works pending
-
ఆర్ఎఫ్సీఎల్కు రాజకీయ గ్రహణం
సాక్షి, రామగుండం: తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలో ఎరువుల కొరతను తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్ నిర్మిస్తున్నారు. ప్లాట్ నిర్మాణం 99.5శాతం పూర్తి కాగా, త్వరలో ప్రారంభం కానుంది. ఆర్ఎఫ్సీఎల్లో మరో ఆరునెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుండడంతో రాజకీయ గ్రహణం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ప్లాంట్‌లో పట్టుకోసం పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక సంఘాల జేఏసీలు ప్రయత్నిస్తున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు.. కొందరు దళారులు తెరపైకి వచ్చి స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగాలిప్పిస్తామంటూ.. సొమ్ములు దండుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. 1970 అక్టోబర్ 2న ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) కంపెనీని స్థాపించారు. ఆ సమయంలో వీర్లపల్లి, లక్ష్మీపురం, అడ్డగుంటపల్లి, ఎల్కలపల్లి గ్రామాలకు సంబంధించిన 1284 ఎకరాల భూములు స్వాధీనం చేసుకున్నారు. 1980 నవంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. దాదాపు 19 సంవత్సరాలపాటు సాగిన ఉత్పత్తిని నష్టాలు రావడంతో 1999 మార్చి 31న కంపెనీని మూసివేశారు. ఇందులో 1,069 పర్మినెంట్ ఉద్యోగులకు వీఎస్ఎస్ ద్వారా తొలగించారు. అలాగే రెండువేల మంది కాంట్రాక్ట్ కార్మికులను అర్దాంతరంగా రోడ్డున పడేశారు. తిరిగి ఆర్‌ఎఫ్‌సీఎల్‌గా పునరుద్ధరణ నష్టాల్లో ఉన్న ఎఫ్‌సీఐని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సుమారు రూ.5,254 కోట్లతో 2015 సంవత్సరంలో నిర్మాణ పనులు ప్రారంభించారు. పునరుద్ధరణ వ్యయం రూ.5,254 కోట్ల నుంచి రూ.6120 కోట్లకు పెరిగింది. దీనిలో కేంద్ర ప్రభుత్వం 63శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 11శాతం, 26శాతం ప్రైవేట్ సంస్థలకు వాటాగా నిర్ణయించారు. కంపెనీలో ప్రతిరోజు 2,200 టన్నుల ఆమ్మోనియా, 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్వాసితులకు న్యాయం జరిగేనా...? ఆర్ఎఫ్సీఎల్ ప్రారంభ సమయంలో 2015 మార్చి 11న ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల, ప్రభావిత గ్రామల ప్రజలకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎఫ్‌సీఐ నిర్మాణానికి లక్ష్మీపురం, ఎల్కలపల్లి, జనగామ, వీర్లపల్లి గ్రామాల ప్రజలు ఎరువుల కర్మాగారం నిర్మాణానికి 1,284 ఎకరాల భూమిని ఇచ్చారు. అప్పట్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న యాజమాన్యం ఇంత వరకు వారికి ఉద్యోగావకాశాలు చూపించలేదు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు, ప్లాంట్‌లో పనిచేసి వీఎస్ఎస్ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన వారికి, కాంట్రాక్ట్ కార్మికులకు, ప్రభావిత గ్రామాల యువతకు ఉద్యోగాలు ఏ విధంగా లభిస్తాయో వేచి చూడాలి. రాజకీయ గ్రహణం.. ‘స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగం’ అనే అస్త్రాన్ని ఉపయోగిస్తూ.. పలు రాజకీయ పార్టీలు ఆర్ఎఫ్సీఎల్లో ఇప్పటినుంచే పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి. రోజుకో కార్మికసంఘం పేరిట ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. దీనికి తోడు ఆర్ఎఫ్సీఎల్ పునః ప్రారంభం అవుతుండడంతో పుట్టగొడుగుల్లా దళారులు పుట్టుకొస్తున్నారు.ఆర్ఎఫ్సీఎల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఇప్పటికే కొంతమంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. ఉద్యోగంపై ఉన్న ఆశతో యువకులు దళారులను ఆశ్రయించి మోసపోతున్నట్లు సమాచారం.ఇప్పటికైనా యాజమాన్యం దళారీ వ్యవస్థను అరికట్టాల్సి అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. -
మున్సిపాలిటీ వచ్చే.. ఉపాధి పోయే..!
ఇబ్రహీంపట్నంరూరల్: మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లో కూలీలు ఉపాధి హామీ పనులు కోల్పోయారు. నిబంధనల ప్రకారం మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పథకం వర్తించదు. ఇబ్రహీంపట్నం నియో జవర్గంలోని తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంగళ్‌పల్లి, యంపీ పటేల్‌గూడ, రాందాస్‌పల్లి, బొంగ్లూర్, కొంగరకలాన్, ఆదిబట్ల గ్రామాలతో ఆదిబట్ల మున్సిపాలిటీ ఏర్పడింది. ఇంతకుముందు ఈ ఆరు గ్రామాల్లో 1728 మంది కూలీ లు ఉపాధి హామీ జాబ్‌కార్డులు పొందారు. ఉపా ధి పనులు జరిగే సమయంలో వీరు రోజుకు రూ. 150 నుంచి రూ.180 వరకు సంపాదిస్తారు. అయితే వారు ఇప్పుడు మున్సిపాలిటీ ఏర్పాటుతో ఉపాధి కోల్పోయారు. సూమారు 5వేల మందికి పైగా కూలీలు పనులకు దూరమయ్యారు. పనులు ఆగిపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు భరోసా .. గత 12 సంవత్సరాలుగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. అయితే, మున్సిపాలిటీ ఏర్పాటు తర్వాత కూలీలను పట్టించుకోని ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లకు మాత్రం భరోసా కల్పించింది. మున్సిపాలిటీల్లో విలీనం అయ్యే గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను ఇతర గ్రామాల్లో ఖాళీగా ఉన్న చోట పనిచేసే విధంగా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కూలీలకు ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. -
ప్రాజెక్టు పనులకు గ్రహణం !
బాల్కొండ (నిజామాబాద్): ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి దశాబ్ద కాలం తరువాత గతేడాది భారీగా నిధులు మంజూరయ్యాయి. నిధులున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. గతేడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం శంకు స్థాపన కోసం ప్రాజెక్ట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీలో పలు అభివృద్ధి పనుల కోసం రూ. 26 కోట్లు, లక్ష్మి కాలువ ఆధు నికీకరణకు రూ. 20 కోట్లు మంజూరు చేశారు. నవంబర్ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, ఇప్పటికీ 80 శాతం పనులు ప్రారంభం కాలేదు. అధికారులేమో పనులు ప్రారంభించాలని కాం ట్రాక్టర్లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నా రు. పనులు సకాలంలో ప్రారంభించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. లక్ష్మి కాలువ అంతే.. శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ లక్ష్మికాలువ ఆధునికీకరణ కోసం రూ. 20 కోట్లు గతేడాది మంజూరు కాగా పనులను మేలో ప్రారంభించారు. కాలువపై అక్కడక్కడా వంతెనల నిర్మాణం, లక్ష్మి లిఫ్టు వద్ద రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పనులు నిలిపి వేశారు. ప్రాజెక్ట్ నుంచి నవంబర్ 15 వరకు నీటి విడుదల కొనసాగుతుంది. రబీలో నీటి సరఫరా చేసే అవకాశం ఉండటంతో వేసవి వరకు పనులు అటకెక్కినట్లే. ఆనకట్ట ప్రాటెక్షన్ వాల్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆనకట్టకు ఇరువైపులా ప్రాటెక్షన్ వాల్ నిర్మించడానికి రూ. 8 కోట్ల 31 లక్షల 70 వేలు మంజూరు అయ్యాయి. ఇది వరకే కుడి వైపు కిలోమీటర్, ఎడమ వైపు కిలో మీటర్ మేర సెఫ్టీ వాల్ ఉంది. దానిని పూర్తిగా నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ పూర్తయినా వరకు పనులు ప్రారంభించ లేదు. రివిట్ మెంట్.. ఎస్సారెస్పీ ఆనకట్ట రివిట్ మెంట్ మరమ్మతుల కోసం రూ. 5 కోట్ల 34 లక్షల 70 వేలు మంజూ రు అయ్యాయి. రివిట్ మెంట్ పనులను వేసవి కాలంలో ప్రారంభించి ఎట్టకేలకు చివరి దశకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఆనకట్టపై పెరిగిన చెట్లను తొలిగించే పనులు చేపడుతున్నారు. ప్రారంభం కాని బీటీ రోడ్డు.. ప్రాజెక్ట్ ఆనకట్ట కుడి, ఎడమలు కలిపి 13.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పూర్తిగా గుంతల మయంగా మారింది. బీటీ తొలగిపోయి మొత్తం మట్టి రోడ్డు ఏర్పడింది. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల 64 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రాజెక్ట్ ప్రధాన రోడ్డు మరమ్మతులు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జాతీయ రహదారి 44 నుంచి ప్రాజెక్ట్ వరకు గల మూడు కిలోమీటర్ల రోడ్డు తారు కొట్టుకు పోయింది. ఆ రోడ్డు మరమ్మతులకు రూ. కోటి 94 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమైన రెండు రోజులకే నిలిచిపోయాయి. నోటీసులు ఇచ్చాం : ప్రాజెక్ట్ వద్ద చేపట్ట వలిసిన పనులు ప్రారంభించక పోవడంపై కాంట్రాక్టర్‌కు పలు మార్లు నోటీసులు ఇచ్చాం. పనులు ప్రారంభించ కుంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళుతాం. – శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ, ఎస్సారెస్పీ -
‘పెండింగ్ ’ పరుగులు!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏ క్షణమైనా ప్రభుత్వ రద్దు నిర్ణయం వెలువడనుందన్న సమాచారం నేప థ్యంలో.. నీటి పారుదల శాఖలో పెండింగ్ ఫైళ్లకు అనుమతులు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తమ నియోజకవర్గంలోని పనులను ఆ మోదించాలని ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో అధికారులు ఫైళ్ల దుమ్ముదులిపారు. బుధవారం ఒక్కరోజే నీటి పారుదల శాఖలో ఏకంగా రూ.7,829 కోట్ల విలువైన పనులను కేబినెట్లో పెట్టి ఆమోదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఇందులో ఆరు ఎత్తిపోతల పథకాల ప్రతిపాదనలు ఉన్నాయి. ఆరు ఎత్తిపోతల పథకాలు.. గురువారం ప్రభుత్వ రద్దు ఖాయమనే ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్ పనులన్నీ క్లియర్ చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. ఇక ఆయా శాఖల పరిధిలో ఉన్న పెండింగ్ ఫైళ్లను తక్షణమే ప్రభుత్వానికి పంపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నీటి పారుదల శాఖపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లను ప్రభుత్వానికి పంపేలా చేశారు. నల్లగొండ జిల్లాలోని అయిటిపాముల ఎత్తిపోతల పథకాన్ని ఆమోదించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరగా.. అధికారులు రూ.111 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. మరో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఒత్తిడి మేరకు బొత్తలపాలెం–వాడపల్లి ఎత్తిపోతలను రూ.241 కోట్లు, కేశవపురం–కొండ్రపోల్ ఎత్తిపోతలకు రూ.77.25 కోట్లు, దున్నపోతుల గండి ఎత్తిపోతలకు రూ.249 కోట్లతో ప్రతిపాదనలను అధికారులు కేబినెట్ ఆమోదం కోసం పంపారు. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ కాల్వలపై జకోరా, చండూరు ఎత్తిపోతలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించారు. జకోరాను రూ.40 కోట్లు, చండూరును రూ.22.94 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. ఇదే జిల్లాలో రూ.476 కోట్లతో జూకల్ నియోజకవర్గంలో మంజీరా ఎత్తిపోతలకు మంగళవారమే ప్రభుత్వం అనుమతించింది. 47 రిజర్వాయర్లు.. రూ.4,179 కోట్లు గద్వాల నియోజకవర్గంలో గట్టు ఎత్తిపోతల పథకంలో 4 టీఎంసీల సామర్ధ్యంతో పెంచికల్ పహాడ్ రిజర్వాయర్ నిర్మించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో రూ.1,597 కోట్ల కొత్త అంచనాతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. దీంతో పాటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కొత్తగా 47 ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను 16.11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదనలు రాగా, వీటికి ఏకంగా రూ.4,179 కోట్లతో అంచనా వేశారు. ఇందులో ఏకంగా కాల్వల నిర్మాణానికే రూ.1,276 కోట్లు ప్రతిపాదించగా, వీటికి కేబినెట్ ఆమోదం రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దిగువన పూర్వ మెదక్ జిల్లాలో 1.26 లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చే సంగారెడ్డి కెనాల్ వ్యవస్థ కోసం వేసిన అంచనాలు కేబినెట్ ఆమోదం కోసం పంపారు. రూ.1,326.34 కోట్లతో అంచనాలు సిద్ధం చేయగా, వీటిని కేబినెట్ ఆమోదిస్తే, మూడు రీచ్‌లుగా విడగొట్టి పనులకు టెండర్లు పిలిచేందుకు నీటి పారుదల శాఖ సమాయత్తమైంది. ఈ పనులకు సంబంధించి గురువారం నాటి కేబినెట్ భేటీలో చర్చ జరిగితే.. ఆమోదం లాంఛనమే అని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. పలు ఎత్తిపోతల పథకాలకు నిధులు బుధవారం రాత్రి పలు ఎత్తిపోతల పథకాలు, వాటి పరిధిలోని పనులకు సంబంధించి జీవోలు వెలువడ్డాయి. వనపర్తి జిల్లాలో చిన్నబావి మండల పరిధిలో గోప్లాపూర్ ఎత్తిపోతల పథకం పనుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1.17 కోట్లు కేటాయించింది. ఇదే మండల పరిధిలోని చిన్నమారూర్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.6.47 కో ట్లు కేటాయించింది. నిర్మల్ జిల్లా పరిధిలో వెంకటాపూర్ ఎత్తిపోతల పథకం పరిధిలో అదనపు పనులు చేపట్టేందుకు వీలుగా రూ.62.50 లక్షలు కేటాయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని పెద్దచెరువు పునరుద్ధరణకు రూ.2.36 కోట్లు కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చా రు. నాలుగో విడత మిషన్ కాకతీయలో భాగంగా దుర్గం చెరువు రూ.40.25 కోట్లు, మల్క చెరువు రూ.6.68 కోట్లు, నల్లగండ్ల చెరువు రూ.15.49 కోట్లు కలిపి మొత్తంగా రూ.62.54 కోట్లతో సవరించిన అంచనాలకు అనుమతులు ఇచ్చారు. -
టెండర్లు మరిచారు..
సాక్షి, ఆదిలాబాద్: కోట్ల రూపాయల పనులిచ్చారు.. టెండర్లు మాత్రం మరిచారు.. ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు.. పనులకు సంబంధించి ఇక్కడి నుంచి అంచనా వ్యయాలు రూపొందించి పంపించినప్పటికీ సాంకేతిక అనుమతి రాలేదు. టెండర్లకు మోక్షం కలగడం లేదు. అప్పట్లో మున్సిపాలిటీ పనులను ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. టెండర్లకు సంబంధించి వివిధ దశల ప్రక్రియలను పూర్తి చేయడంలో జిల్లా ఆర్అండ్బీ అధికారుల లోపమా, లేనిపక్షంలో రాష్ట్రస్థాయిలో పనులకు అనుమతినివ్వడంలో ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయం నుంచే జాప్యం జరుగుతుందా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పట్లో మున్సిపాలిటీ పనులు చేపట్టే పరిస్థితి లేదని ఆర్‌అండ్‌బీకి అప్పగించగా ఇప్పుడు ఆర్అండ్బీ తీరుతో విస్మయం వ్యక్తమవుతోంది. రూ.28 కోట్ల పనులు.