
కోట (రాజస్తాన్): వరుడి తరఫు వారు భారీగా కట్నం డిమాండ్ చేసినందుకు ఓ వధువు పెళ్లికి నిరాకరించింది. దీంతో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయింది. కోట మెడికల్ కళాశాల సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ సక్సేనా కూతురు రాశికి ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉన్న ఓ వైద్య కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సక్షమ్ మధోక్ కుమారుడితో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థం సందర్భంగా వరుడికి కారు, పది గ్రాముల బంగారం బహూకరించారు. పెళ్లి ఏర్పాట్లు, కట్న కానుకల రూపేణా రూ.35లక్షలు ఖర్చు చేశారు. రెండు కుటుంబాల బంధు మిత్రులు వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే, వరుడు మాత్రం రాలేదు. రూ.కోటి విలువ చేసే కానుకలు, నగలు, నగదు కూడా ఇస్తేనే వస్తామంటూ అతడు సమాచారం పంపాడు. ఇది తెలిసిన వధువు డాక్టర్ రాశి వరుడితో ఫోన్‌లో మాట్లాడింది. కట్నం డిమాండ్లపై అతడు వెనక్కి తగ్గకపోవటంతో ఈ పెళ్లి తనకిష్టం లేదని తెలిపింది. పెళ్లి కుమార్తె నిర్ణయాన్ని అంతా మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment