బడికి రెడీ      | Schools reopening | Sakshi
Sakshi News home page

బడికి రెడీ     

Published Fri, Jun 1 2018 9:15 AM | Last Updated on Sat, Sep 15 2018 5:45 PM

Schools reopening - Sakshi

ఇక రాత్రి వేళ పొద్దుపోయేంతవరకు టీవీలకు అతుక్కుపోవడం కుదరదు. ఉదయం తొమ్మిదింటి వరకు నిద్రపోవడం అసలే జరగని పని. అమ్మమ్మలు.. నాన్నమ్మలు, తాతయ్యలతో కబుర్లు కట్టేయాల్సిందే. ఆటపాటలు, అల్లరి చేష్టలకు టాటా చెప్పాల్సిన సమయం వచ్చింది. వేసవి సెలవులకు ఇక సెలవే. గురువారంతో హాలీడేస్‌ ముగిశాయి.

శుక్రవారం బడిగంటలు మోగనున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు, షూస్, లంచ్‌ బాక్స్‌లు తదితర సామగ్రి కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం నుంచి బడికి పంపించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.

కొండాపూర్‌(సంగారెడ్డి): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలల గేట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఉత్సాహంగా.. ఉల్లాసంగా, నిన్నామొన్నటి వరకు ఆటపాటల్లో మునిగి తేలిన విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్‌ 1న బడిగంట మోగనుండడంతో ఇక పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయం ఆసన్నమైంది.

సుమారు 50 రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభకానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడులకను ఘనంగా నిర్వహిం చేందుకు జూన్‌ 1న పాఠశాలలను పునః ప్రారంభించనున్నారు.

సమస్యలతో స్వాగతం..

జిల్లా వ్యాప్తంగా 1,733 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సర్కారు స్కూళ్లు 1,350 కాగా ప్రైవేటు పాఠశాలలు 383 ఉన్నాయి. సర్కారులో ప్రాథమిక పాఠశాలలు 864, ప్రాథమికోన్నత 198, ఉన్నత పాఠశాలలు 205తో పాటు తెలంగాణ గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురకుల పాఠశాలలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి.

లక్షా 50 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో,మరో 1,19,677 మంది ప్రైవేటులో విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు మౌలిక సౌకర్యాలు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు నిర్మించినా రన్నింగ్‌ వాటర్‌ లేకపోవడంతో చాలా పాఠశాలల్లో ప్రయోజనం లేకుండా పోయింది. పాఠశాలలకు ప్రహరీలు, ఆటలు ఆడుకునేందుకు మైదానాలు కరువయ్యాయి.  

ఇన్‌చార్జీల పాలనలోనే..

విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలంటే పర్యవేక్షణ తప్పనిసరి. పాఠశాలలను పర్యవేక్షించాల్సి మం డల విద్యాదికారుల పోస్ట్‌లు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో 26 మండలాలకు గాను 18 మండలాల్లో మాత్ర మే మండల విద్యాధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. 8 మండలాలల్లో విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 మండలాల్లో కంగ్టి, జిన్నా రం మండలాల్లో మాత్రమే రెగ్యులర్‌ విద్యాధికారులు కాగా మిగతా 16 మంది ఇన్‌చార్జులుగానే విధులు నిర్వర్తిస్తున్నారు.

రెండు మండలాలకు గానూ జిన్నారం ఎంఈఓ జూన్‌ చివరి నాటికి పద వీ విరమణ చేస్తుండడంతో అక్కడ కూడా ఇన్‌చార్జి నే నియమించే అవకాశం ఉంది. ఇన్‌చార్జి ఎంఈఓలుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులకు కూడా ఒకొక్కరికి రెండు మండలాలు ఉండడంతో పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. అటు పాఠశాలల్లో విద్యాబోధన చేయలేక, ఇటు పాఠశాలలను పర్యవేక్షించలేక ఇన్‌చార్జి ఎంఈఓలు సతమతమవుతున్నారు.

దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.  జిల్లాలో 250 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని 34 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

తగ్గని ఉష్ణోగ్రతలు

రుతు పవనాల రాక ఆలస్యం కావడం, ఉష్ణోగ్రతలు నేటికీ 40 డిగ్రీల నుంచి తగ్గకపోవడంతో 4 నుంచి 8వ తేదీ వరకు ఒంటిపూట మాత్రమే బడులు నిర్వహించనున్నారు. ఆ ఒక్కపూట కూడా విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే జూన్‌ రెండో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభిస్తే బాగుండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం : జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఆర్వీఎం కార్యాయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జూన్‌ 1న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయని, అదే రోజున ప్రతి విద్యార్థికి పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాకు మొత్తం 7,20,740 పుస్తకాలు అవసరం కాగా వంద శాతం వచ్చాయని, ఇప్పటికే ప్రతి మండలంలోని మానవ వనరుల కేంద్రం ద్వారా సంబంధిత పాఠశాలలకు చేరవేయడం జరిగిందన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాంలను అందజేయనున్నట్లు చెప్పారు.

ఈ మేరకు జిల్లాకు వచ్చిన 95,315 యూనిఫాంలను పాఠశాలలకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రేడియో పాఠాలతో పాటు డిజిటల్‌ తరగతుల ద్వారా విద్యా బోధన ఉంటుందన్నారు. 

జూన్‌ 4నుంచి బడిబాట

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదుకు గానూ జూన్‌ 4 నుంచి 8వ తేదీ వరకు బడిబాట చేపడుతున్నట్లు డీఈఓ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 11 గంటలకు వరకు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.

గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలతో పాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం తదితరాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.   జిల్లాలో గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా 15,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు చెప్పారు.  

ఐదు కేజీబీవీల్లో ఇంటర్‌కు అవకాశం

బాలికల విద్యను బోలపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 17 కేజీబీవీలకు గానూ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 5 కేజీబీవీల్లో ఇంటర్‌ అవకాశం కల్పిస్తున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. జహీరాబాద్, సదాశివపేట, జిన్నారం, అందోల్, నారాయణఖేడ్‌ కస్తూర్బాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌  తరగతులను ప్రారంభించడం జరుగుతందన్నారు. కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు గానూ 80 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు.

బడి బయట పిల్లలపై ప్రత్యేక దృష్టి

జిల్లావ్యాప్తంగా మెప్మా సంస్థ వారు జనవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో ఒకటి నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు 448 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. బడి బయట ఉన్న పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement