
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’ అని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది.
చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం గ్వాలియర్‌లో జనవరి 6న అన్ని ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చలి తీవ్రత కారణంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు నడుస్తున్న అన్ని పాఠశాలలకు జనవరి 6వ తేదీ శనివారం సెలవు ప్రకటించినట్లు గ్వాలియర్ కలెక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరు నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసులను మునుపటిలానే నిర్వహిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గ్వాలియర్‌లో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. జనవరి 2 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుండి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్ ప్రజలు సూర్యుడిని చూసేందుకు మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సివుంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకటి రెండు రోజుల్లో చినుకులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్వాలియర్-చంబల్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది.