
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): ప్రజలు ఏదైతే జరగకూడదని కోరుకున్నారో అదే జరుగుతోంది. ఆరోగ్యమంత్రి మాటలే అందుకు నిదర్శనం. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటును గమనిస్తే థర్డ్ వేవ్ వచ్చినట్లు ఖరారైందని ఆరోగ్య శాఖ మంత్రి కే.సుధాకర్ అన్నారు. గత ఆరు నెలల నుంచి పాజిటివ్ రేటు 0.1 శాతం కూడా లేదని, ప్రస్తుతం 1.06 శాతానికి పెరిగిందని, అంటే మూడో దశ ఆరంభమైనట్లు అర్థమని తెలిపారు.
మంగళవారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమిక్రాన్ రోజు రోజుకు పెరుగుతోంది, సోమవారం ఒకే రోజు 1.06 శాతానికి చేరింది, బెంగళూరులో అధికంగా సోకితులు ఉన్నారని చెప్పారు.
బెంగళూరులో మైక్రో కంటైన్మెంట్లు?
బెంగళూరులో కేసులు వచ్చినచోట మైక్రో కంటోన్మెంట్ జోన్ చేయడంపై సీఎంతో చర్చించనున్నట్లు తెలిపారు. బెంగళూరు ఇప్పటికే రెడ్ జోన్‌లో ఉండగా, కొన్ని కఠిన నిర్ణయాలు అవసరమన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల బతుకులను యథాస్థితికి తెచ్చేలా కరోనాను నియంత్రించడం పెద్ద సవాల్‌గా మారిందని వాపోయారు. బెంగళూరుకు అధికంగా విదేశీయులు వస్తున్నారు.
అందుచేత వైరస్ అతి వేగంగా విస్తరిస్తోందన్నారు. జనవరి 15 తరువాత మూడో అల రావచ్చని అనుకుంటే అంతకంటే ముందుగానే వచ్చేసిందని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌నేతలు మేకెదాటు పాదయాత్రను విరమించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment