డాక్టర్లకు దండన | govt punishment on doctors in guntur general hospital | Sakshi
Sakshi News home page

డాక్టర్లకు దండన

Published Tue, Jul 5 2016 10:58 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

govt punishment on doctors in guntur general hospital

ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణపై సీరియస్
చర్యలకు శ్రీకారం చుట్టిన పూనం మాలకొండయ్య
20 మంది వైద్యులకు మూడు ఇంక్రిమెంట్‌లు కట్
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్  నివేదిక ఆధారంగా చర్యలు

 
ప్రభుత్వాస్పత్రుల్లో ఉద్యోగాలు నిర్వహిస్తూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ కనీస బాధ్యతలు విస్మరిస్తున్న వైద్యులపై చర్యలు మొదలయ్యాయి. పేద రోగులకు సరిగా వైద్యం చేయకుండా     {పైవేటుగా క్లినిక్‌లు నడుపుతున్న 20 మంది డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని  వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలతోపాటు దానికి అనుబంధంగా ఉండే జీజీహెచ్‌లో పనిచేసే ప్రొఫెసర్‌లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్‌లు తమ బాధ్యతలు విస్మరించి సొంత ఆసుపత్రులు నిర్వహించుకుంటున్నారు. విచారణ చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నివేదికల ఆధారంగా పూనం మాలకొండయ్య చర్యలకు శ్రీకారం చుట్టారు.
 
 
గుంటూరు :  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తూ సొంతంగా ఆస్పత్రులు నిర్వహించు కోవడం నిబంధనలకు విరుద్ధం.  జిల్లాలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు తమ విధులను కనీసంగా కూడా నిర్వర్తించకుండా ప్రైవేటు ప్రాక్టీసుపైనే మక్కువ చూపిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకొచ్చే పేదలకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ప్రాథమిక వైద్యం సైతం వారికి అందే పరిస్థితులు లేవు. ఈ విషయంపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లడంతో విజిలెన్స్ శాఖ విచారణ చేపట్టింది.

రెండేళ్ల కిందటే విచారణ పూర్తి చేసి 20 మంది వైద్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించారు. అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఫిర్యాదులొచ్చిన వైద్యులకు కేవలం షోకాజ్ నోటీసులు జారీ చేసి మిన్నకుండిపోయారు. దీంతో వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు.
 
వివరణపై సంతృప్తి చెందని ప్రిన్సిపల్ సెక్రటరీ....
ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యులు ఇచ్చిన వివరణలపై పూనం మాలంకొండయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. 20 మంది వైద్యులకు మూడు ఇంక్రిమెంట్‌లు కట్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. వీరిపై తదుపరి చర్యలు తీసుకోవాలని డీఎమ్‌ఈని ఆదేశించారు. చర్యలకు గురైన వారిలో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ జి. సుబ్బారావు, మాజీ ప్రిన్సిపల్ శైలబాలతోపాటు 10 మంది ప్రొఫెసర్‌లు, ముగ్గురు  అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, ఏడుగురు అసోసియేట్ ప్రొఫెసర్‌లున్నారు. జీజీహెచ్‌లో సెలవు పెట్టి ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న వారిపై సైతం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
 
కనువిప్పు కలిగేనా..?
ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్‌లో పనిచేస్తూ లక్షల్లో జీతాలు తీసుకుంటున్న వైద్యుల్లో కొందరు కనీస బాధ్యతలు మరిచి సొంత ప్రాక్టీస్‌పై శ్రద్ధ చూపుతుండడం వైద్య విద్యార్థులు, నిరుపేద రోగులకు శాపంగా మారింది. గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్‌లు, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అనేక సార్లు తనిఖీలు చేపట్టి హెచ్చరించినా వీరిలో ఎలాంటి మార్పు రాకపోవడం శోచనీయం. కనీసం ఈ చర్యతోనైనా కనువిప్పు కలిగితే చాలంటూ వైద్య నిపుణులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
 
20 మంది ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణ చర్యలు
గుంటూరు మెడికల్:  ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహిస్తున్న గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పనిచేస్తున్న 20 మంది వైద్యులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలను తీసుకుంది.  చర్యలు తీసుకున్న వారిలో జనరల్‌మెడిసిన్ ప్రొఫెసర్లు డాక్టర్ శనక్కాయల భానుఉదయ్‌శంకర్, డాక్టర్ దేవినేని సుధీర్‌బాబు, డాక్టర్ బి.శైలజ,  పిల్లల వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పెనుగొండ యశోధర, రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జీవీ పార్వతీశ్వరరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ చిటితోటి కిషోర్‌కుమార్, పెథాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ గరికపర్తి శైలబాల, డాక్టర్ సి.పద్మావతి,  గైనకాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ వీఏఏ లక్ష్మి, డాక్టర్ పి.చంద్రశేఖరరావు, ఎ.కవిత,  అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.స్వరూపరాణి, చెస్ట్, టీబీ వ్యాధుల వైద్య విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకంటి రఘు, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ కట్టా శ్రీనివాసరావు, డాక్టర్ గడ్డం విజయసారధి, అర్థోపెడిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వీవీ నారాయణరావు, యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.రవిచంద్రకుమార్, ఈఎన్‌టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కొణిదె రవి, కుటుంబ నియంత్రణ విభాగం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మండవ శ్రీనివాసరావులు ఉన్నారు. వీరిలో డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, డాక్టర్ దేవినేని సుధీర్‌బాబు ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement