ఇంకెన్నాళ్లు డిసైడ్‌ చేస్తారు..స్త్రీని స్వేచ్ఛగా ఎదగనివ్వండి | Let the woman grow freely | Sakshi
Sakshi News home page

ఇంకెన్నాళ్లు డిసైడ్‌ చేస్తారు..స్త్రీని స్వేచ్ఛగా ఎదగనివ్వండి

Published Thu, Oct 14 2021 12:37 AM | Last Updated on Thu, Oct 14 2021 3:00 AM

Let the woman grow freely - Sakshi

గతంలో సినిమాల్లో ‘ఆధునిక మహిళ’ అనగానే కబ్బుల్లో ఉంటారని చూపించేవారు. వాళ్లు మోడర్న్‌ దుస్తులు ధరిస్తారు... స్మోక్‌ చేస్తారు.. కాపురాలు పట్టించుకోరు.. ఇప్పుడు కర్నాటకకు చెందిన ఒక మినిస్టరు ‘వారు పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అన్నాడు. మహిళ ఆధునికం కావడం అంటే  అభివృద్ధిలో, ఉత్పత్తిలో, ఉపాధిలో భాగం కావడం. వారిని ‘స్టీరియోటైప్‌’ చేయడం ఎన్నాళ్లు? వారిని చూసి భయపడటం ఎందుకు? ఆధునిక పురుషుడికి లేని విమర్శ మహిళకు ఎందుకు?

మొదట ఆధునిక పురుషుడు ఏం చేస్తాడో చూద్దాం. అతడు రాజకీయవేత్త అవుతాడు. వ్యాపారవేత్త అవుతాడు. సిఇఓ, సినిమా స్టార్‌ అవుతాడు. సూట్‌ వేసుకుంటాడు. విరామంలో గోల్ఫ్‌ ఆడతాడు. చిన్న షార్ట్స్‌ వేసుకుని సముద్రంలో ఈత కొడతాడు. సరదాగా ఫ్రెండ్స్‌తో డ్రింక్‌ చేస్తాడు. బిజినెస్‌ ట్రిప్‌లకు వెళతాడు. సంపాదిస్తాడు. ఖర్చు పెడతాడు.

వీటన్నింటికి సమాజం నుంచి ఆమోదం ఉంది. ఎందుకు? అతడు మగాడు. స్త్రీలు? వారూ చదువుతారు.  సిఇఓలు అవుతారు. వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తారు. స్పోర్ట్స్‌ ఆడతారు. మెడల్స్‌ తెస్తారు. కారు డ్రైవ్‌ చేస్తారు. ఆఫీస్‌ పనుల మీద టూర్లు వెళతారు.

కాని వీటికి విమర్శ వస్తుంది. ‘సంసారాన్ని వదిలేసి అలా ఎలా తిరుగుతుంది’.  పశువు మెడలో తాడు కట్టేసి ఆ తాడును ఎంత దూరం వదిలినా ఆ పశువు తిరిగి తిరిగి మళ్లీ గుంజ దగ్గరకు చేరాలి అన్నట్టుగా భారతీయ సమాజం స్త్రీ ఎంత దూరం వెళ్లినా, ఎంత ఉన్నతి సాధించినా తిరిగి ‘సంసారం’, ‘మాతృత్వం’ వంటి ప్రాథమిక బాధ్యతల వద్దకే తిరిగి రావాలని భావిస్తుంది.  స్త్రీని సంసారం నుంచి ‘ఆధునికత’ విముక్తం చేస్తుందనే భయం ఉంది– అందుకు ఏ రకమైన అధ్యయనం, ఆధారం లేకపోయినా.

స్త్రీలు ఇల్లు కదలడం, చదువుకోవడం, మొదట స్టెనోలుగానో, టైపిస్ట్‌లుగానో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం, తమ కోసం మహిళా సంఘాలు పెట్టుకోవడం మొదలెట్టినప్పటి నుంచి వారిని ‘కేరికేచర్లుగా’ చూపిస్తూ, హేళన చేయదగ్గ స్త్రీలుగా చూపిస్తూ సమాజం వారిని అదుపు చేయాలని చూసింది. చూస్తోంది. పాత సినిమాల్లో ఆధునిక స్త్రీ అంటే విగ్గులు పెట్టేసి, చేతికి హ్యాండ్‌బ్యాగు వేలాడదీసి, క్లబ్బులో పేకముక్కలు చేతికి ఇచ్చేవారు. ఇప్పుడు పబ్బుల్లో చూపిస్తున్నారు.

