విధిని గెలిచి
ఆశ చిన్నపిల్లగా ఉన్నప్పుడు తల్లి చనిపోయింది. తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి వేధింపులు తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయింది ఆశ. ఒక రైల్వేస్టేషన్‌లో కొందరు దుర్మార్గులకు చిక్కింది. వాళ్లు ఆమెను ఒక వేశ్యాగృహానికి అమ్మేశారు.
‘పాప్రి’ ది కూడా ఇలాంటి కథే!
లతకు పదహారు సంవత్సరాల వయసులో పెళ్లయింది. కాపురం చేయకుండానే భర్త ఆమెను పుణేలోని ఒక వేశ్యాగృహానికి అమ్ముకున్నాడు. పెద్ద చదువులు చదవాలని ఎన్నో కలలు కన్న లత చీకటి కూపంలో చిక్కుకుపోయింది.ఇలాంటి బాధితులకు విముక్తి కలిగించి కొత్త దారి చూపిస్తుంది ‘ఫ్రీ ఏ గర్ల్ మూమెంట్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ.
మనుషుల అక్రమరవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ సంస్థ, అమ్మాయిలను వేశ్యాగృహలకు అమ్మే సంఘవిద్రోహశక్తులపై పోరాటం చేయడానికి ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తోంది. బాధిత మహిళలను చీకటికూపం నుంచి విముక్తి కలిగించడానికి మాత్రమే పరిమితం కాకుండా వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి, సరికొత్త ఉత్సాహంతో భవిష్యత్తుకు కొత్తదారి వేసుకోవడానికి అడ్వర్‌టైజింగ్ ఏజెన్సీ ‘జె.వాల్టర్ థామ్సన్ అమ్‌స్టర్‌డామ్’తో కలిసి ముంబైలో ‘ది స్కూల్ ఫర్ జస్టిస్’ అనే విద్యాసంస్థను ప్రారంభించింది.
న్యాయవాదులు కావాలని, తమలాంటి బాధిత మహిళలకు అండగా నిలవాలనుకునే విముక్త మహిళలకు ఈ స్కూల్ అండగా నిలుస్తుంది. స్కూల్ నుంచి మొదలు లా డిగ్రీ చేతికందే వరకు అన్ని రకాల సహాయ సహాకారాలు అందిస్తుంది ‘ది స్కూల్ ఫర్ జస్టిస్’‘‘నేను లాయర్ కావడం ద్వారా, కష్టాల్లో ఉన్నవారికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నాను’’ అంటుంది ఆశ.
‘పబ్లిక్ ప్రాసిక్యూటర్’ కావాలని కలలు కంటోంది లత. ‘‘సమాజాన్ని, చట్టాలను అర్థం చేసుకోవడానికి న్యాయవాద వృత్తి ఉపకరిస్తుంది’’ అంటున్నారు ‘ది స్కూల్ ఫర్ జస్టిస్’ నిర్వాహకులు. బతుకులోనే చావును చూసిన విషాదం. కలలు కనడానికి కూడా ధైర్యం లేని దయనీయ విషాదం. ఇప్పుడు చీకట్లో నుంచే కొత్త వెలుగు రేఖ ఉదయించింది... ఆ వెలుగురేఖలకు ‘ది స్కూల్ ఫర్ జస్టిస్’ వెన్నుదన్నుగా నిలుస్తోంది.