‘పెండింగ్‌ ’ పరుగులు! | Works Pending In Telangana Irrigation Department | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 6 2018 1:53 AM | Last Updated on Thu, Sep 6 2018 1:53 AM

Works Pending In Telangana Irrigation Department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఏ క్షణమైనా ప్రభుత్వ రద్దు నిర్ణయం వెలువడనుందన్న సమాచారం నేప థ్యంలో.. నీటి పారుదల శాఖలో పెండింగ్‌ ఫైళ్లకు అనుమతులు దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తమ నియోజకవర్గంలోని పనులను ఆ మోదించాలని ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో అధికారులు ఫైళ్ల దుమ్ముదులిపారు. బుధవారం ఒక్కరోజే నీటి పారుదల శాఖలో ఏకంగా రూ.7,829 కోట్ల విలువైన పనులను కేబినెట్‌లో పెట్టి ఆమోదించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేరాయి. ఇందులో ఆరు ఎత్తిపోతల పథకాల ప్రతిపాదనలు ఉన్నాయి. 
ఆరు ఎత్తిపోతల పథకాలు.. 
గురువారం ప్రభుత్వ రద్దు ఖాయమనే ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెండింగ్‌ పనులన్నీ క్లియర్‌ చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. ఇక ఆయా శాఖల పరిధిలో ఉన్న పెండింగ్‌ ఫైళ్లను తక్షణమే ప్రభుత్వానికి పంపాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నీటి పారుదల శాఖపై ఒత్తిడి తెచ్చి ఫైళ్లను ప్రభుత్వానికి పంపేలా చేశారు. నల్లగొండ జిల్లాలోని అయిటిపాముల ఎత్తిపోతల పథకాన్ని ఆమోదించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరగా.. అధికారులు రూ.111 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. మరో ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఒత్తిడి మేరకు బొత్తలపాలెం–వాడపల్లి ఎత్తిపోతలను రూ.241 కోట్లు, కేశవపురం–కొండ్రపోల్‌ ఎత్తిపోతలకు రూ.77.25 కోట్లు, దున్నపోతుల గండి ఎత్తిపోతలకు రూ.249 కోట్లతో ప్రతిపాదనలను అధికారులు కేబినెట్‌ ఆమోదం కోసం పంపారు. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌ కాల్వలపై జకోరా, చండూరు ఎత్తిపోతలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రతిపాదించారు. జకోరాను రూ.40 కోట్లు, చండూరును రూ.22.94 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. ఇదే జిల్లాలో రూ.476 కోట్లతో జూకల్‌ నియోజకవర్గంలో మంజీరా ఎత్తిపోతలకు మంగళవారమే ప్రభుత్వం అనుమతించింది.  

47 రిజర్వాయర్లు.. రూ.4,179 కోట్లు 
గద్వాల నియోజకవర్గంలో గట్టు ఎత్తిపోతల పథకంలో 4 టీఎంసీల సామర్ధ్యంతో పెంచికల్‌ పహాడ్‌ రిజర్వాయర్‌ నిర్మించాలన్న ప్రతిపాదనల నేపథ్యంలో రూ.1,597 కోట్ల కొత్త అంచనాతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. దీంతో పాటే కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో కొత్తగా 47 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రిజర్వాయర్లను 16.11 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని ప్రతిపాదనలు రాగా, వీటికి ఏకంగా రూ.4,179 కోట్లతో అంచనా వేశారు. ఇందులో ఏకంగా కాల్వల నిర్మాణానికే రూ.1,276 కోట్లు ప్రతిపాదించగా, వీటికి కేబినెట్‌ ఆమోదం రావాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ దిగువన పూర్వ మెదక్‌ జిల్లాలో 1.26 లక్షల ఎకరాలకు ఆయకట్టునిచ్చే సంగారెడ్డి కెనాల్‌ వ్యవస్థ కోసం వేసిన అంచనాలు కేబినెట్‌ ఆమోదం కోసం పంపారు. రూ.1,326.34 కోట్లతో అంచనాలు సిద్ధం చేయగా, వీటిని కేబినెట్‌ ఆమోదిస్తే, మూడు రీచ్‌లుగా విడగొట్టి పనులకు టెండర్లు పిలిచేందుకు నీటి పారుదల శాఖ సమాయత్తమైంది. ఈ పనులకు సంబంధించి గురువారం నాటి కేబినెట్‌ భేటీలో చర్చ జరిగితే.. ఆమోదం లాంఛనమే అని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

పలు ఎత్తిపోతల పథకాలకు నిధులు
బుధవారం రాత్రి పలు ఎత్తిపోతల పథకాలు, వాటి పరిధిలోని పనులకు సంబంధించి జీవోలు వెలువడ్డాయి. వనపర్తి జిల్లాలో చిన్నబావి మండల పరిధిలో గోప్లాపూర్‌ ఎత్తిపోతల పథకం పనుల మరమ్మతులకు ప్రభుత్వం రూ.1.17 కోట్లు కేటాయించింది. ఇదే మండల పరిధిలోని చిన్నమారూర్‌ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.6.47 కో ట్లు కేటాయించింది. నిర్మల్‌ జిల్లా పరిధిలో వెంకటాపూర్‌ ఎత్తిపోతల పథకం పరిధిలో అదనపు పనులు చేపట్టేందుకు వీలుగా రూ.62.50 లక్షలు కేటాయించింది. ఈ మేరకు నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్‌ గ్రామ పరిధిలోని పెద్దచెరువు పునరుద్ధరణకు రూ.2.36 కోట్లు కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చా రు. నాలుగో విడత మిషన్‌ కాకతీయలో భాగంగా దుర్గం చెరువు రూ.40.25 కోట్లు, మల్క చెరువు రూ.6.68 కోట్లు, నల్లగండ్ల చెరువు రూ.15.49 కోట్లు కలిపి మొత్తంగా రూ.62.54 కోట్లతో సవరించిన అంచనాలకు అనుమతులు ఇచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement