సాక్షి, న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దర్యాగంజ్ హింసాత్మక ఘటనకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఇంకా కొనసాగుతున్నాయి. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నిరసనకారులు శనివారం ఉదయం బ్యానర్లు, ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. నిరసనలు ఉధృతం కావడంతో ప్రజా జీవనం స్తంభించింది.ఆందోళనకారుల నిరసనలతో పలుచోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి. అయితే హింసకు ప్రేరేపిస్తున్నారంటూ భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్‌తో పాటు మరో 15మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇవాళ తీస్ హజారే కోర్టులో హాజరు పరచారు.
కాగా పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిబెంగాల్ ఆందోళనలతో అట్టుడికిపోతున్నాయి. అధిక సంఖ్యలో విద్యార్థులు, సామాన్యులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వీరిని కట్టడి చేసేందుకు పోలీసులు చేపడుతున్న చర్యల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు సీఏఏను నిరసిస్తూ ఆర్జేడీ ఇచ్చిన పిలుపుతో బిహార్‌లో బంద్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment