు జీవిత పయనంలో ఒకనాడు కాలం చేయక తప్పదు. చివరి పయనంలో జ్ఞాపకాలన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చే స్థలమే శ్మశానం. అంత్యక్రియలు నిర్వహించే స్థలం అక్కడ కనీస సౌకర్యాలు లేకపోతే ఎంతో బాధని కలిగిస్తుంది. స్వాతంత్య్ర సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా కనీసం శ్మశానవాటికలకు స్థలం కోసం ఇంకా పాలకులకు ప్రాధేయపడాల్సి రావడం విచారకరం. ప్రజల అవస్థలు.. అందోలు మండలంలోని అనేక గ్రామాల్లో శ్మశానవాటికలు వాటిల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు గ్రామాలలోకి వచ్చిన సమయంలో శ్మశానవాటికలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని మొరపెట్టుకున్నా అమలుకు నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాలలో స్థలం కేటాయింపులో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ స్థలాలు ఉంటే వాటి సమీపంలో ఉన్న రైతులు ఆక్రమించుకోవడం లేదా కంప చెట్లతో కనీస సౌకర్యాలు లేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చేసేదిలేక చెరువుల్లో ఖననం చేయాల్సిన దుస్థితి దాపురించిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందోలు మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో డాకూరు గ్రామంలోనే శ్మశాన వాటిక పనులను ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. శ్మశాన వాటికలనూ వదలడం లేదు.. గ్రామాలల్లో శ్మశానవాటికలు ఉన్నప్పటికీ వాటి పక్కనే స్థలం ఉన్న వ్యక్తులు వాటిని ఆక్రమించుకుంటున్నారు. పలుసార్లు గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా పరిష్కారం చేయకపోవడంపై విమర్శలను ఎదుర్కొంటున్నారు. స్థలాలు లేక రోడ్ల పక్కనే ఖననం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మండలంలో 14 శ్మశానవాటికలకు నిధులు మండలం పరిధిలోని 14 గ్రామాలల్లో శ్మశానవాటికలు నిర్మించేందుకు గాను ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఒక్కొక్కదానికిగాను రూ.10 లక్షలు మంజూరు చేశారు. మండలంలో మొత్తం 24 గ్రామ పంచాయతీలు ఉండగా స్థలాలు అనుకూలంగా ఉన్నందుకుగాను 14 గ్రామాలకే నిధులు మంజూరు అయ్యాయి. మిగతా పది గ్రామాల్లో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేదు. మండలంలో డాకూరు, నాదులాపూర్ గ్రామాలలో మాత్రమే పనులు ప్రారంభించగా అవి కూడా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కొత్త సర్పంచ్‌లు అనుకూలంగా ఉన్నారు శ్మశాన నిర్మాణాలకు నిధులు మంజూరైన చోట కొత్తగా గెలుపొందిన సర్పంచ్‌లు నిర్మించేందుకు సానుకూలంగా ఉన్నారు. ఒక్కొక్క శ్మశానవాటికకు రూ.10లక్షలు మంజూరు అయ్యాయి. అసంపూర్తిగా ఉన్న డాకూరు, నాదులాపూర్ గ్రామాల్లో కూడా తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. కేవలం 14 పంచాయతీల్లో మాత్రమే నిర్మించేందుకు నిధులు మంజూరు అయ్యాయి. – సత్యనారాయణ, ఎంపీడీఓ, అందోలు -
పాలమూరు రైల్వే ప్రాజెక్టులకు నిదులు
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం కరుణించింది. గతేడాది తరహాలోనే మునీరాబాద్ రైల్వేలైన్‌కు రూ.275కోట్లు కేటాయించగా.. సికింద్రాబాద్–మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు మరో రూ.200 కోట్లు కేటాయించినట్లు బుధవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మరోవైపు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మాచర్ల–గద్వాల రైల్వేలైన్‌తో పాటు మహబూబ్‌నగర్ ఆదర్శ రైల్వేస్టేషన్‌కు ఈ ఏడాది కూడా మోక్షం కలగలేదు. ఇటీవలే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. రైల్వే ప్రాజెక్టుల నిధుల వివరాలను గురువారం దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. బడ్జెట్లో మహబూబ్‌నగర్– మునీరాబాద్ రైల్వే, సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు అధిక నిధులు వెచ్చించారు. మునీరాబాద్‌కు గతేడాది రూ.275 కోట్లు కేటాయించగా ఈసారి కూడా రూ.275 రావడం విశేషం. అలాగే డబ్లింగ్ లైన్‌కు రూ.200 కోట్లు విడుదల చేశారు. రెండేళ్ల నుంచి అధికం.. దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ లైన్‌కు గత రెండేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గతేడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఉందానగర్ నుంచి ప్రారంభమైన డబ్లింగ్ రైల్వే పనులు జిల్లా పరిధిలో చురుగ్గా సాగుతున్నాయి. ఈ రైల్వే లైన్ పూర్తిపై ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 9 మేజర్, 92 మైనర్ బ్రిడ్జిల నిర్మాణం పనులు కూడా కొనసాగుతున్నాయి. ఏడాదిలోపు డబ్లింగ్ లైన్ పూర్తయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. తగ్గనున్న దూరభారం సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ లైన్ పూర్తయితే జిల్లా ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు లభిస్తుంది. మహబూబ్‌నగర్ నుంచి వంద కి.మీ. దూరంలో ఉన్న సికింద్రాబాద్‌కు వెళ్లడానికి ప్యాసింజర్‌కు 3 గంటలు, ఎక్స్‌ప్రెస్‌కు 2.30 గంటల సమయం పడుతుంది. డబ్లింగ్ లైన్ పూర్తయితే గంట సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. పురోగతిలో మునీరాబాద్ మహబూబ్‌నగర్– మునీరాబాద్ రైల్వేలైన్ 246 కి.మీ. నిర్మాణానికి 1997– 98లో ఆమోద ముద్ర లభించింది. రూ.645 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టగా ప్రస్తుత మధ్యంతర బడ్జెట్లో రూ.275 కోట్లు కేటాయించారు. గతేడాది సైతం ఇదే స్థాయిలో నిధులు వచ్చాయి. ఈ లైన్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 29 కి.మీ. మేర పూర్తయ్యాయి. దేవరకద్ర– జక్లేర్ మధ్య లైన్ పనులు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని కృష్ణాతో పాటు కర్ణాటక రాష్ట్రం మునీరాబాద్ పరిధిలో పనులు పురోగతిలో ఉన్నాయి. సర్వేల్లోనే గద్వాల– మాచర్ల గద్వాల– మాచర్ల రైల్వేలైన్ నిర్మాణం కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటి వరకు ఆమోదమే లభించలేదు. దీని కోసం మూడు సార్లు సర్వే పూర్తయినా రైల్వేలైన్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభకాకపోవడం ఈ ప్రాంత ప్రయణికులను ఆవేదనకు గురిచేస్తోంది. మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా మార్చాలన్న డిమాండ్ కూడా నెరవేరడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బోథ్: హామీల దారి..అలాగే మిగిలింది
సాక్షి, బోథ్: హామీల దారి..అలాగే మిగిలింది. బోథ్ మండలకేంద్రం నుంచి రఘునాథ్‌పూర్ మీదుగా అడెల్లి దేవస్థానానికి రోడ్డు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇచ్చిన హామీలు కలలుగానే మిగిలాయి. నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. పూర్తవుతుందనుకున్న రోడ్డు పూర్తి కాలేదు. దీంతో రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అడెల్లి రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తామని నాయకులు మళ్లీ ఎన్నికల్లో హామీలు గుప్పించాయి. గతంలో అటవీ అనుమతులు లభించినా ఆర్అండ్బీ అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధుల అలసత్వం తో రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలో విఫలయ్యారు. దీంతో రోడ్డు పనుల అనుమతులు ఆగి పోయాయి. కేంద్ర ప్రభుత్వం షరతులతో కూడిన స్టేజ్ వన్ అటవీ అనుమతులు జారీ చేసింది. దీంతో రోడ్డు పనులకు అడ్డంకులు తొలగిపోయాయని అంతా భావించారు. కానీ ప్రభుత్వం ఆర్ అండ్‌బీశాఖ నుంచి నిధులు ఇవ్వడంలో విఫలమవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మొదటిదశ అనుమతులు మంజూరు. అడెల్లి రోడ్డు నిర్మాణానికి ఇక్కడి ప్రజలు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఏర్పడక ముం దు ప్రజాప్రతినిధులు రోడ్డు విషయమై పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత బోథ్ అటవీ రేంజ్ అధికారులు రోడ్డు నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతి కోసం జూన్ ఒకటో తేదీ, 2017న కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ, అటవీ, వాతావరణశాఖ సాధ్యాసాధ్యాలను పరిశీలించి 2017, ఆగస్టు 4వ తేదీన రోడ్డు నిర్మాణానికి పలు షరతులతో కూ డిన అనుమతులు మొదటి దశలో జారీ చేసింది. రోడ్డు నిర్మాణం కోసం రోడ్డు భవనాలశాఖకు దాదాపు 4.67 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతోంది. అటవీశాఖ కోల్పోతున్న భూమి, చెట్లు ఆశాఖ వారు మరోచోట అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. వీటి అభివద్ధికి కావాల్సిన నిధులను రోడ్డు భవనాల శాఖ ఇవ్వాల్సి ఉంది. ఈ షరతులతో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండోదశలో రోడ్డు భవనాలశాఖ అటవీ శాఖకు అవసరమగు నిధులు కేటాయిస్తే రెండోదశలో పూర్తి స్థాయి అనుమతులు లభిస్తాయి. కాగా రోడ్డు పనులకోసం ఇప్పటికే రూ.4 కోట్ల యాభై ఐదు లక్షలు మంజూరై ఉన్నాయి. దీంతో రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉన్నా అవసరమగు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. రోడ్డు నిర్మాణం పూర్తయితే తగ్గనున్న భారం... రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు మండలాల మధ్య దూరం తగ్గనుంది. గతంలో అడెల్లి, సారంగాపూర్‌కు వెళ్లాలంటే దాదాపు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేది. రోడ్డు పూర్తయితే బోథ్ సారంగాపూర్‌కు వెళ్లాలంటే కేవలం 20 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దాదాపు 40 కిలోమీటర్ల దూరభారం తగ్గనుంది. గత ఇరవై ఏళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఇక్కడి ప్రజలే డిమాండ్ చేశారు. మూడేళ్లక్రితం బోథ్ మండలంలోని కుచులాపూర్ వేంకటేశ్వర ఆలయం నుంచి రఘునాథ్‌పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మించారు. అటవీ అనుమతులు లేకపోవడంతో పనులు నిలిపివేశారు. -
జక్కన్న చెక్కిన చదువుల గుడి
కశింకోట(అనకాపల్లి): కశింకోటలోని డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతి సమస్య పరిష్కారానికి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బృందం చేయూతనిచ్చింది. ఆ బృందం సుమారు రూ.40 లక్షల సమకూర్చగా నాలుగు తరగతి గదులతో నిర్మించిన భవనం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ భవనానికి రాజమౌళి తన తల్లి రాజనందిని పేరుతో ‘జనని రాజనందిని’గా నామకరణం చేశారు. స్వాతంత్య్రం కోసం మొదటిసారి సిపాయిల తిరుగుబాటు జరిగిన 1857వ సంవత్సరంలోనే ఇక్కడి పాఠశాల ప్రారంభమైంది. హుద్‌హుద్ తుపానుకు ముందుగానే భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వసతి సమస్య కారణంగా వేరే పాఠశాలలో తరగతులు నిర్వహించవలసి వస్తోంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హుద్‌హుద్ తుపాను అనంతరం పాఠశాలల్లో భవనాలు నిర్మించాలని సంకల్పించిన సినీ దర్శకుడు రాజమౌళి... కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడి పాఠశాలలో భవన నిర్మాణానికి ముందుకు వచ్చి నిధులు సమకూర్చారు. ఈ భవనంలోనే వర్చువల్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా నిధులను సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పాఠాలను ఈ తరగతుల ద్వారా విద్యార్థులు వినడానికి, అక్కడ ఉండే ఉపాధ్యాయులతో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలగనుంది. అందుకు ఎసీ సౌకర్యం కల్పించడానికి అవసరమైన సీలింగ్ పనులు నిర్వహిస్తున్నారు. -
ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ప్యాకేజీ!
2015-16 బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ప్రభుత్వ కసరత్తు సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు)గా సాంకేతికంగా గుర్తింపు పొందినా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందక వెనుకబడిపోతున్న ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ కులాలు, వర్గాల మధ్య సమస్థాయిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఎస్సీల్లో అల్పసంఖ్యాక వర్గాలు, ఆయా అభివృద్ధి ఫలాలు అందక నిర్లక్ష్యానికి గురవుతున్న ఉపకులాలను గుర్తించి అందులోని ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీని వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇదివరకే ఎస్సీ అభివృద్ధిశాఖ ఆయా సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఎస్సీలకు సంబంధించిన ఉపప్రణాళిక కింద వచ్చే నిధులను ఆయా ఎస్సీ కులాల జనాభా ప్రకారం నేరుగా తమ శాఖకే కేటాయించాలని కూడా సూచించింది. ఈ విధంగా తమ వద్దనున్న నిధులను ఆయా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వ్యక్తిగతంగా ఎస్సీ కుటుంబాలకు నేరుగా అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి పంపిన సిఫార్సుల్లో పేర్కొంది. ఈ కులాల్లోని అల్పసంఖ్యాక వర్గాలకు ఆయా పథకాల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి 2015-16 బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఎస్టీ విద్యార్థులకు స్టడీ సెంటర్లు... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గిరిజన విద్యార్థుల కోసం సొంత భవనాల్లో స్టడీ సెంటర్లతోపాటు ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇతర హాస్టళ్లకు కూడా సొంత భవనాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని చేర్చే ఆలోచనతో గిరిజన సంక్షేమశాఖ ఉంది. హైదరాబాద్‌తోపాటు వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే గిరిజన విద్యార్థులకు స్టడీ సెంటర్లు నడుస్తున్నాయి. రాష్ర్టంలోని పది జిల్లాల్లో అన్ని హంగులతో స్టడీ సెంటర్లను ఏర్పాటుతో విద్యార్థులకు తగిన శిక్షణనిచ్చే అవకాశం ఉంటుందని ఈ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతంలోనే ఈ స్టడీ సెంటర్ల ఏర్పాటు కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.10 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి జిల్లాలో గిరిజన భవన్లను ఏర్పాటు చేయాలని కూడా ఈ శాఖ నిర్ణయించింది. దీనిద్వారా ఆయా సామాజిక కార్యక్రమాలు, వ్యక్తిగత శుభకార్యాలు జరుపుకునేందుకు ఇవి దోహదపడతాయని ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.