350 మంది విద్యార్థులు, సిబ్బందితో ఉన్న పాఠశాల భవనం కుప్ప కూలింది. అయితే దాంట్లోనివారంతా ప్రమాదంనుంచీ తృటిలో తప్పించుకోగలిగినట్లు అధికారులు వెల్లడించారు.
కుమర్హట్టిః వందలకొద్దీ స్కూలు విద్యార్థులు, ఉద్యోగులతో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల భవనం కుప్ప కూలింది. అయితే దాంట్లోనివారంతా ప్రమాదంనుంచీ తృటిలో తప్పించుకోగలిగినట్లు అధికారులు వెల్లడించారు.
హిమాచల్ ప్రదేశ్ సర్విత్కరీ శిక్షా నికేతన్ పాఠశాల మొత్తం 350 మంది విద్యార్థులు, సిబ్బందితో కొనసాగుతోంది. బీటలు వారి ఉన్న స్కూలు భవనం నుంచీ విద్యార్థులను ఖాళీ చేయించేందుకు ఎప్పట్నుంచో నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ప్రమాదం జరిగేందుకు కొద్ది నిమిషాల క్రితమే భవనాన్ని ఖాళీ చేయించారు. దీంతో భారీ ముప్పు తృటిలో తప్పించుకోగలిగారని డిప్యూటీ కమిషనర్ రాకేష్ కన్వర్ తెలిపారు.
అప్పటికే బీటలు వారి ఉన్న స్కూలు భవనం ఊగుతున్నట్లుగా అనిపించిన సిబ్బంది.. వెంటనే అక్కడినుంచీ విద్యార్థులను బయటకు పంపించేశారు. దీంతో స్కూల్లోని మొత్తం 342 మంది విద్యార్థులు క్షేమంగా బయటపడినట్లు స్కూలు అధికారులు తెలిపారు. భవనం కదులుతున్నట్లుగా అనిపించిన మాలా మేడమ్.. వెంటనే స్పందించి పిల్లలందరినీ క్లాసులనుంచీ బయటకు పంపించేశారని ఓ విద్యార్థి పోలీసులకు వివరించాడు. అయితే పాఠశాల భవనం కూలడానికి గల కారణాలను తెలుసుకుంటామని, ఎటువంటి నిర్వహణా లోపాలు లేనట్లు నిర్ధారించుకున్న తర్వాతే.. స్కూలు తిరిగి కొనసాగించేందుకు అనుమతి ఇస్తామని కన్వర్ తెలిపారు.