విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చూపి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను మూతవేయడం ప్రజా వ్యతిరేక చర్యగా ఏపీటీఎఫ్
శ్రీకాకుళం: విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చూపి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను మూతవేయడం ప్రజా వ్యతిరేక చర్యగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 5,690 ప్రాథమిక పాఠశాలల్లో 19 కంటే తక్కువగా విద్యార్థులున్నార న్న నెపంతో విద్యాశాఖ మూసివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. 4,102 ఆర్‌సీ నెంబరుతో ఈ నెల 13వ తేదీన పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శికి పాఠశాల విద్యా సంచాలకులు ప్రతిపాదనలను పంపడం పట్ల ఏపీటీఎఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. స్థానిక ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం పాఠశాల విద్యలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత దశలతో మూడంచెలుగా సాగుతోందని, ప్రాథమికోన్నత దశను రద్దుచేసి రెండంచెల విధానంతో కొనసాగించాలన్న అధికారుల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16వ తేదీన విద్యాశాఖ మంత్రితో నిర్వహించనున్న సమావేశంలో తమ వైఖరిని ఏపీటీఎఫ్ పక్షాన విరవించి బడుల మూతను నివారించే కృషిని సాగిస్తామన్నారు.
అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ఎదుట అదే రోజు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ భాగస్వామ్య సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాకు తరలిరావాలని రాజశేఖర్ పిలుపునిచ్చారు. ఏపీటీఎఫ్ జిల్లాశాఖ అధ్యక్షుడు టి.చలపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కవిటి పాపారావు, గురుగుబెల్లి బాలాజీరావు, వానా కామేశ్వరరావు, బి.నవీన్, బి.రవి, ఎం.తులసీరావు, పి.బాలాజీరావు, పి.అనంతరావు, జగన్నాథం, బోర వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.