
వీపుపై గాయాలు చూపుతున్న విద్యార్థి (ఇన్‌సెట్‌లో వెంకట నంద)
కంచికచర్ల(వీరులపాడు): తరగతి గదిలో అకారణంగా నవ్వాడనే కారణంతో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు కర్రతో విచక్షణా రహితంగా కొట్టిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలోని విజయవాడ రవీంద్ర భారతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన పాలడుగు రాధాకృష్ణ కుమారుడు వెంకట నంద విజయవాడ రవీంద్ర భారతి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం తరగతి గదిలో తోటి విద్యార్థులతో సరదాగా మాట్లాడుతూ నవ్వాడు.
దీంతో కోపగించిన ఉపాధ్యాయుడు సైదేశ్వరరావు విద్యార్థి వీపుపై కర్రతో విచక్షణా రహితంగా కొట్టటమే కాకుండా తలను నల్లబల్లకేసి కొట్టాడు. విద్యార్థి జరిగిన సంఘటనను తండ్రికి తెలపటంతో తండ్రి పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీఈవో, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తక్షణమే ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి బంధువులు డిమాండ్ చేశారు. కాగా విద్యార్థిని కొట్టిన ఘటనలో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సందీప్ ఆదివారం తెలిపారు. గాయపడిన విద్యార్థి నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు.