పీఈటీ జ్యోత్స్న తీరుపై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేస్తున్న విద్యార్థినులు
ఒంగోలు టౌన్: ఆ పాఠశాలలో చదువుకుంటున్న బాలికలు కత్తి యుద్ధం (ఫెన్సింగ్) పోటీల్లో ప్రావీణ్యం సాధించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన ఆ పాఠశాల పీఈటీ ఏకంగా కత్తి యుద్ధం పోటీలకు వెళ్లద్దంటూ ఆదేశించింది. తన భర్త నేర్పిస్తున్న కబడ్డీ క్రీడకు మాత్రమే వెళ్లాలంటూ హుకుం జారీ చేసింది. తమకు కబడ్డీ రాదని, ఫెన్సింగ్ పోటీలకు వెళతామని ఆ బాలికలు చెప్పిన నాటి నుంచి వెదురు బొంగుతో కొట్టడం మొదలుపెట్టింది. కత్తి యుద్ధం వీడి కబడ్డీకి వెళతామని చెప్పేవరకు వారిని ప్రతిరోజూ కొట్టడం ప్రారంభించింది. ఈ బాధలు తట్టుకోలేని బాలికలు తాము పాఠశాల మానివేస్తామంటూ తమ తల్లిదండ్రుల వద్ద వాపోయారు. ఎందుకు ఇలా చెబుతున్నారంటూ వారిని దగ్గరకు తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో శుక్రవారం ఆ బాలికలు వారి తల్లిదండ్రులను తీసుకొని నేరుగా ఆ పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీస్తే నీళ్లు నమిలింది.
వివరాల్లోకి వెళితే..
ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరుగురు బాలికలు ఫెన్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపించి ఇద్దరు జాతీయ పోటీలకు కూడా ఎంపికయ్యారు. అలాంటి బాలికలను అభినందించాల్సిన ఆ స్కూల్ పీఈటీ జ్యోత్నానదేవి వారిపై కత్తి కట్టింది. పీఈటీ కోర్సు చేíసి కబడ్డీ శిక్షణ ఇస్తున్న తన భర్త వద్దకు ఫెన్సింగ్ మానుకొని కబడ్డీ ప్రాక్టీసుకు వెళ్లాలంటూ హుకుం జారీచేసింది. తాము వెళ్లమని ఆ బాలికలు చెప్పడంతో వెదురుబొంగుకు పని చెప్పింది. గత కొన్ని రోజుల నుండి వెదురుబొంగుతో విచక్షణారహితంగా వారిని కొడుతుండటంతో ఆ బాధలు తట్టుకోలేని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు మీడియా, చైల్డ్‌లైన్ సమక్షంలో నేరుగా పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీయడంతో ఆ పీఈటీ తనకే పాపం తెలిదన్నట్లుగా వ్యవహరించి తప్పించుకునే ప్రయత్నం చేశారు.
షాడో పీఈటీ..
పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా జ్యోత్సా్నదేవి పనిచేస్తున్నప్పటికీ, ఆమె భర్త షాడో పీఈటీగా వ్యవహరిస్తున్నాడు. పాఠశాల జరుగుతున్న సమయంలోనే షాడో పీఈటీగా వ్యవహరిస్తూ బాలికలపై పెత్తనం చేస్తున్నట్లు పలువురు బాలికలు మీడియా వద్ద వాపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న స్కూల్ గేమ్స్‌లో భాగంగా జిల్లాకు చెందిన ఫెన్సింగ్ బాలికల జట్టు నెల్లూరులో సెప్టెంబర్ 29వ తేదీ జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరింది. అందులో పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు బాలికలు కూడా ఉన్నారు. ఆ బాలికలతోపాటు పీఈటీ జ్యోత్న్సాదేవి వెళ్లాల్సి ఉంది. కానీ, ఆమె వెళ్లకుండా తన భర్తను పంపించింది. బాలికలను రైలులో ఎక్కించి షాడో పీఈటీగా వ్యవహరిస్తున్న ఆమె భర్త మోటార్ బైక్‌పై నెల్లూరు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కూడా అదేమాదిరిగా వచ్చాడు. ఆ రోజు పీఈటీ జ్యోత్సా ్నదేవి రిజిస్టర్‌లో ఆన్ డ్యూటీ(ఓడీ)గా సంతకం చేశారు. అంటే ఆమె విధుల్లో ఉండి బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకువెళ్లకుండా, ఆమె భర్తను పంపించడం వివాదాస్పదమైంది.
బాలల సంక్షేమ కమిటీ దృష్టికి..
పీవీఆర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ జ్యోత్న్సాదేవిపై బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధులు దేవకుమారి, కోటేశ్వరరావు విలేకరులకు చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ దృష్టికి తీసుకుళ్లున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment