
విశ్వంలో ఎంత దూరం వెళ్లినా గురుత్వాకర్షణ శక్తి ఉంటుందా?
స్కూల్ ఎడ్యుకేషన్
* మన విశ్వంలో ‘ద్రవ్యరాశి’ (పదార్థం) గల ప్రతి వస్తువూ వేరే వస్తువుని ఆకర్షిస్తుంది. తన ఆకర్షణ శక్తితో ఆ రెండో వస్తువుని తన వైపుకి లాక్కొనే ప్రయత్నం చేస్తుంది. ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల మధ్య పరస్పరం ఉండే ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ బలం అని అంటారు. ఏవైనా రెండు వస్తువుల మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒకటి ఆ రెండు వస్తువులలోనూ ఉండే పదార్థ పరిమాణం కాగా రెండోది ఆ రెండు వస్తువుల కేంద్ర భాగాల మధ్య ఉండే దూరం.
* వస్తువుల ద్రవ్యరాశి పెరిగితే వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం కూడా పెరుగుతుంది. ఆ బలం రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఆ ద్రవ్యరాశుల లబ్ధం ఎంత ఎక్కువగా ఉంటే వాటి మధ్య పనిచేసే గురుత్వ బలం కూడా అంత ఎక్కువగా ఉంటుందన్న మాట. ఇది ఒక ముఖ్యమైన విషయం.
* ఇక గురుత్వ బలానికి సంబంధించిన రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. రెండు వస్తువుల కేంద్రకాల మధ్య ఉండే దూరం పెరిగే కొద్దీ ఆ రెండు వస్తువుల మధ్య పనిచేసే గురుత్వ బలం అదే స్థాయిలో తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకు భూకేంద్రానికి -మనకు మధ్య ఉన్న దూరాన్ని రెండింతలు పెంచితే భూమికి - మనకు మధ్య పనిచేసే గురుత్వ బలం నాలుగో వంతుకి, పదింతలు పెంచితే 100వ వంతుకి పడిపోతోంది. ఇలా దూరం పెరిగి కొద్దీ గురుత్వ బలం క్రమేణా తగ్గిపోతుందే కాని ఎన్ని కోట్ల మైళ్ల దూరానికి పోయినా అది శూన్య స్థితికి మాత్రం చేరుకోదు. ఇదే సూత్రం విశ్వంలోని అన్ని ఖగోళాలకి వర్తిస్తుంది.