
పాట్నా: బిహార్ రోహ్తాస్ జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు 144 సెక్షన్ విధించారు. అలాగే జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఏప్రిల్ 4వరకు సెలవులు ప్రకటించారు. కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లను కూడా తెరవొద్దని నిర్వాహకులకు తెలిపారు.
కేంద్రహోమంత్రి అమిత్‌షా పర్యటనకు ముందు మార్చి 31న నలంద జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ముగ్గురికి బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఆ తర్వాత రోహ్తాస్ జిల్లాలోనూ గురువారం ఘర్షణలు చెలరేగాయి. శనివారం వరకు ఇవి కొనసాగాయి. ఈనేపథ్యంలోనే ప్రజలు శాంతియుతంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు కోరారు. పోలీసు బలగాలను రంగంలోకి దించి పటిష్టభద్రతా ఏర్పాట్లు చేశారు. స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు.
ఘర్షణలకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 50మందినిపైగా అరెస్టు చేశారు. పలుకేసులు నమోదు చేశారు. బిహార్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా కూడా శాంతిభద్రతల దృష్ట్యా తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
చదవండి: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ పూనావాలాపై దాడి.. జైలులో చితకబాదిన తోటి ఖైదీలు..!