ఇవాళ బాగా చదువుకున్న ప్రతి స్త్రీ, ఉద్యోగ, ఉపాధి, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రతి స్త్రీ ఆధునిక స్త్రీనే. ఆ చదువుకున్న స్త్రీ గృహిణిగా ఉంటున్నా ఆధునిక స్త్రీనే. అయితే ఛాందస వాదుల నిందలు, విమర్శలు ఏమంటే ‘వీరు కుటుంబాన్ని (భర్తను, పిల్లలను) నిర్లక్ష్యం చేస్తారు’ అని. అలా అని చెప్పి వీరి మీద ఒక ఒత్తిడి తెస్తారు. నిజానికి పురుషుడు ఎంత ఎదిగినా ఎలా కుటుంబంలోకి వస్తున్నాడో స్త్రీలు కూడా ఎంత ఎదిగినా కుటుంబంలోకి వస్తారు. వారికి తల్లిగా, భార్యగా ఇంటిని ఎలా నిర్వహించుకోవాలో తెలుసు. కాని పురుషుడికి ఉండే వెసులుబాటు వారికి ఉండదు. తన కెరీర్‌ కోసం పురుషుడు ముందు వెళ్లాలంటే స్త్రీ కుటుంబ నిర్వహణ కోసం తనను తాను కుదించుకోవాలి లేదా త్యాగం చేయాలి. ‘ఆధునిక మహిళ’ ఇక్కడ ప్రశ్నను లేవదీస్తుందని, నీకున్న హక్కు నాకు ఎందుకు లేదు అంటుందని, తద్వారా ‘పిల్లల్ని కంటూ ఇంటి దగ్గర పడుండే’ స్త్రీ పాత్ర నుంచి ఆమె విముక్తమవుతుందని సమాజానికి భయం.

అందుకే సినిమాల్లో, అడ్వర్‌టైజ్‌మెంట్లలో, చవకబారు సాహిత్యంలో, కార్టూన్లలో అలాంటి స్త్రీలను హేళన చేయడం కనిపిస్తూ ఉంటుంది. ‘స్టెనోలందరూ బాస్‌ ఒళ్లో కూచుని ఉంటారు’ అని ఇప్పటికీ కార్టూన్లు గీస్తూ స్త్రీలను అవమానించే కార్టూనిస్టులు ఉద్యోగాల్లో తమను తాము నిరూపించుకోవాలనుకుంటున్న స్త్రీలకు ఎంత అన్యాయం చేస్తున్నారో ఊహించలేరు. ఇక టీవీ పెట్టగానే వచ్చే అడ్వర్‌టైజ్‌మెంట్లు ‘ఉప్పు గురించి’, ‘మసాలా దినుసుల గురించి’, ‘టీ గురించి’, ‘అత్తయ్యకు నచ్చిన హెయిర్‌ ఆయిల్‌ గురించి’ మాట్లాడే గృహిణులను చూపి చూపి నీ ఆర్థిక స్తోమత, చదువు ఎంతున్నా నువ్వు ఎంగేజ్‌ కావాల్సింది ఈ పనుల్లోనే అని కండిషన్‌ చేస్తూ వస్తుంటాయి.

రాజకీయాల్లో ఉండే స్త్రీలను, టీవీ డిబేట్‌లలో మాట్లాడే స్త్రీలను, ఉద్యమాల్లో ఉండే స్త్రీలను, మేధావులుగా ఉండే స్త్రీలను, ఆత్మవిశ్వాసంతో ఉండే స్త్రీలను, ఫ్యాషన్‌– గ్లామర్‌ రంగాల్లో ఉండే స్త్రీలను, ఎన్‌.జి.ఓ రంగాల్లో ఉండే స్త్రీలను సమాజానికి ఉండే ‘సగటు పురుష స్వభావం’ అంగీరించే పరిస్థితులు నేటికీ కనిపించకపోవడానికి కారణం అలాంటి స్త్రీలు తెల్లారితే గిన్నెలు కడుక్కుంటూ కనిపించరేమోనన్న భయం. పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా.

తాజాగా కర్నాటక ఆరోగ్యశాఖా మంత్రి సుధకార్‌ ‘ఆధునిక స్త్రీ సింగిల్‌గా ఉండటానికి ఇష్టపడుతోంది, ఆమె పిల్లల్ని కనడానికి ఇష్టపడటం లేదు’ అని వ్యాఖ్యానించాడు. నిజానికి స్త్రీకి తన శరీరం మీద హక్కు తనకే ఇంకా దక్కలేదు. పిల్లల్ని కనడం కనకపోవడం గురించి ఆమెకు వైవాహిక వ్యవస్థలో పూర్తిగా స్వేచ్ఛ లేదు. ఆమె ఏం చదవాలో, ఏ ఉద్యోగం చేయాలో కుటుంబమే డిసైడ్‌ చేస్తూ ఉంటుంది. ఆమె వివక్ష అనుభవిస్తూనే ఎదగాల్సి వస్తోంది. ఇన్ని జరుగుతున్నా ఆమె కుటుంబ చట్రానికి ఆవల వెళుతుందేమోనన్న భయంతో బ్లేమ్‌ కొనసాగుతూనే ఉంది.

ఆధునిక స్త్రీ సమాజ హితం, కుటుంబ హితం కోరుతూనే ఉంది. అయితే దానికి సంబంధించిన రూల్స్‌ ఆమె మార్చదలుచుకుంటే వాటి మీద కదా చర్చ జరగాలి. అందాక నిందలు, విమర్శలు మానాలని అందరికీ చెబుదాం.    

పిల్లల్ని బాగా చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఇంటి బయట తాను ఎంచుకున్న కార్యరంగంలో స్త్రీ ఎదగడం మొదలెట్టి చాలా కాలం అయ్యింది. అయినా సరే ఆమెను వేలెత్తి చూపడం మానడం లేదు... కుటుంబ వ్యవస్థ స్థిరీకరణకు స్త్రీతో పాటు పురుషుడు సమాన బాధ్యత వహించాల్సి ఉన్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement