no marriage
-
ఇంకెన్నాళ్లు డిసైడ్ చేస్తారు..స్త్రీని స్వేచ్ఛగా ఎదగనివ్వండి
గతంలో సినిమాల్లో ‘ఆధునిక మహిళ’ అనగానే కబ్బుల్లో ఉంటారని చూపించేవారు. వాళ్లు మోడర్న్ దుస్తులు ధరిస్తారు... స్మోక్ చేస్తారు.. కాపురాలు పట్టించుకోరు.. ఇప్పుడు కర్నాటకకు చెందిన ఒక మినిస్టరు ‘వారు పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అన్నాడు. మహిళ ఆధునికం కావడం అంటే అభివృద్ధిలో, ఉత్పత్తిలో, ఉపాధిలో భాగం కావడం. వారిని ‘స్టీరియోటైప్’ చేయడం ఎన్నాళ్లు? వారిని చూసి భయపడటం ఎందుకు? ఆధునిక పురుషుడికి లేని విమర్శ మహిళకు ఎందుకు? మొదట ఆధునిక పురుషుడు ఏం చేస్తాడో చూద్దాం. అతడు రాజకీయవేత్త అవుతాడు. వ్యాపారవేత్త అవుతాడు. సిఇఓ, సినిమా స్టార్ అవుతాడు. సూట్ వేసుకుంటాడు. విరామంలో గోల్ఫ్ ఆడతాడు. చిన్న షార్ట్స్ వేసుకుని సముద్రంలో ఈత కొడతాడు. సరదాగా ఫ్రెండ్స్‌తో డ్రింక్ చేస్తాడు. బిజినెస్ ట్రిప్‌లకు వెళతాడు. సంపాదిస్తాడు. ఖర్చు పెడతాడు. వీటన్నింటికి సమాజం నుంచి ఆమోదం ఉంది. ఎందుకు? అతడు మగాడు. స్త్రీలు? వారూ చదువుతారు. సిఇఓలు అవుతారు. వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తారు. స్పోర్ట్స్ ఆడతారు. మెడల్స్ తెస్తారు. కారు డ్రైవ్ చేస్తారు. ఆఫీస్ పనుల మీద టూర్లు వెళతారు. కాని వీటికి విమర్శ వస్తుంది. ‘సంసారాన్ని వదిలేసి అలా ఎలా తిరుగుతుంది’. పశువు మెడలో తాడు కట్టేసి ఆ తాడును ఎంత దూరం వదిలినా ఆ పశువు తిరిగి తిరిగి మళ్లీ గుంజ దగ్గరకు చేరాలి అన్నట్టుగా భారతీయ సమాజం స్త్రీ ఎంత దూరం వెళ్లినా, ఎంత ఉన్నతి సాధించినా తిరిగి ‘సంసారం’, ‘మాతృత్వం’ వంటి ప్రాథమిక బాధ్యతల వద్దకే తిరిగి రావాలని భావిస్తుంది. స్త్రీని సంసారం నుంచి ‘ఆధునికత’ విముక్తం చేస్తుందనే భయం ఉంది– అందుకు ఏ రకమైన అధ్యయనం, ఆధారం లేకపోయినా. స్త్రీలు ఇల్లు కదలడం, చదువుకోవడం, మొదట స్టెనోలుగానో, టైపిస్ట్లుగానో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం, తమ కోసం మహిళా సంఘాలు పెట్టుకోవడం మొదలెట్టినప్పటి నుంచి వారిని ‘కేరికేచర్లుగా’ చూపిస్తూ, హేళన చేయదగ్గ స్త్రీలుగా చూపిస్తూ సమాజం వారిని అదుపు చేయాలని చూసింది. చూస్తోంది. పాత సినిమాల్లో ఆధునిక స్త్రీ అంటే విగ్గులు పెట్టేసి, చేతికి హ్యాండ్‌బ్యాగు వేలాడదీసి, క్లబ్బులో పేకముక్కలు చేతికి ఇచ్చేవారు. ఇప్పుడు పబ్బుల్లో చూపిస్తున్నారు. ఇవాళ బాగా చదువుకున్న ప్రతి స్త్రీ, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రతి స్త్రీ ఆధునిక స్త్రీనే. ఆ చదువుకున్న స్త్రీ గృహిణిగా ఉంటున్నా ఆధునిక స్త్రీనే. అయితే ఛాందస వాదుల నిందలు, విమర్శలు ఏమంటే ‘వీరు కుటుంబాన్ని (భర్తను, పిల్లలను) నిర్లక్ష్యం చేస్తారు’ అని. అలా అని చెప్పి వీరి మీద ఒక ఒత్తిడి తెస్తారు. నిజానికి పురుషుడు ఎంత ఎదిగినా ఎలా కుటుంబంలోకి వస్తున్నాడో స్త్రీలు కూడా ఎంత ఎదిగినా కుటుంబంలోకి వస్తారు. వారికి తల్లిగా, భార్యగా ఇంటిని ఎలా నిర్వహించుకోవాలో తెలుసు. కాని పురుషుడికి ఉండే వెసులుబాటు వారికి ఉండదు. తన కెరీర్ కోసం పురుషుడు ముందు వెళ్లాలంటే స్త్రీ కుటుంబ నిర్వహణ కోసం తనను తాను కుదించుకోవాలి లేదా త్యాగం చేయాలి. ‘ఆధునిక మహిళ’ ఇక్కడ ప్రశ్నను లేవదీస్తుందని, నీకున్న హక్కు నాకు ఎందుకు లేదు అంటుందని, తద్వారా ‘పిల్లల్ని కంటూ ఇంటి దగ్గర పడుండే’ స్త్రీ పాత్ర నుంచి ఆమె విముక్తమవుతుందని సమాజానికి భయం. అందుకే సినిమాల్లో, అడ్వర్టైజ్మెంట్లలో, చవకబారు సాహిత్యంలో, కార్టూన్లలో అలాంటి స్త్రీలను హేళన చేయడం కనిపిస్తూ ఉంటుంది. ‘స్టెనోలందరూ బాస్ ఒళ్లో కూచుని ఉంటారు’ అని ఇప్పటికీ కార్టూన్లు గీస్తూ స్త్రీలను అవమానించే కార్టూనిస్టులు ఉద్యోగాల్లో తమను తాము నిరూపించుకోవాలనుకుంటున్న స్త్రీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఊహించలేరు. ఇక టీవీ పెట్టగానే వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ‘ఉప్పు గురించి’, ‘మసాలా దినుసుల గురించి’, ‘టీ గురించి’, ‘అత్తయ్యకు నచ్చిన హెయిర్ ఆయిల్ గురించి’ మాట్లాడే గృహిణులను చూపి చూపి నీ ఆర్థిక స్తోమత, చదువు ఎంతున్నా నువ్వు ఎంగేజ్ కావాల్సింది ఈ పనుల్లోనే అని కండిషన్ చేస్తూ వస్తుంటాయి. రాజకీయాల్లో ఉండే స్త్రీలను, టీవీ డిబేట్లలో మాట్లాడే స్త్రీలను, ఉద్యమాల్లో ఉండే స్త్రీలను, మేధావులుగా ఉండే స్త్రీలను, ఆత్మవిశ్వాసంతో ఉండే స్త్రీలను, ఫ్యాషన్– గ్లామర్ రంగాల్లో ఉండే స్త్రీలను, ఎన్.జి.ఓ రంగాల్లో ఉండే స్త్రీలను సమాజానికి ఉండే ‘సగటు పురుష స్వభావం’ అంగీరించే పరిస్థితులు నేటికీ కనిపించకపోవడానికి కారణం అలాంటి స్త్రీలు తెల్లారితే గిన్నెలు కడుక్కుంటూ కనిపించరేమోనన్న భయం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా. తాజాగా కర్నాటక ఆరోగ్యశాఖా మంత్రి సుధకార్ ‘ఆధునిక స్త్రీ సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతోంది, ఆమె పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అని వ్యాఖ్యానించాడు. నిజానికి స్త్రీకి తన శరీరం మీద హక్కు తనకే ఇంకా దక్కలేదు. పిల్లల్ని కనడం కనకపోవడం గురించి ఆమెకు వైవాహిక వ్యవస్థలో పూర్తిగా స్వేచ్ఛ లేదు. ఆమె ఏం చదవాలో, ఏ ఉద్యోగం చేయాలో కుటుంబమే డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఆమె వివక్ష అనుభవిస్తూనే ఎదగాల్సి వస్తోంది. ఇన్ని జరుగుతున్నా ఆమె కుటుంబ చట్రానికి ఆవల వెళుతుందేమోనన్న భయంతో బ్లేమ్ కొనసాగుతూనే ఉంది. ఆధునిక స్త్రీ సమాజ హితం, కుటుంబ హితం కోరుతూనే ఉంది. అయితే దానికి సంబంధించిన రూల్స్ ఆమె మార్చదలుచుకుంటే వాటి మీద కదా చర్చ జరగాలి. అందాక నిందలు, విమర్శలు మానాలని అందరికీ చెబుదాం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా. -
పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!
సాక్షి, ఎల్లారెడ్డి (కామారెడ్డి): కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెళ్లి కావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎల్లారెడ్డి పట్టణం లో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. ఎల్లారెడ్డికి చెందిన చిలక రాజమౌళి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ఈ క్రమంలో రాజమౌళి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు. అయితే, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన కుమార్తె స్వప్న (20)కు పెళ్లి చేయడం లేదు. ఈ విషయమై తల్లితో గొడవ పడిన స్వప్న ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. మృతురాలి సోదరుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
సోలో లైఫే సో బెటరు
నేటి రోజుల్లో చదువులు, వృత్తి ఉద్యోగాల్లో ప్రగతి కోసం శ్రమిస్తున్న మహిళలు ముప్ఫై ఏళ్లు దగ్గరవుతున్నా పెళ్లి మాటెత్తడం లేదని తల్లిదండ్రులు వాపోతుంటారు. కొందరు వనితామణులు ఒకడుగు ముందుకేసి అసలు మాకు పెళ్లే వద్దు, ఈ జీవితమే సంతోషంగా ఉండగా, కొత్తగా సమస్యలు తెచ్చుకోవడం దేనికి అని ప్రశ్నిస్తున్నారు. కర్ణాటక, బొమ్మనహళ్లి: బ్రహ్మచర్యం అనేది ఒకప్పుడు ప్రధానంగా పురుషులకే పరిమితమై ఉండేది. కాలానుగుణంగా వస్తున్న మార్పులు, ఇప్పుడు యువతుల్లో, మహిళల్లోనూ ఆ ధోరణులు కనిపిస్తున్నాయి. కళ్లెదుటే స్నేహితులు, బంధువుల వివాహాలు విచ్ఛిన్నం కావడం, ఇష్టపడి కట్టుకున్న పెనిమిటి వికృత చేష్టలు, వంటి చేదు పరిణామాలు యువతులను బ్రహ్మచర్యం వైపు మళ్లిస్తున్నాయి. ఐటీ సిటీలో ఇప్పుడు అనేక మంది యువతులు ఒంటరి జీవనం వైపే మొగ్గు చూపిస్తున్నారు. అదే తమకు సంతోషాన్నిస్తోందని వారు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నా, వారి స్వతంత్ర ఆలోచనలను కాదనే హక్కు ఎవరికీ ఉండదు. సమావేశాలు, చర్చాగోష్టులు మరో పక్క నగరంలో కొందరు ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న యువతులు అసంఘటితంగా అప్పుడప్పుడూ కలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు అప్పుడప్పుడూ సమావేశమవడానికి వీలుగా మీటప్డాట్కామ్ అనే సైట్లో ప్రకటనలు కూడా ఇస్తుంటారు. అయితే మరి కొన్ని గ్రూపులు ఎవరితోనూ సంబంధం లేకుండా తమంత తాముగా కలుస్తూ ఉంటాయి. మజ్లిస్ లీగల్ సెంటర్ అనే ఫెమినిస్టు గ్రూపు, హ్యాపీలీ అన్‌మారీడ్ అనే ఆన్లైన్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆరు గురు మహిళల కథనాలతో ఈ ఏడాది ఆరంభంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ గ్రూపు కోసం పని చేస్తున్న మహిళా న్యాయవాదులు, నగరంలో అనేక మంది మహిళలు అయిష్టంగానే వైవాహిక జీవితాన్ని గడుపుతున్నట్లు గుర్తించారు. పెళ్లి ఎందుకని చెబుతుంటాం తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు స్పందన మందకొడిగానే ఉండేదని, క్రమంగా అనేక మంది మహిళలు తమను సంప్రదించడం ప్రారంభించారని హ్యాపీలీ అన్‌మ్యారీడ్ ప్రాజెక్టు ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆడ్రీ డెల్లో తెలిపారు. పెళ్లికి ప్రతికూలంగా యువతులను ప్రోత్సహించడమే తమ ప్రచార ప్రధానోద్దేశమని చెప్పారు. ఈ ప్రచారాన్ని ఒక్క బెంగళూరుకే పరిమితం చేయకుండా దేశమంతా విస్తతం చేయదలిచామని తెలిపారు. అవివాహితగా ఉంటే సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయాన్ని పోగొట్టడమే తమ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. అవివాహితగా ఉంటూ కూడా సంతోషకరమైన జీవనాన్ని గడపవచ్చని తాము చెప్పదలు చుకున్నామని, దీనికి ఆలంబనగా దేశంలోని నలుమూలల్లో ఉంటున్న అవివాహితుల కథనాలను వారికి వినిపిస్తున్నామని వివరించారు. వారంతా జీవితంలో బాగా స్థిరపడిపోయారు, వారికెప్పుడూ బోర్ కొట్టలేదు, వారు ఒక్కరుగానే ఉండవచ్చు, కానీ ఒంటరివారు కారు అని ఆమె ముక్తాయింపు నిచ్చారు. – ఆడ్రీ డెల్లో, ప్రాజెక్టు డైరెక్టర్ ఓ రెండు ఉదాహరణలు చూస్తే.. ♦ 30 ఏళ్ల అలేఖ్య (మారుపేరు) మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. పెళ్లి చేసుకోవాలనే సామాజిక ఒత్తిడులను పక్కన పెట్టి, ఒంటరిగానే ఉండిపోవాలని ఆమె నిర్ణయించుకుంది. ♦ నగరంలో ఓ ప్రముఖ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న 30 ఏళ్ల రాగిణిది (మారుపేరు) మరో అనుభవం. 22 ఏళ్లకే ఆమెకు పెళ్లయింది. ఇష్టం లేకున్నా పెద్దల ఒత్తిడి మేరకు పెళ్లికి సరేనంది. రెండు నెలలకే ఆ వివాహం విచ్ఛిన్నమైంది. ఇద్దరు దత్తత సంతతితో ఇప్పుడు సంతోష జీవనాన్ని గడుపుతున్నానని ఆమె తెలిపింది. బ్రహ్మచారిణిలకూ క్లబ్బులు బెంగళూరులో 2016లో హ్యాపీ క్లబ్ పేరిట ఓ గ్రూపు ఏర్పడింది. ఇందులో 50 మంది దాకా సభ్యులున్నారు. అందరూ అవివాహితులే. 30 ఏళ్లు పైబడిన వారే. అయితే వారంతా తమ క్లబ్ ఉనికిని బహిర్గతం చేయడానికి ఇష్టపడడం లేదు. ఎవరైనా తెలసుకుని సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే, సభ్యత్వ గడువు ముగిసి పోయిందని సమాధానమిస్తారు. వీరంతా వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు చూస్తూ, ఒంటరి మహిళగా ఉంటే కలిగే సంతోషం, ఎదురయ్యే ఇబ్బందుల గురించి చర్చాగోష్టులు నిర్వహిస్తూ ఉంటారు. తామంతా అవివాహితులుగానే ఉండి పోతామని వారంతా ప్రతిజ్ఞ చేయడం మరో విశేషం. దీనిని ఉల్లంఘించిన వారు సభ్యత్వం కోల్పోతారని ఆ క్లబ్బు వ్యవస్థాపకురాలు తెలిపారు. ఈ క్లబ్ సభ్యులు... ఇతరులను ప్రోత్సహించడానికా అన్నట్లు తమ సంతోష ఘడియలు, క్షణాల స్క్రీన్‌షాట్స్‌ను తరచూ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. -
అది ప్రశ్నలా మిగిలిపోయింది
నటిగా అటు బాలీవుడ్, ఇటు సౌత్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు టబు. ‘చాందినీ బార్, చీనీ కమ్, నిన్నే పెళ్లాడతా, ప్రేమ దేశం’ వంటి సూపర్ హిట్స్‌లో నటించిన ఈ 46 ఏళ్ల సుందరి రిలేషన్షిప్ స్టేటస్ ఇంకా సింగిలే. ‘సింగిల్‌గా ఉంటున్నానని నేనెప్పుడూ బాధపడలేదు’ అని అంటున్నారు టబు. ఇటీవల ఓ ఫిల్మ్ ఫెస్టివల్లో సింగిల్‌గా ఉండటం, పెళ్లి గురించి టబు మాట్లాడుతూ –‘‘నా లైఫ్‌లో సింగిల్‌గా ఉన్న ఏ మూమెంట్లోనూ నేను బాధపడలే దు. ప్రతి నిమిషాన్ని బెస్ట్ అని ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంకో సైడ్ (రిలేషన్షిప్) ఏంటో నాకు తెలియదు. నేను పెళ్లి చేసుకోలేదు. రెండు సైడ్స్‌ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ఏది బెస్టో చెప్పగలం. సో.. సింగిల్‌గా ఉండటమా? రిలేషన్షిప్లో ఉండటమా? ఏది బెస్టో కచ్చితంగా చెప్పలేను. పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నందుకు ఎప్పుడూ పశ్చాత్తాపపడలేదు. లైఫ్‌లో పెళ్లి చేసుకుంటానా? అనే ప్రశ్న కూడా ప్రశ్నలా ఉంది. దానికి నా దగ్గర ప్రస్తుతానికైతే సమాధానం లేదు’’ అని పేర్కొన్నారు టబు. -
కట్నం కావాలా..? పెళ్లే వద్దు..!
కోట (రాజస్తాన్): వరుడి తరఫు వారు భారీగా కట్నం డిమాండ్ చేసినందుకు ఓ వధువు పెళ్లికి నిరాకరించింది. దీంతో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది. కోట మెడికల్ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ సక్సేనా కూతురు రాశికి ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉన్న ఓ వైద్య కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సక్షమ్ మధోక్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం సందర్భంగా వరుడికి కారు, పది గ్రాముల బంగారం బహూకరించారు. పెళ్లి ఏర్పాట్లు, కట్న కానుకల రూపేణా రూ.35లక్షలు ఖర్చు చేశారు. రెండు కుటుంబాల బంధు మిత్రులు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, వరుడు మాత్రం రాలేదు. రూ.కోటి విలువ చేసే కానుకలు, నగలు, నగదు కూడా ఇస్తేనే వస్తామంటూ అతడు సమాచారం పంపాడు. ఇది తెలిసిన వధువు డాక్టర్ రాశి వరుడితో ఫోన్లో మాట్లాడింది. కట్నం డిమాండ్లపై అతడు వెనక్కి తగ్గకపోవటంతో ఈ పెళ్లి తనకిష్టం లేదని తెలిపింది. పెళ్లి కుమార్తె నిర్ణయాన్ని అంతా మెచ్చుకున్నారు. -
‘10 తర్వాత పెళ్లి వద్దు’ పోస్టర్ ఆవిష్కరణ
భానుగుడి (కాకినాడ): బాల్యవివాహాలను రద్దు చేసేందుకు సర్వశిక్షా అభియా¯ŒS ద్వారా ‘పది తర్వాత పెళ్లికాదు.. 11వ తరగతి’ అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ హెచ్ఆర్.అరుణ్‌కుమార్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ గురువారం ఆవిష్కరించి బాలికావిద్యను ప్రగతి పథలో పెట్టేందుకు రూపొందించిన కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 352 కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాల్యవివాహాలపై అవగాహన కల్గించేందుకు ప్రతీ పాఠశాలకు ఒక సైకియాట్రిస్ట్, విద్యావేత్త ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు పీవో మేకా శేషగిరి తెలిపారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 8, మైదానప్రాంతాల్లో 2, ముంపు మండలాల్లో 2 మొత్తం 12కేజీబీవీలు ఉన్నాయని, వీటిలో 2,400 మంది విద్యార్థినులు చదువుతున్నారని, వారిలో 400 మంది పదోతరగతి చదువుతున్నారన్నారు. వీరందరికీ ఈనెల 30,31 తేదీలలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సీఎంవో ఇంటి వెంకట్రావు, ఏఎంవో చామంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఊరంతా పెళ్లికాని ప్రసాదులే!
ఆ గ్రామంలో ఒక్క అబ్బాయికి కూడా పెళ్లి కావడం లేదు. పెళ్లి చేసుకుందామంటే అసలు ఆ ఊరి అబ్బాయిలకు సంబంధాలే రావడం లేదు. దానికి కారణం.. మూడేళ్ల నుంచి వరుసగా పీడిస్తున్న కరువు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్పూర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కరువు తీవ్రంగా ఉంది. నీళ్ల కొరత కారణంగా పంటలు పండటంలేదు. తెహ్రిమారియా అనే గ్రామంలో అయితే పెళ్లికూతుళ్లు దొరకడం పెద్ద కష్టంగా మారింది. అసలు నీళ్లులేని ఊళ్లోకి తమ ఆడ పిల్లలను ఎలా ఇవ్వాలంటూ అమ్మాయిల తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. 32 ఏళ్ల వయసున్న మోహన్ యాదవ్‌కు సంబంధం చూడాలని వాళ్ల కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. అలా సుమారు 60 మంది మగవాళ్లు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వమే తమకు సాయం చేయాలని, ఒక డ్యామ్ కట్టి నీటి సస్యకు పరిష్కారం చూపిస్తే తమకు పెళ్లిళ్లు అవుతాయని మోహన్ యాదవ్ లాంటివాళ్లు అంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలో గల 13 జిల్లాల్లో ఛత్తర్పూర్ కూడా ఒకటి. ఈ జిల్లాలన్నింటిలోనూ దాదాపు పదేళ్లుగా కరువు వస్తూ పోతూనే ఉంది. తెరియమార్ గ్రామంలో 400 అడుగుల లోతు వరకు తవ్విన బోర్లు, బావులు కూడా ఎండిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ దూరాలు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. స్టాప్ డ్యామ్ కట్టడానికి ఓ ప్రాంతం చూశామని, కలెక్టర్ అనుమతి మంజూరుచేస్తే వెంటనే పనులు మొదలుపెట్టొచ్చని తహసిల్దార్ బినితా జైన్ అన్నారు. దాంతో ఒకటి రెండేళ్లలో కరువు పూర్తిగా మాయం అవుతుందని చెప్పారు. -
నా జీవితంలో పెళ్లి లేదు
నా జీవితంలో పెళ్లి అనే పదానికి తావే లేదని నటి శ్రుతిహాసన్ ఖరాఖండిగా వెల్లడించారు. ఈమె విడిపోయిన ఇద్దరు నట ప్రముఖుల వారసురాలన్న విషయం తెలిసిందే. ఈ సంచలన నటి ప్రస్తుతం ఇళయదళపతి విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. తాజాగా అజిత్‌కు జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి సూర్యతో సింగం-3 చిత్రంలోనూ నటించనున్నారు. ఇలా వరుసగా ప్రముఖ హీరోలతో నటిస్తున్న శ్రుతిహాసన్ ఇటీవల ఒక పత్రికకు భేటీ ఇస్తూ తన తండ్రి కమలహాసన్‌తో కలసి నటించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. అయితే అలాంటి అవకాశం ఇంతకుముందు రెండుసార్లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదామె. కారణం కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడమే నని వివరించారు. కాగా వివాహం ఎప్పుడన్న ప్రశ్నకు శ్రుతి బదులిస్తూ ఈ విషయమై ఇప్పటికే ఒకసారి బదులిచ్చానని అయినా మళ్లీ చెప్పడానికి తనకెలాంటి అభ్యంతరం లేదని పెళ్ళి గురించి తానెప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు. ఇష్టాలు, ఆశల్లో భేదాభిప్రాయాలు ఉన్న దంపతులు సంసార జీవితం ప్రశాంతంగా సాగదన్నారు. ఈ కారణం గానే విడిపోతుంటారని వ్యాఖ్యానించారు. అందుకే తాను వివాహమే చేసుకోరాదన్న నిర్ణయాన్ని తీసుకున్నానన్నారు. శ్రుతి నిర్ణయం విస్మయాన్ని కలిగించినా ఆమె పెరిగిన వాతావరణం శ్రుతిపై అలాంటి ప్రభావానికి కారణం అని భావించాల్సి ఉంటుంది. శృతి తల్లిదండ్రులు కమలహాసన్, సారిక విడివిడిగా జీవిస్తున్నారు. శృతి కూడా ముంబయిలో ఒంటరిగానే నివసిస్తున్నారు. తల్లిదండ్రులను కలవాలపించినప్పడు వెళ్లి చూసి వస్తున్నారు. తల్లిదండ్రులు విడిపోవడం అన్నది ఎంత బాధాకరమే శ్రుతి చెప్పక పోయి నా స్పష్టంగా తెలిసిపోతుంది. -
'ఇక జీవితంలో పెళ్లి చేసుకుంటే ఒట్టు'
వరుసగా మూడో పెళ్లి కూడా పెటాకులు కావడంతో బ్రిటిష్ మోడల్, టీవీ నటి కేటీ ప్రైస్‌కు తత్వం బాగా బోధపడింది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె, ఇక జన్మలో పెళ్లంటూ చేసుకునేది లేదని కుండ బద్దలుకొట్టి మరీ చెబుతోంది. కైరన్ హేలర్కు, కేటీ ప్రైస్‌కు ఇంతకుముందు పెళ్లయింది. వాళ్లిద్దరూ గత నెలలో విడిపోయారు. ఇప్పటికి చాలాసార్లు తాను పెళ్లికూతురు అయ్యానని, ఏం జరిగిందో తెలుస్తోందని, ఇప్పుడు ఎటూ తాము విడిపోయి నెల రోజులు అవుతున్నా కూడా సంతోషంగా ఉన్నామని ప్రైస్ చెబుతోంది. ఇక తాను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదని, అసలు మరోసారి పెళ్లి అవుతుందని కూడా అనుకోవట్లేదని తెలిపింది. ఇంతకుముందు ఆస్ట్రేలియన్ పాప్ స్టార్ పీటర్ ఆండ్రీ, కేజ్ఫైటర్ అలెక్స్ రీడ్లను ఆమె పెళ్లాడింది. కేట్కు జూనియర్, ప్రిన్సెస్ టియామీ, హార్వీ అనే ముగ్గురు పిల్లలున్నారు. ఇప్పుడు మరోసారి గర్భవతి. ఈసారి పుట్టబోయే వాళ్లకోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తోంది. -
అప్పుడే నాకు పెళ్లా: కంగనా రనౌత్
హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా 'క్వీన్' విడుదలకు సిద్ధమవుతున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. తాను అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశంలో లేనని చెబుతోంది. తనకు జీవితంలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయని అంటోంది. ''నాకు ఒంటరిగా ఉండటం అంటేనే ఇష్టం. నా జీవితంలో పెళ్లి కాక ఇంకా చాలా విషయాలున్నాయి. పెళ్లి అంటే జీవితాంతం కట్టుబడి ఉండాలి గానీ ప్రస్తుతానికి నాకు అలాంటి ఆలోచన లేదు'' అని కంగనా తెలిపింది. తనకు ఎవ్వరి కంపెనీ అక్కర్లేదని, తన సొంతకాళ్లపై నిలబడేందుకు చాలా పని చేస్తున్నానని ఈ అమ్మడు చెప్పింది. తనకు వంట చేయడం అన్నా, డాన్సు చేయడం అన్నా చాలా ఇష్టమని, అలాగే ఎవరి కంపెనీ లేకుండా ఒంటరిగా ఉండేవాళ్లంటే కూడా ఇష్టమని అంటోంది. త్వరలో రాబోతున్న మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా 'రివాల్వర్ రాణి'లో కూడా కంగనా రనౌత్ నటిస్తోంది. మిగిలిన సినిమాల్లో కేవలం నటిస్తే సరిపోతుందని, కానీ క్వీన్, రివాల్వర్ రాణి సినిమాలకు తాను ప్రాణం పెట్టానని తెలిపింది.