అందుకే నన్ను అంత దారుణంగా కొట్టారు!
'నా వయస్సు 16 ఏళ్లు. బిహార్ ముజఫర్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. తరగతి గదిలో నన్ను ఎందుకు నిర్దాక్షిణ్యంగా ఇద్దరు విద్యార్థులు చితకబాదారో చెప్పమని అందరూ అడుతున్నారు' అని బిహార్‌కు చెందిన దళిత విద్యార్థి తొలిసారి నోరువిప్పాడు. కేంద్రియ విద్యాలయంలో ఇద్దరు విద్యార్థులు అతన్ని అమానుషంగా చితక్కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అతనిపై దాడి చేసిన ఇద్దరు తోటి విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో తరగతి గదిలో తననను అమానుషంగా కొట్టిన వీడియోను పదేపదే మీడియాలో ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ అతను ఓ టీవీ నెట్‌వర్క్‌కు లేఖ రాశాడు. చదువులో తాను మంచి మార్కులు తెచ్చుకోవడంతో సహించలేకనే తనను తోటి విద్యార్థులు కొట్టి హింసించారని, గత రెండేళ్లుగా తనను ఇలాగే కొడుతున్నారని, దళితులకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసకు ఇది మరొక తార్కాణమని అతను లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
'నేను దళితుడ్ని కావడంతో పరీక్షల్లో, చదువులో బాగా రాణించినప్పుడు ఇంట్లో నాకు ప్రశంసలు దక్కుతుండగా.. తరగతి గదిలో అవమానాలు, దాడులు ఎదురవుతున్నాయి' అని ఎన్డీ టీవీకి రాసిన లేఖలో అతను పేర్కొన్నాడు.
ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన పోలీసులు కూడా షాకింగ్ వివరాలు తెలిపారు. 'గత కొన్నాళ్లుగా అతన్ని తోటి విద్యార్థులు హింసిస్తున్నారు. అతనిపై దాడులు చేసినవారే అతన్ని కొడుతున్న దృశ్యాన్ని రికార్డు చేశారు. అతన్ని కొట్టినవారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం' అని ముజఫర్‌పుర్ పోలీసు దర్యాప్తు అధికారి బబ్బన్ బైతా తెలిపారు.