పనులు జరగని కంచర్లవారిపల్లి గ్రౌండ్
కనిగిరి(ప్రకాశం): క్రీడాభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాజెక్టు గాండీవం లక్ష్యాన్ని గురిపెట్టడం లేదు. ఎంతో ప్రచార ఆర్భాటంగా చేపడుతున్న ఈ పథకం లక్ష్యం మంచిదే అయినా క్షేత్ర స్థాయిలో కనీస వసతుల సమకూర్చలేదు. దీంతో విద్యార్థుల్లో క్రీడాభివృద్ధి మాటల గారడిగానే మారనుందనే విమర్శలున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లో మొత్తం 2,985 పాఠశాలలుండగా, అందులో 2,411 ప్రాథమిక, 179 ప్రాథమికోన్నత, 395 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటికి సంబంధించి గతేడాది లెక్కల ప్రకారం 4,78,050 లక్షల మంది విద్యార్థులున్నారు. జిల్లాలో 150 మంది పీడీలు, 250 మంది పీఈటీలున్నారు.
నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో 464 ప్రభుత్వ పాఠశాలుండగా అందులో సుమారు 29,226 మంది విద్యార్థులున్నట్లు అంచనా. కనిగిరి మండలంలో సుమారు 10 వేల మంది విద్యార్థులున్నారు. జూలై 1 నుంచి 12 వరకు పాఠశాల స్థాయిలో.. 13 నుంచి నెలాఖరు వరకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతి పాఠశాలలో 6–10 తరగతి తరగతి విద్యార్ధులను 20 మందిని ఎంపిక చేసి మండలానికి 250 మందిని క్రీడా ప్రతిభ కలిగిన వారిని జిల్లా స్థాయికి పంపారు. జిల్లా మొత్తంలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరిలో కొందరిని జల్లెడపట్టి ప్రతిభ కలిగిన వారిని వెయ్యిమందిని గాండీవం క్రీడలకు వెలికితీసి క్రీడా శిక్షణ ఇస్తారు. మిగతా వారిని పాంచజన్యకు (రెండో విడతకు) ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 100 శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయగా, జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో కనిగిరి మండలం కంచర్లవారిపల్లి, ఇంకొల్లు, కరేడు, యద్దనపూడి, కొత్తపట్నం, ఉలవపాడులలో శిక్షణా కేంద్రాలు నిర్వహించనున్నారు.
వాస్తవికత ఇదీ..
క్రీడాకారుల ఎంపికలో క్షేత్ర స్థాయిలో 9 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఎత్తు, బరువు, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబులిటీ, షటిల్ రన్, స్పీడ్‌రన్, స్టాండింగ్ జంప్, మెడిసిన్‌బాల్, 200 మీటర్స్ రన్ వీటిలో జిల్లాలోని 56 మండలాల్లో ఐదు, ఆరు మండలాల్లో తప్పా ఎక్కడా 200 మీటర్ల పరుగుపందెం నిబంధన ప్రకారం జరగలేదు. ఎందుకంటే ఎక్కడా రన్ ట్రాక్ లేదు. అంతేగాక టెన్‌వీక్స్ సంస్థ నిర్దేశించిన సమయంలో 200 మీటర్ల పరుగును 10 ఏళ్ల విద్యార్థి 30 సెకండ్లల్లో, 16 ఏళ్ల విద్యార్థి 25 సెకండ్లలో పరుగు పెట్టడం అసాధ్యం. దీన్ని బట్టి చూస్తే లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరే అవకాశం లేదు.
క్రీడా మైదానాలకు గ్రహణం..
జిల్లాలో క్రీడా మైదానాల అభివృద్ధికి గ్రహణం ఏర్పడింది..ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద జెడ్పీ ఉన్నత పాఠశాలల గ్రౌండ్‌ల అభివృద్ధికి గతేడాది పనులు చేపట్టింది. (ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఉపాధి కూలీలు) లేబర్ వర్క్ తో సగం, మెటీరియల్ కాంపోనెంట్‌తో సగం ఫిప్టి, ఫిఫ్టిగా ఒక్కో పాఠశాల ప్లే గ్రౌండ్ అభివృద్ధికి రూ.5 లక్షల అంచనా విలువతో మంజూరు చేశారు. అందులో రన్నింగ్ ట్రాక్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్ట్‌లు తయారు చేయాల్సి ఉంది. అంచనా విలువలు తగ్గించడం.. రాజకీయ జోక్యాలు.. ఇలా కారణాలు ఏమైనా జిల్లాలో 15 శాతం క్రీడా మైదానాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో జిల్లాలో వేలాది మంది క్రీడా విద్యార్థులు ఆట స్థలాలకు దూరంగా ఉన్నారు. గతేడాది లెక్కల ప్రకారం జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 82,321 మంది విద్యార్థులు చదువుతున్నారు. వేలాది మంది విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తితో చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటున్నారు.
జిల్లాలోని 56 మండలాల్లోని 290 జెడ్పీ, ఉన్నత పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా మొదటి విడతగా..232 స్కూల్స్‌ను అనుమతి ఇచ్చారు. వాటిలో 20 శాతం కూడా ప్లే గ్రౌండ్లు పూర్తికాలేదు. కొన్ని చోట్ల ఆరంభానికే నోచుకోలేదు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కనిగిరిలో 6, హెచ్‌ఎంపాడులో 5, పామూరులో 5, సీఎస్‌పురంలో 5, వెలిగండ్లలో 6, పీసీపల్లిలో 5 జెడ్పీ ఉన్నత పాఠశాలలకు ప్లే గ్రౌండ్‌లు మంజూరు కాగా వాటిలో 10 శాతం మాత్రమే పనులు ప్రారంభమై ఆరంభం శూరత్వంగా నిలిచాయి. హెచ్‌ఎంపాడు మండలంలో మొహమ్మదాపురం పాఠశాలలో కొన్ని పనులు జరిగాయి. కారణాలు ఏమైనా కనిగిరి మండలంలో పాతపాడు, ఏరువారిపల్లి, గురువాజీపేట, దిరిశవంచలో అసలు మొదలు కాలేదు. తాళ్లూరు, కంచర్లవారిపల్లిలో గ్రౌండ్‌ను తవ్వి వదిలేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్ధులు ఆటకు అనేక అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా ఆయా పాఠశాలల్లో కనీస నడిచే పరిస్థితి లేదు.
Comments
Please login to add a commentAdd a comment