
ఉన్నత పాఠశాలకు తాళం.. తల్లిదండ్రుల ఆందోళన
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి పూర్తి స్థాయిలో విద్యను అందించాలని కోరుతూ తల్లిదండ్రులు ఉన్నత పాఠశాలకు తాళం వేసి ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు.
రొళ్ల: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించి పూర్తి స్థాయిలో విద్యను అందించాలని కోరుతూ తల్లిదండ్రులు ఉన్నత పాఠశాలకు తాళం వేసి ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. శనివారం మండలంలోని అలుపనపల్లి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. అయితే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండటంతో సమావేశంలో తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 6నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీషు, తెలుగు మీడియంలో 255 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. ఉన్నత పాఠశాలలో 15మంది ఉపాధ్యాయులు పని చేయాల్సి ఉండగా కేవలం 6మంది మాత్రమే ఉన్నారన్నారు.
ఏడాదిగా సోషియల్, ఫిజికల్ సైన్సుకు ఉపాధ్యాయులను నియమించలేదని, విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించేవరకు పాఠశాలను తెరవకూడదని డిమాండ్ చేశారు. అన్ని గదులకు తాళాలు వేసి పాఠశాల ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమం చేపట్టారు. గంటపాటు పాఠశాలను మూసివేశారు. జోక్యం చేసుకున్న హెచ్‌ఎం రామకృష్ణారెడ్డి తల్లిదండ్రులు, విద్యార్థులకు సర్ధిచెప్పి యథావి«ధిగా పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ విషయమై ఎంఈఓ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయం వాస్తవమేనన్నారు. అలుపనపల్లితో పాటు ఎం రాయాపురం, రత్నగిరి, హెచ్‌టీహళ్లి, బీజీహళ్లి ఉన్నత పాఠశాలల్లో కూడా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు. డిప్యూటేషన్‌పై ఖాళీగా ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయుల్ని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం.