ఇష్టంలేని పెళ్లి చేసుకోనన్న కూతురు
కాల్చిచంపిన తండ్రి, బంధువు
గ్వాలియర్(ఎంపీ): గొడవలు వద్దు, కూర్చుని మాట్లాడుకోండని సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులు ఇంటిబయట ఉండగానే కూతురిని కన్న తండ్రి చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అమ్మాయి బంధువు సైతం కాల్పులు జరిపినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్‌లోని గోలా కా మందిర్ ప్రాంతంలో 45 ఏళ్ల మహేశ్ సింగ్ గుర్జార్‌కు 20 ఏళ్ల కూతురు ఉంది.
జనవరి 18వ తేదీన ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే తనకిప్పుడు ఈ పెళ్లి ఇష్టంలేదని కుమార్తె చెప్పడంతో మహేశ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఎలాగైనా పెళ్లి జరగాల్సిందేనని మహేశ్ మేనల్లుడు రాహుల్ సైతం పట్టుబట్టి ఆమెను ఒప్పించే ప్రయత్నంచేశాడు. ముగ్గురి మధ్య వాగ్వాదం విషయం తెల్సి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వాళ్లు హుటాహుటిన పెళ్లింటికి వచ్చేశారు. పెళ్లి ఏర్పాట్లతో ఇళ్లంతా ముస్తాబు చేసిఉండటంతో లోపలికి వెళ్లకుండా మగ, ఆడ కానిస్టేబుల్స్ ఇంటి బయటే వేచి చూస్తున్నారు.
ఎంతచెప్పినా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మహేశ్, రాహుల్ ఒక నాటు తుపాకీ, పిస్టల్‌తో అమ్మాయిని కాల్చి చంపారు. నాలుగు బుల్లెట్లను కాల్చారు. బుల్లెట్ల మోతతో హుతాశులైన స్థానికులు, పోలీసులు ఇంట్లోకి పరుగులుతీశారు. అప్పటికే రాహుల్ అక్కడి నుంచి తప్పించుకోగా తండ్రి అక్కడే ఉన్నాడు. రక్తమోడుతున్న అమ్మాయిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పారిపోయిన బంధువు రాహుల్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment