2015-16 బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ప్రభుత్వ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు)గా సాంకేతికంగా గుర్తింపు పొందినా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందక వెనుకబడిపోతున్న ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎస్సీ కులాలు, వర్గాల మధ్య సమస్థాయిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. దీనిలో భాగంగా ఎస్సీల్లో అల్పసంఖ్యాక వర్గాలు, ఆయా అభివృద్ధి ఫలాలు అందక నిర్లక్ష్యానికి గురవుతున్న ఉపకులాలను గుర్తించి అందులోని ప్రజలకు ప్రత్యేక ప్యాకేజీని వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.
ఇందుకు సంబంధించి ఇదివరకే ఎస్సీ అభివృద్ధిశాఖ ఆయా సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఎస్సీలకు సంబంధించిన ఉపప్రణాళిక కింద వచ్చే నిధులను ఆయా ఎస్సీ కులాల జనాభా ప్రకారం నేరుగా తమ శాఖకే కేటాయించాలని కూడా సూచించింది. ఈ విధంగా తమ వద్దనున్న నిధులను ఆయా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వ్యక్తిగతంగా ఎస్సీ కుటుంబాలకు నేరుగా అందించే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి పంపిన సిఫార్సుల్లో పేర్కొంది. ఈ కులాల్లోని అల్పసంఖ్యాక వర్గాలకు ఆయా పథకాల ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి 2015-16 బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఎస్టీ విద్యార్థులకు స్టడీ సెంటర్లు...
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గిరిజన విద్యార్థుల కోసం సొంత భవనాల్లో స్టడీ సెంటర్లతోపాటు ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇతర హాస్టళ్లకు కూడా సొంత భవనాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు 2015-16 బడ్జెట్ ప్రతిపాదనల్లో ఈ అంశాన్ని చేర్చే ఆలోచనతో గిరిజన సంక్షేమశాఖ ఉంది. హైదరాబాద్‌తోపాటు వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే గిరిజన విద్యార్థులకు స్టడీ సెంటర్లు నడుస్తున్నాయి. రాష్ర్టంలోని పది జిల్లాల్లో అన్ని హంగులతో స్టడీ సెంటర్లను ఏర్పాటుతో విద్యార్థులకు తగిన శిక్షణనిచ్చే అవకాశం ఉంటుందని ఈ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గతంలోనే ఈ స్టడీ సెంటర్ల ఏర్పాటు కోసం జిల్లాకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.10 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రతి జిల్లాలో గిరిజన భవన్‌లను ఏర్పాటు చేయాలని కూడా ఈ శాఖ నిర్ణయించింది. దీనిద్వారా ఆయా సామాజిక కార్యక్రమాలు, వ్యక్తిగత శుభకార్యాలు జరుపుకునేందుకు ఇవి దోహదపడతాయని ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక ప్యాకేజీ!
Published Wed, Feb 18 2015 2:51 AM | Last Updated on Sat, Sep 15 2018 3:59 PM
Advertisement