రాజమౌళి బృందం నిర్మించిన ‘జనని రాజనందిని’ తరగతి గదుల భవనం
కశింకోట(అనకాపల్లి): కశింకోటలోని డీపీఎన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వసతి సమస్య పరిష్కారానికి ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బృందం చేయూతనిచ్చింది. ఆ బృందం సుమారు రూ.40 లక్షల సమకూర్చగా నాలుగు తరగతి గదులతో నిర్మించిన భవనం పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఈ భవనానికి రాజమౌళి తన తల్లి రాజనందిని పేరుతో ‘జనని రాజనందిని’గా నామకరణం చేశారు.
స్వాతంత్య్రం కోసం మొదటిసారి సిపాయిల తిరుగుబాటు జరిగిన 1857వ సంవత్సరంలోనే ఇక్కడి పాఠశాల ప్రారంభమైంది. హుద్‌హుద్ తుపానుకు ముందుగానే భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వసతి సమస్య కారణంగా వేరే పాఠశాలలో తరగతులు నిర్వహించవలసి వస్తోంది.
దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో హుద్‌హుద్ తుపాను అనంతరం పాఠశాలల్లో భవనాలు నిర్మించాలని సంకల్పించిన సినీ దర్శకుడు రాజమౌళి... కలెక్టర్ సూచనల మేరకు ఇక్కడి పాఠశాలలో భవన నిర్మాణానికి ముందుకు వచ్చి నిధులు సమకూర్చారు.
ఈ భవనంలోనే వర్చువల్ తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వం తాజాగా నిధులను సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి పాఠాలను ఈ తరగతుల ద్వారా విద్యార్థులు వినడానికి, అక్కడ ఉండే ఉపాధ్యాయులతో సందేహాలు నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలగనుంది. అందుకు ఎసీ సౌకర్యం కల్పించడానికి అవసరమైన సీలింగ్ పనులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment