చదవడంలేదని కొడుకుని పొడిచేశాడు
టోక్యో: సరిగా చదవనందుకు ఓ తండ్రి కుమారుడిని పొడిచేశాడు. వంటింట్లో కూరగాయలు కట్ చేసే కత్తితో పొడవడంతో పన్నేండేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన జపాన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఓ ప్రైవేట్ జూనియర్ హైస్కూల్లో ప్రవేశ పరీక్షకు సంబంధించి బాగా చదవాలని కెంగో సతాకే (48) అనే ఓ తండ్రి తన పన్నేండేళ్ల కుమారుడికి చెప్పాడు.
ఈ విషయంలో వారిద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన తండ్రి వంటింట్లో కత్తితో కుమారుడిని పొడిచాడు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించాడు. అయితే, అప్పటికే అతడికి రక్తం సరిపోక ప్రాణాలు విడిచాడు. వైద్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో అతడిని అరెస్టు చేశారు. కోపంలో పొరపాటున తాను అలా చేశానని, మంచి స్కూల్లో సీటు వస్తే ఆశించే అతడిని బాగా చదవాలని చెప్పానని తెలిపాడు. కాగా, చదువు విషయంలో అతడు రోజూ తన కుమారుడిని తిడతాడని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.