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం బడ్జెట్లోనే ప్రత్యేక నిధులు కేటాయించింది. దీనికి సంబంధించి ప్రతీ మున్సిపాలిటీకి కోట్ల రూపాయల పనులను మంజూరు చేసింది. ఆదిలాబాద్ మున్సిపాలిటిలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు జీఓఆర్టీ నెం.187 ద్వారా 2018 మార్చి 22న రూ.28.30 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులు మంజూరై దాదాపు ఐదు నెలలు అవుతోంది. అప్పట్లో ఈ పనులను మున్సిపాలిటీ నుంచి ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. దీనిపై మున్సిపల్ కాంట్రాక్టర్లలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మున్సిపాలిటీలో ఈ పనులు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ ఆర్‌అండ్‌బీకి అప్పగించడంలో ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఈ పనులను చేపట్టలేదని ఒకవేళ భావిస్తే ఇప్పుడు ఆర్అండ్బీ టెండర్ల దశకు తీసుకొచ్చేందుకే ఆపసోపాలు పడుతోంది. ఐదు నెలల క్రితం మంజూరైన ఈ నిధులను అప్పట్లోనే వినియోగించుకుంటే ఇప్పటికే పనులు కూడా ఓ దశకు వచ్చేవి. ఇప్పుడు వర్షాలు కురుస్తుండడంతో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ దశలో ఆర్అండ్బీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్కా మార్చిలో మంజూరైన ఈ నిధులకు సంబంధించి ఒకవేళ తామే చేపట్టి ఉంటే ఈపాటికి పనులను ప్రారంభించేవారని మున్సిపల్ అధికారులు చెబుతుండడం గమనార్హం. ఎక్కడ లోపం.. జిల్లా కేంద్రం ఆదిలాబాద్‌లో పలు ముఖ్యమైన మార్గాల్లో రోడ్లు, డివైడర్లు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, భారీ మురికి కాల్వల నిర్మాణాల కోసం ఈ నిధుల ద్వారా అంచనా వ్యయాలు రూపొందించారు. వీటిని స్థానిక ఆర్అండ్బీ అధికారులు సీఈ పరిశీలన కోసం పంపించారు. దానికి సంబంధించి సాంకేతిక అనుమతినిచ్చిన పక్షంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలుస్తారు. అయితే అంచనా వ్యయం రూపొందించి ఇక్కడి నుంచి పంపించామని అధికారులు చెబుతున్నారు. మరి సాంకేతిక అనుమతినివ్వడంలో ప్రధాన కార్యాలయంలో జాప్యం ఎందుకు జరుగుతుందన్నది వారికే తెలియాలి. ప్రధానంగా రోడ్లు, భవనాల నిర్మాణాలు ఉండడంతో వేర్వేరు సీఈలు సాంకేతిక అనుమతులివ్వాల్సి ఉంటుందని, దీనివల్లే ఆలస్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇది వాస్తవమా, కాదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బీలో పోస్టుల ఖాళీ నేపథ్యంలో టెండర్ల నిర్వహణ క్రమాలకు సంబంధించి ఇక్కడే జాప్యం జరిగిందన్న విమర్శలు లేకపోలేదు. ఇవి మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు కావడం, కేటాయించిన నిధుల్లో అధిక పనులు, అంచనా వ్యయాలు ఉండడంతోనే ఆర్అండ్బీ అధికారులు కొంత నిర్లక్ష్యం చేస్తున్నారన్న అపవాదు వ్యక్తమవుతోంది. సాధారణంగా ఆర్అండ్బీ చేపట్టే పనులు తక్కువ సంఖ్యలో ఉన్నా అవి వందల వేల కోట్ల రూపాయల విలువైనవి ఉంటాయి. అలాంటి సమయంలో మున్సిపాలిటీకి సంబంధించి కేవలం కొన్ని కోట్ల రూపాయల్లోనే వందల సంఖ్యలో పనుల అంచనా వ్యయాలను రూపొందించడంతో దానికి సాంకేతిక అనుమతినివ్వడంలో పైనుంచి ఆల స్యం జరుగుతుందన్న అభిప్రాయం లేకపోలేదు. 117 పనులు.. రూ.28 కోట్లకు సంబంధించి 117 పనుల అంచనా వ్యయాలను రూపొందించారు. అందులో ప్రధానంగా రిమ్స్ వెనకాల, మహాలక్ష్మివాడలో డ్రైనేజీల నిర్మాణాలు, వివేకానంద చౌక్‌నుంచి రైల్వే స్టేషన్ వరకు, పంజాబ్‌చౌక్ నుంచి దేవిచంద్చౌక్ వరకు డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఫుట్‌పాత్‌ల నిర్మాణాలు చేపట్టాలి. సిటీ బ్యూటిఫికేషన్లో భాగంగా డివైడర్లలో అందమైన మొక్కలు, ఫౌంటేయిన్స్, పెయింటింగ్స్, తదితరవి చేపట్టాలి. అసంపూర్తిగా మిగిలిన కొత్త మున్సిపాలిటీ భవనానికి సంబంధించి మరో మూడున్నర కోట్లు ఈ నిధుల నుంచే కేటాయించారు. పలుచోట్ల బీటీ, సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా ఉన్నాయి. అంచనా వ్యయాలు రూపొందించి పంపించాం మున్సిపాలిటీలో రూ.28 కోట్లతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనా వ్యయాలను రూపొందించి పంపించాం. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్లు నిర్వహిస్తాం. ప్రభుత్వం నుంచి ఆర్‌అండ్‌బీకి జీఓ రావడంలోనే ఆలస్యం జరిగింది. ఈ నిధుల్లో రోడ్లతోపాటు భవనాల నిర్మాణాలు కూడా ఉండడంతో హెడ్ ఆఫీసులో వేర్వేరు సీఈల నుంచి సాంకేతిక అనుమతి లభించాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఇవి తుది దశకు వచ్చింది. త్వరలోనే టెండర్లు నిర్వహిస్తాం. – వెంకట్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ, ఆదిలాబాద్ -
గురి తప్పిన గాండీవం
కనిగిరి(ప్రకాశం): క్రీడాభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాజెక్టు గాండీవం లక్ష్యాన్ని గురిపెట్టడం లేదు. ఎంతో ప్రచార ఆర్భాటంగా చేపడుతున్న ఈ పథకం లక్ష్యం మంచిదే అయినా క్షేత్ర స్థాయిలో కనీస వసతుల సమకూర్చలేదు. దీంతో విద్యార్థుల్లో క్రీడాభివృద్ధి మాటల గారడిగానే మారనుందనే విమర్శలున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లో మొత్తం 2,985 పాఠశాలలుండగా, అందులో 2,411 ప్రాథమిక, 179 ప్రాథమికోన్నత, 395 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటికి సంబంధించి గతేడాది లెక్కల ప్రకారం 4,78,050 లక్షల మంది విద్యార్థులున్నారు. జిల్లాలో 150 మంది పీడీలు, 250 మంది పీఈటీలున్నారు. నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో 464 ప్రభుత్వ పాఠశాలుండగా అందులో సుమారు 29,226 మంది విద్యార్థులున్నట్లు అంచనా. కనిగిరి మండలంలో సుమారు 10 వేల మంది విద్యార్థులున్నారు. జూలై 1 నుంచి 12 వరకు పాఠశాల స్థాయిలో.. 13 నుంచి నెలాఖరు వరకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతి పాఠశాలలో 6–10 తరగతి తరగతి విద్యార్ధులను 20 మందిని ఎంపిక చేసి మండలానికి 250 మందిని క్రీడా ప్రతిభ కలిగిన వారిని జిల్లా స్థాయికి పంపారు. జిల్లా మొత్తంలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరిలో కొందరిని జల్లెడపట్టి ప్రతిభ కలిగిన వారిని వెయ్యిమందిని గాండీవం క్రీడలకు వెలికితీసి క్రీడా శిక్షణ ఇస్తారు. మిగతా వారిని పాంచజన్యకు (రెండో విడతకు) ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 100 శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయగా, జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో కనిగిరి మండలం కంచర్లవారిపల్లి, ఇంకొల్లు, కరేడు, యద్దనపూడి, కొత్తపట్నం, ఉలవపాడులలో శిక్షణా కేంద్రాలు నిర్వహించనున్నారు. వాస్తవికత ఇదీ.. క్రీడాకారుల ఎంపికలో క్షేత్ర స్థాయిలో 9 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఎత్తు, బరువు, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబులిటీ, షటిల్ రన్, స్పీడ్‌రన్, స్టాండింగ్ జంప్, మెడిసిన్‌బాల్, 200 మీటర్స్ రన్ వీటిలో జిల్లాలోని 56 మండలాల్లో ఐదు, ఆరు మండలాల్లో తప్పా ఎక్కడా 200 మీటర్ల పరుగుపందెం నిబంధన ప్రకారం జరగలేదు. ఎందుకంటే ఎక్కడా రన్ ట్రాక్ లేదు. అంతేగాక టెన్వీక్స్ సంస్థ నిర్దేశించిన సమయంలో 200 మీటర్ల పరుగును 10 ఏళ్ల విద్యార్థి 30 సెకండ్లల్లో, 16 ఏళ్ల విద్యార్థి 25 సెకండ్లలో పరుగు పెట్టడం అసాధ్యం. దీన్ని బట్టి చూస్తే లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరే అవకాశం లేదు. క్రీడా మైదానాలకు గ్రహణం.. జిల్లాలో క్రీడా మైదానాల అభివృద్ధికి గ్రహణం ఏర్పడింది..ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద జెడ్పీ ఉన్నత పాఠశాలల గ్రౌండ్ల అభివృద్ధికి గతేడాది పనులు చేపట్టింది. (ఎన్ఆర్ఈజీఎస్, ఉపాధి కూలీలు) లేబర్ వర్క్ తో సగం, మెటీరియల్ కాంపోనెంట్‌తో సగం ఫిప్టి, ఫిఫ్టిగా ఒక్కో పాఠశాల ప్లే గ్రౌండ్ అభివృద్ధికి రూ.5 లక్షల అంచనా విలువతో మంజూరు చేశారు. అందులో రన్నింగ్ ట్రాక్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్ట్లు తయారు చేయాల్సి ఉంది. అంచనా విలువలు తగ్గించడం.. రాజకీయ జోక్యాలు.. ఇలా కారణాలు ఏమైనా జిల్లాలో 15 శాతం క్రీడా మైదానాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో జిల్లాలో వేలాది మంది క్రీడా విద్యార్థులు ఆట స్థలాలకు దూరంగా ఉన్నారు. గతేడాది లెక్కల ప్రకారం జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 82,321 మంది విద్యార్థులు చదువుతున్నారు. వేలాది మంది విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తితో చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని 56 మండలాల్లోని 290 జెడ్పీ, ఉన్నత పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా మొదటి విడతగా..232 స్కూల్స్‌ను అనుమతి ఇచ్చారు. వాటిలో 20 శాతం కూడా ప్లే గ్రౌండ్లు పూర్తికాలేదు. కొన్ని చోట్ల ఆరంభానికే నోచుకోలేదు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కనిగిరిలో 6, హెచ్‌ఎంపాడులో 5, పామూరులో 5, సీఎస్‌పురంలో 5, వెలిగండ్లలో 6, పీసీపల్లిలో 5 జెడ్పీ ఉన్నత పాఠశాలలకు ప్లే గ్రౌండ్లు మంజూరు కాగా వాటిలో 10 శాతం మాత్రమే పనులు ప్రారంభమై ఆరంభం శూరత్వంగా నిలిచాయి. హెచ్‌ఎంపాడు మండలంలో మొహమ్మదాపురం పాఠశాలలో కొన్ని పనులు జరిగాయి. కారణాలు ఏమైనా కనిగిరి మండలంలో పాతపాడు, ఏరువారిపల్లి, గురువాజీపేట, దిరిశవంచలో అసలు మొదలు కాలేదు. తాళ్లూరు, కంచర్లవారిపల్లిలో గ్రౌండ్‌ను తవ్వి వదిలేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్ధులు ఆటకు అనేక అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా ఆయా పాఠశాలల్లో కనీస నడిచే పరిస్థితి లేదు. -
అటకెక్కిన ‘అమృత్’
- ‘అనంత’లో మొదలుకాని రూ.50 కోట్ల పనులు - అభివృద్ధిపై పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ధి - గ్రూపు రాజకీయాలతో ప్రజా శ్రేయస్సు గాలికి.. అనంతపురంలోని 32వ డివిజన్లో ఉన్న బుద్ధవిహార్ పార్కు ఇది. దీన్ని అమృత్ పథకం కింద రూ.50 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప 2016 జూన్ 25న శంకుస్థాపన చేశారు. ఇంతవరకు ఇవి అంగుళం కూడా ముందుకు కదలేదు. పైగా 32వ డివిజన్‌ను మేయర్ దత్తత తీసుకున్నారు. అయినప్పటికీ పనులపై శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. అనంతపురం న్యూసిటీ : ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా తయారైంది అనంతపురం నగర పాలక సంస్థ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 2015-16లో ‘అనంత’ను ‘అమృత్’ పథకం కింద ఎంపిక చేసినా.. ఆ స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగడం లేదు. పాలకుల వర్గ విభేదాల నేపథ్యంలో ప్రగతి పడకేసింది. ‘అమృత్ సిటీ’గా అనంతను అభివృద్ధి చేయడానికి నగరపాలక సంస్థకు రూ.50 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. వీటిని వరద నీటి కాలువలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్, నీటి సరఫరా, పార్కుల అభివృద్ధికి వినియోగించుకోవాలి. ఈ పనులకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేశారు. పరిపాలనా పరమైన అనుమతి కూడా మంజూరైంది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రభుత్వం ఇటీవల వీటి నిర్వహణ బాధ్యతను పబ్లిక్ హెల్త్‌కు అప్పగిస్తూ జీఓ విడుదల చేసింది. పట్టించుకోని పాలకవర్గం అమృత్ పథకం కింద నిధులు మంజూరైనప్పుడు పాలకవర్గం గొప్పలు చెప్పుకుంది. ఆ తర్వాత నిధుల వ్యయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ నిధుల్లో రూ.50 లక్షలతో బుద్ధవిహార్ పార్క్ అభివృద్ధి, రూ.18 కోట్లతో వరద నీటి కాలువల నిర్మాణం, రూ.17 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్, రూ.10 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మరమ్మతు, రూ.50 లక్షలతో రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటికి పరిపాలనా అనుమతి మంజూరైనా.. సాంకేతిక (టెక్నికల్) అనుమతి మాత్రం రాలేదు. పాలకవర్గంలోని గ్రూపు రాజకీయాలే ఇందుకు కారణం. ఎమ్మెల్యే, మేయర్ వర్గీయులు తరచూ వివాదాలను లేవనెత్తుతున్నారు. వారు ఏనాడూ ‘అమృత్’ పరిస్థితేంటని ఆలోచించిన దాఖలాలు లేవు. ఇంతకుముందు నగర పాలక సంస్థకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం, ‘అమృత్’ పనులకు సంబంధించి ప్రత్యేకంగా డీఈ, ఏఈ లేకపోవడం కూడా పనులు సాగకపోవడానికి కారణాలు. ప్రస్తుతం ఏపీఎఫ్ఐయూడీసీ నుంచి నియమితులైన సిటీ ప్లానర్ హిమబిందు, ఎక్స్పర్ట్ రోజారెడ్డి, కన్సల్టెంట్ ఆయూబ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రయోజనాలెన్నో... ‘అమృత్’ పనులు పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వరద నీటి కాలువలు ఏర్పాటైతే ఏళ్ల తరబడి వెంటాడుతున్న మరువ వంక సమస్య తీరుతుంది. అశోక్‌నగర్ బ్రిడ్జి నుంచి ఐరన్ బ్రిడ్జి మీదుగా సూర్యనగర్ సర్కిల్, త్రివేణి టాకీస్, ఎర్రనేల కొట్టాలు, తడకలేరు వరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మరువ వంకకు భవిష్యత్తులో వరద వచ్చినా ఎటువంటి ప్రమాదమూ ఉండదు. అలాగే శిల్పారామంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. నడిమివంక, మరువ వంక ద్వారా వచ్చే మురుగు నీటిని ఇందులో శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వినియోగించడంతో పాటు తడకలేరు వద్ద ఉన్న డ్యాంలోకి పంపుతారు. దీంతో పాటుగా నీటి సరఫరాకు సంబంధించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. స్టోరేజీ ట్యాంకులో బండ్‌కు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా సరిగా లేదు. దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేస్తే ప్రజలకు శుద్ధి జలాన్ని అందించవచ్చు.