
పాఠశాలల మూసివేత .. తుది దశకు
విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
► జిల్లాలో 30 యూపీ స్కూల్స్ అప్‌గ్రేడ్, 74 యూపీ, 3 హైస్కూల్స్ మూసివేత
► రేషనలైజేషన్ ప్రక్రియలో గుర్తింపు, ప్రభుత్వానికి వెళ్లిన ప్రతిపాదనలు
► బదిలీల కోసం 4 వేల మంది ఉపాధ్యాయుల ఎదురుచూపు
గుంటూరు ఎడ్యుకేషన్ : విద్యార్థుల సంఖ్య ఆధారంగా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈనెల 22న ప్రభుత్వం విడుదల చేసిన జీవో 29 ఆధారంగా రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లా విద్యా శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో జీవో 29 ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా 6, 7, 8 తరగతుల్లో 80 మందితో పాటు, 6, 7 తరగతుల్లో 60 మంది కంటే ఎక్కువగా విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్ కానున్నాయి. అదే విధంగా ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకూ 50 మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉన్న మూడు ఉన్నత పాఠశాలలు మూతపడనున్నాయి. దీంతో పాటు 6, 7 తరగతుల్లో 30 మంది కంటే తక్కువగా విద్యార్థులు ఉన్న 74 ప్రాథమికోన్నత పాఠశాలలు శాశ్వతంగా మూతపడనుండగా, ఆయా స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులను సమీప పాఠశాలలకు పంపించనున్నారు.
బదిలీల కోసం టీచర్ల ఎదురుచూపు..
బదిలీల కోసం జిల్లాలో నాలుగు వేల మంది ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఎనిమిదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకుని తప్పనిసరి బదిలీ పొందేవారు దాదాపు 1,400 మంది ఉన్నారు. పరస్పర బదిలీలు పొందే ఉపాధ్యాయులు మరో 2,600 మంది వరకూ ఉన్నారు. ఈ విధంగా జిల్లాలో నాలుగు వేల మంది బదిలీ కోసం ఎదురు చూస్తుండగా, ప్రభుత్వం రేపు, మాపు అంటూ షెడ్యూల్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. వేసవి సెలవుల్లో ఊళ్ళకు ప్రయాణమయ్యేందుకు ముందుగానే ప్రణాళిక వేసుకున్న టీచర్లు బదిలీల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో అనే ఆదుర్ధాతో సెలవులను సరదాగా గడపడం మరిచి ఆందోళనతో ఉన్నారు. బదిలీల షెడ్యూల్ సోమవారం విడుదల చేస్తామని ఎదురుచూసిన ఉపాధ్యాయులకు నిరాశ ఎదురైంది.