పాఠశాల విద్యలో సంస్కరణల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోపాలు, చేపట్టాల్సిన సంస్కరణలపై వివరణ
ప్రతిపాదనల రూపకల్పన..
వారంలో నివేదిక
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యలో సంస్కరణల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లోపాలు, చేపట్టాల్సిన సంస్కరణలపై వివరణ పత్రాన్ని రూపొందించి ఇప్పటికే అసెంబ్లీకి అందజేసిన ప్రభుత్వం, వాటి నివారణ, చేపట్టాల్సిన సంస్కరణలపై దృష్టి సారించింది. పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మొదలుకొని ఉపాధ్యాయ సంఘాల నియంత్రణ, టీచర్ల నియామకాల్లో మార్పులు, పదోన్నతుల విధానం, ఇంగ్లిషు మీడియం పాఠశాలల ప్రారంభం, ప్రీ ప్రైమరీ విద్యా విధానం అమలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవో పోస్టుల డెరైక్టు రిక్రూట్‌మెంట్ తదితరాలపై ప్రతిపాదనలివ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో విద్యాశాఖ రంగంలోకి దిగింది.
సంస్కరణలు, వాటి విధి విధానాలపై ప్రతిపాదనల రూపకల్పనకు సోమవారం ఉన్నత స్థాయి కమిటీ వేసింది. పాఠశాల విద్య అదనపు డెరైక్టర్లు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ (సర్వీసెస్), హైదరాబాద్ ఆర్జేడీ, ఇద్దరు, డీఈవోలు, ఇద్దరు ఎంఈవోలు ఇందులో ఉంటారు. అంశాలవారీగా ప్రతిపాదనలు, సిఫార్సులతో వారంలో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని ఆదేశింది. తర్వాత ఒక్కో అంశంపై ప్రభుత్వానికి విద్యా శాఖ ప్రతిపాదనలు పంపనుంది. ముందుగా టీచర్లు, పాఠశాలల హేతుబద్ధీకరణపైనే తొలి ప్రతిపాదన సిద్ధం చేసే అవకాశముంది. హేతుబద్ధీకరణను ఈ వేసవిలోనే పూర్తి చేయాల్సి ఉంది. మే 1న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉన్నందున ఉపాధ్యాయ నియామకాలపై దృష్టి సారించాల్సి ఉంది.