ప్రేమ సుమాల‌పై ప‌రువు ఖ‌డ్గాలు | dignity murder special | Sakshi
Sakshi News home page

ప్రేమ సుమాల‌పై ప‌రువు ఖ‌డ్గాలు

Published Tue, Jun 6 2017 11:29 PM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

ప్రేమ సుమాల‌పై ప‌రువు ఖ‌డ్గాలు - Sakshi

ప్రేమ సుమాల‌పై ప‌రువు ఖ‌డ్గాలు

కులాంతర ప్రేమలు, వివాహాలను సమ్మతించని తల్లిదండ్రులు
పరువు హత్యలకు తెగిస్తున్న తండ్రులు
ప్రత్యేక చట్టం చేయాలని మహిళా సంఘాల డిమాండ్‌
ఆలోచనతో ప్రేమించాలంటున్న సామాజిక వేత్తలు
అమలాపురం టౌన్‌ : పరువు కత్తులకు ప్రేమికులు కడతేరిపోతున్నారు. పరువు పడగ నీడలో ప్రేమికుల ప్రాణాలు సమాధి అవుతున్నాయి. కులాంతర ప్రేమ..పెళ్లి అంటే వారి తల్లిదండ్రులు కట్టలు తెగిన కోపంతో తమ పిల్లలను పథకం ప్రకారం హత్యలు చేయిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించే పిల్లలు విజ్ఞతతో తమ భాగస్వామిని ఎంచుకోవడంతో జరుగుతున్న ఒడిదుడుకు నిర్ణయాలను తల్లిదండ్రులు సమ్మితించకలేకపోతున్నారు. అలాగే మేజర్లై తమ జీవిత భాగస్వామిని ప్రేమ పేరుతో ఎంచుకున్నప్పుడు తమ తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించే రీతిలో ముందే తమ నిర్ణయాలను చెప్పలేకపోతున్నారు. ఈ రెండు కారణాల మధ్య అవగాహన, సమన్వయం లేకపోవటం వల్లే పరువు హత్యలకు దారితీస్తున్నాయి. ప్రేమించడం పిల్లల హక్కు.. అభ్యంతరం చెప్పటం తల్లిదండ్రుల హక్కు అన్నట్టుగా తయారై పరువు పేరుతో ప్రాణాలను పాతర వేస్తున్నారు. కులాంతర ప్రేమ.. వివాహమైతే కూకటివేళ్లతో కుట్రతో ఆదిలోనే అంతం చేస్తున్నారు. జిల్లాలో తాజాగా మలికిపురం మండలం గొల్లపాలెంలో జరిగిన పరువు హత్య కేసు మరోసారి జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్య కులాంతర ప్రేమికుల్లోకే కాదు..వారి వారి తల్లిదండ్రులను కూడా భయం పుట్టించేదిలా ఉంది. గతంలోనూ జిల్లాలో పలు గ్రామాల్లో పరువు హత్యలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అందులో వేళ్ల మీద లెక్కపెట్ట తగ్గవే వాస్తవం వెలుగు చూసి పోలీసు కేసులయ్యాయి. చాలా పరువు హత్యలు గట్టు చప్పుడు కాకుండా తల్లిదండ్రులు కట్టిన రహస్య సమాధుల్లోనే సమసిపోయాయి. 
ఎక్కడెక్కడ.. ఎప్పుడప్పుడు 
జిల్లాలో 2012, 2015 సంవత్సరాల్లో జరిగిన మూడు పరువు హత్యలు కులాంతర ప్రేమలు, పెళ్లిళ్లు ఎంతటి నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయో తెలుస్తుంది. కనిపెంచిన పిల్లలను పెళ్లీడు వచ్చేసరికి వారి భావాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా...వారి ఇష్టాఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా కులం, ధనం వత్యాసంతో పరువు కత్తులతో తెగ నరుకుతున్నారు. పరువు ఉరి కంభంపై దారుణంగా ప్రాణాలు తీసి ఉసురు పోసుకుంటున్నారు. 2012లో మలికిపురం మండలం గూడపల్లిలో కులాంతర యువతీ యువకులు ప్రేమించుకున్నారు. తొలుత అమ్మాయిని హత్య చేశారు. కొద్ది రోజుల తర్వాత ప్రేమికుడిని చంపేశారు. ఈ రెండు హత్యలు పథకం ప్రకారం అమ్మాయి తరపు వారే చేసి పరువు ముసుగులో చేశారు. అప్పట్లో సరైన ఫిర్యాదులు, దర్యాప్తులు లేక ఆ రెండు హత్యలు అనుమానాస్పద కేసులుగానే నమోదయ్యాయి.
తల్లీ కూతుళ్లను హత మార్చారు
అమలాపురం రూరల్‌ మండలం ఎ.వేమవరంలో తమ ఇంటి ఆడపిల్ల  యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో ఓ అన్న తన చెల్లిని, తన తల్లిని ఒకేసారి హత్య చేశాడు. రౌడీల సహకారంతో ఓ రోజు రాత్రి తల్లీ కూతుళ్లను హతమార్చారు. తొలుతు తన చెల్లిని పెళ్లి చేసుకున్న యువకుడి హత్యకు పథకం పన్నారు. అది పారక యువకుడిని తీవ్రంగా మందిలించి బెదిరించారు కూడా. అయినా తన చెల్లి మాట వినకుండా తన భర్తతోనే వెళతానని తెగేసి చెప్పింది. తల్లి కూడా తన కూతురుకు మద్దతు పలికింది. ఇది కొడుకు సహించలేకపోయాడు. దీంతో చెల్లి, తల్లిని ఒకేసారి మట్టు పెట్టేందుకు పథకం పన్ని పరువు కోసం ఇద్దరీ ప్రాణాలు తీశాడు.
ఎవరిది లోపం... ఎవరిది పాపం 
పరువు హత్యలను మూడు ప్రధాన కారణాలు ప్రేరేపిస్తాయి. తన కూతురు వేరే కులం యువకుడిని లేదా తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమించిదన్న అక్కసు మొదటి కారణమైతే...తన కూతురు ఒకే కులం వాడిని ప్రేమించినప్పుడు ఆ కుర్రాడు పేద కుటుంబానికి చెందిన వాడు... లేదా తన కుటుంబస్థాయికి సరిపోని వాడని పరువు హత్యకు పాల్పడడ రెండో కారణం. చివరి కారణం తమ ఇంటి ఆడపిల్ల పెళ్లిపై తల్లిదండ్రులు తమ తాహతుకు తగ్గట్టుగా గొప్ప సంబంధంతో పెళ్లి చేయాలనుకుంటారు.   కూతురు తమ మాటను కాదని తనకు తాను సొంత నిర్ణయంతో పెళ్లి చేసుకుంటుందన్న తప్పుడు ప్రతిష్టకు (పాల్‌ ప్రెస్టేజ్‌) పోయి పరువు హత్యకు పాల్పడుతున్నారు. ఇందులో ఎవరిది లోపం.. ఎవరిది పాపం అంటే కూతురు కులాంతర ప్రేమ, పెళ్లి వైపు అడుగులు వేస్తున్నప్పుడు తల్లిదండ్రులు గమనించరు. విషయం తెలిశాక పరువు అని పాకులాడతారు. ఆడ పిల్లలు కూడా తమ జీవిత భాగస్వామిని ప్రేమతో ఎంచుకునేటప్పుడు ఎక్కువగా ఆకర్షణకే ప్రాధాన్యమిస్తున్నారు. ఆలోచనతో అతడికి ఆస్తులు ఎంత... జీవితంలో స్థిరపడే తెలివి తేటలు ఉన్నాయా...? వంటి అంశాలపై ఆలోచించరు. కేవలం ప్రేమకు పెద్ద పీట వేసి తల్లిదండ్రులను ధిక్కరిస్తారు. ఈ లోపంలో చాలా వరకూ ఆడిపిల్లల పాత్ర ఎక్కువగా ఉంటే...హత్యలు చేసే పాపంలో మాత్రం తల్లిదండ్రులదే పూర్తి పాత్ర ఉంటుంది. 
పరువు హత్యలకు ఏ ఏ చట్టాలు 
వాస్తవానికి పరవు హత్య జరిగినప్పుడు కేవలం పరువు అనే కోణంలో ప్రత్యేక చట్టం, సెక్షన్‌ లేదు. పరువు హత్య జరిగినప్పుడు నిందితులపై ప్రధానంగా హత్య కేసు (సెక్షన్‌–302) నమోదు చేస్తారు. కిడ్నాప్‌ చేసి ఆధారాలు, మృత దేహాన్ని దాచేందుకు ప్రయత్నిస్తే సెక్షన్‌ 363 (కిడ్నాపు), సెక‌్షన్‌ 201 (ఆధారాలు లేకుండా చేయడం) వంటి కేసులు నమోదు చేస్తారు. 
అదృశ్యం కేసుల్లోంచే పరువు హత్యలు 
సాధారణంగా యువతీ యువకులు ప్రేమించుకుని తల్లిదండ్రుల అభ్యంతరాల నుంచి తప్పించుకునేందుకు దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లోనే తల్లిదండ్రుల నుంచి ఆయా పోలీసు స్టేషన్లలో తమ కూతురు లేదా తమ కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదులు చేస్తారు. అవే మిసింగ్‌ కేసులుగా నమోదు అవుతున్నాయి. ఇలా అదృశ్యం ముసుగులోనే పరువు హత్యలకు పథకాలు పన్నుతారు. జిల్లాలో రోజుకు నెలకు 40 నుంచి 60 అదృశ్యం కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కేసులను పోలీసులు అత్యంత పకడ్భందీగా దర్యాప్తు చేసినప్పుడు పరువు హత్యలకు కొంత వరకూ అదుపు చేయవచ్చు. ఇలాంటి కేసులు నమోదైనప్పుడు పోలీసులు ప్రేమికుల రెండు కుటుంబాల స్థితిగతులు, కులాలు, ఆర్థిక అంశాలు పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంది. 
పరువు హత్యలకు ప్రత్యేక చట్టం తేవాలి
పరువు హత్యలు జరిగినప్పుడు హత్య కేసు నమోదు చేయటం కాదు. పరువు హత్యలకు ప్రత్యేక చట్టం తేవాలి. ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రోత్సాహక నగదు బహుమతులు ఇవ్వటం కాదు. అలా కులాంతర వివాహాలు చేసుకుంటే జరుగుతున్న పరువు హత్యలను ప్రత్యేక చట్టం చేసి నియంత్రించాలి. అందుకే తమ ఐద్వా పరువు హత్యలకు ప్రత్యేక చట్టం చేయాలని ఉద్యమాలు చేస్తోంది. ఇటీవల అమలాపురంలో జరిగిన ఐద్వా రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో పరువు హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టానికి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాం.
        –సీహెచ్‌ రమణి, ఐద్వా, జిల్లా కార్యదర్శి
మేజర్ల అభిప్రాయాలకు తల్లిదండ్రులు విలువ ఇవ్వాలి 
మేజర్లు అయిన తమ పిల్లలు ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ కులాంతర వివాహాలు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు విలువ ఇవ్వాలి. పిల్లలు కూడా తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల మనోభావాలకు ఎంతో గౌరవం ఇవ్వాలి. కేవలం ఆకర్షణతో కాకుండా విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి. తమ కూతురు లేదా కొడుకు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకుంటే పెద్దలు, పోలీసులు, కోర్టులు ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పరువు హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలు తప్పవు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రేమల్లో పడుతున్నప్పుడు ఆదిలోనే గమినించి వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించడం మంచిది. కళాశాలల్లో కూడా ఈ విషయాలపై ప్రత్యేక కౌన్సెలింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి.
     – లంక అంకయ్య, డీఎస్పీ , అమలాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement