
ఆ నటివి పచ్చి అబద్ధాలు: స్కూల్‌మేట్ మండిపాటు
బాలీవుడ్ నటి పరిణీత చోప్రా మరోసారి చిక్కుల్లో పడింది. తాను చదువుకునే రోజుల్లో తమది పేద నేపథ్యమని, అప్పట్లో తమ కుటుంబానికి కారు కూడా ఉండేది కాదని పరిణీత పచ్చి అబద్ధాలు చెప్పిదంటూ స్కూల్‌మేట్‌గా భావిస్తున్న ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారిపోయింది. గతంలో లావుగా ఉన్న ఓ స్నేహితురాలిని సోషల్ మీడియాలో విమర్శించడంతో నెటిజన్లు ఆమె తీరుపై మండిపడ్డారు. ఇప్పుడు ఆమె తాను చదువుకున్న రోజుల గురించి అన్నీ అబద్ధాలే చెప్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
గత నెలలో పరిణీత చోప్రా, హీరో అక్షయ్‌కుమార్ కలిసి ముంబైలోని ఓ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పరిణీత మాట్లాడుతూ తాను స్కూల్‌లో ఉన్నప్పుడు తనది పేద నేపథ్యమని, పాఠశాలకు వచ్చేందుకు తనకు కారు కూడా ఉండేది కాదని, కాబట్టి సైకిల్ మీద తాను స్కూల్‌కు వచ్చేదానినని చెప్పింది. సైకిల్ మీద వస్తుంటే తనను తోటి విద్యార్థులు వేధించేవారని, అలాంటి వేధింపులే తనను శక్తివంతంగా మార్చాయని చెప్పుకొచ్చింది.
అయితే, ఆమెతోపాటే ముంబై అంబాలాలోని సీజేఎం (కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మెరీ) పాఠశాలలో చదివిన కన్నూ గుప్తా పరిణీత వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ’సిగ్గుపడు పరిణీత.. బాగా కలిగిన కుటుంబం నుంచి వచ్చిన నువ్వు ఈ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్తున్నావు. సెలబ్రిటీలు అంటే ఇలాగే ఉంటారేమో. కారు లేదు, డబ్బు లేదంటూ కల్పిత కథలు చెప్తారేమో. నేను కూడా ఆమె చదివిన స్కూలోనే చదివాను. ఆమె తండ్రికి కారున్న సంగతి నాకు గుర్తే. అంతేకాకుండా ఆరోజుల్లో స్కూలుకు సైకిల్ మీద రావడమంటే చాలా గొప్పే. సైకిల్ లేనివాళ్లు కూడా చాలామంది ఉండేవాళ్లు. సీజేఎంలో చదివిన నా స్నేహితులకు ఆమె అబద్ధాలు ఇంకా బాగా అర్థమవుతాయి’ అని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశాడు.
ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. అంబాలాలో పరిణీత ఇరుగుపొరుగువారు కూడా ఆమె చెప్పినవి చాలావరకు అబద్ధాలేనని ఈ పోస్టు మీద కామెంట్లు చేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బంధువులుగా అప్పటికే వారికి మంచి పేరు ఉండేదని, వారు మంచి స్థితిమంతులేనని అంటున్నారు. స్కూలు రోజుల నుంచి పరిణీత ఇలాగే అసంబద్ధంగా వ్యవహరించేదని మండిపడుతున్నారు. దీనిపై స్పందించాలని కోరినా పరిణీత ఇప్పటివరకు మౌనంగా ఉంది.