పదో తరగతిలో 50 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ గుర్రుగా ఉంది.
‘పది’లో 50శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత ఎందుకు?
102 మంది ప్రధానోపాధ్యాయులకు నోటీసులు
6వ తేదీలోపు వివరణ ఇవ్వాలని డీఈఓ ఆదేశం
7న పాఠశాలల వారీగా డిప్యూటీ ఈఓ విశ్లేషణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతిలో 50 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ గుర్రుగా ఉంది. రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకు పతనానికి ఈ పాఠశాలలే కీలకంగా భావించిన జిల్లా విద్యాశాఖ.. ఆయా ప్రధానోపాధ్యాయులకు శ్రీముఖాలు ఇచ్చింది. జిల్లాలో 439 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 102 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 50శాతం కంటే తక్కువ ఫలితాలు నమోదు చేశాయి. ఈ క్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ప్రత్యేకంగా నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా ఆయా పాఠశాలల్లో 50శాతం కంటే తక్కువ పాసైన విభాగంలో సబ్జెక్టు టీచర్లకు సైతం ఈ నోటీసులు పంపింది.
జూన్ 6లోగా వివరణ ఇవ్వండి..
ఉత్తీర్ణత పడిపోవడానికి గల కారణాలను వెలికితీస్తున్న విద్యాశాఖ.. తాజాగా 102 ప్రభుత్వ పాఠశాలలకు నోటీసులు ఇచ్చింది. ఇందులో భాగంగా ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందనే అంశంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. పాఠశాలకు సంబంధించిన వివరణ ప్రధానోపాధ్యాయుడు, సబ్జెక్టుకు సంబంధించి సబ్జెక్టు టీచరు ఆ డివిజన్ ఉపవిద్యాధికారికి ఈనెల ఆరో తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ వివరాలను సేకరించిన ఉపవిద్యాధికారులు పాఠశాల వారీగా విశ్లేషణ చేసి.. నివేదికను ఏడో తేదీన జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పించాలి. వాటిని పరిశీలించిన అనంతరం వివరణ సృతప్తికరంగా లేకుంటే ఆయా టీచర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.