ఛిల్లర్ పేరుని చిల్లరగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ గారిది. ఈ చమత్కారానికి తెలుగులో ఒక పేరుంది– అభిరుచి దారిద్య్రం. ఛిల్లర్ సమాధానానికి కాకపోతే ఈ కాలమ్‌లో ఆమెకి ప్రవేశం లభించేది కాదు.
‘మీరు జీవితంలో సాధించి నదేమిటి?’ అని కొందరు నన్ను అడుగుతూ ఉంటారు.
‘రచన ద్వారా నా గొంతు పదిమందికి వినిపిం చడం’అంటాను. ఒక జీవితకాలం కృషికి, పడిన శ్రమకి ఇది చాలా గొప్ప బహుమతి. ‘నన్ను కొడితే వెయ్యిమందిని కొట్టినట్టు’ అనేవారు అల్లు రామలింగయ్య. అది ఆయన సంపాదించుకున్న పరపతి. నేను చెప్తే వెయ్యి మంది వింటారు. కొన్ని వందలమంది స్పందిస్తారు. అది అక్షరం ఇచ్చిన శక్తి. మరి మేరీ కోం మాట్లాడితే? సచిన్ తెందూల్కర్ మాట్లాడితే? నరేంద్ర మోదీ మాట్లాడితే? డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే?
మొన్న చైనాలో సాన్యా పట్టణంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీలలో– 118 దేశాలు పాల్గొన్న పోటీలో 17 సంవత్సరాల తర్వాత భారతదేశపు అమ్మాయి మానుషీ ఛిల్లర్ కిరీటాన్ని గెలుచుకుంది. ఇంతకు ముందు ప్రియాంకా చోప్రా, యుక్తా ముఖీ, డయానా హేడెన్, ఐశ్వర్యారాయ్, రీటా ఫారియాలకు ఈ కిరీటం దక్కింది. ఈ అందాల పోటీలకు కొందరు మహిళలే అడ్డం పడుతున్నారు. అంగ సౌష్టవాన్ని బజారున పెట్టి ‘నా గొప్పతనం చూడండి’ అని బోర విరుచుకోవడం భారతీయ సంస్కారం కాదని వీరి వాదన. చాలామట్టుకు వాళ్లు రైటే కాని దీనిలో చిన్న పాఠాంతరం ఉంది.
ఇది కేవలం శరీరాన్ని విరుచుకుని విరగబడే పోటీ మాత్రమే కాదు. ఒక దేశపు సౌందర్యరాశి– ఆ దేశపు సంస్కారానికి ఎంతగా అద్దం పడుతున్నది? అన్నది ఈ పోటీలో మరొక ముఖ్యమైన ఘట్టం.
ఈ సౌందర్యరాశి వర్చస్సులో చాలామందిని జయించాక–మానసిక సౌందర్యానికి కూడా పరీక్ష పెడతారు. ‘ప్రపంచంలోకెల్లా ఏది ఎక్కువ జీతాన్ని పొందగలిగే వృత్తి, ఎందుకు?’ ఇదీ పరీక్షకులు అడిగిన ప్రశ్న. అనుమానం లేదు. లౌకిక జీవనంలో తలమునకలయిన పాశ్చాత్యుల ఆలోచనా సరళికి ఈ ప్రశ్న అద్దం పడుతుంది. దీనికి మానుషీ ఛిల్లర్ సమాధానాన్ని మరో స్థాయికి తీసుకుపోయి నిలిపింది. ‘గొప్ప గౌరవం దక్కాల్సిన వ్యక్తి అమ్మ. అది కేవలం ఉద్యోగం కాదు– ప్రేమా, గౌరవాలతో, ఆత్మీయతతో ఆ స్థానాన్ని గుర్తించాలి’ అంది. ఇది భారతీయ స్త్రీత్వానికి పట్టాభిషేకం. ఛిల్లర్ సౌందర్యానికి పోటీలో కిరీటం పెట్టారు. ఆమె మాతృత్వానికి కిరీటం పెట్టింది. ‘ఈ దేశంలో ప్రతీ వ్యక్తికి నా సమాధానంతో బంధుత్వం ఉంటుంది’ అంది ఛిల్లర్ గర్వంగా. అవునమ్మా అవును. అమ్మ వైభవాన్ని విస్మరించిన మూర్ఖుడు ఇంకా ఈ దేశంలో పుట్టి ఉండడు.
అమ్మని ఆదిశంకరులు స్తుతిస్తూ, ‘త్వదీయం సౌందర్యం తుహిన గిరి కన్యే తులయితుం కవీంద్రా’ అంటూ, ‘అమ్మా! నువ్వు సౌందర్యానికి ఆవలిగట్టువి’ అంటారు.
1987లో ఇలాంటి పోటీలో పాల్గొన్న జెస్సినా న్యూటన్ (పెరూ) ‘మా దేశంలో మహిళల మీద జరుగుతున్న హింసకు ప్రతిఘటనగా ఈ కిరీటాన్ని ఆయుధంగా చేసుకుని నా గొంతు వినిపించాలని నా ఉద్దేశం’ అంది వేదననీ క్రోధాన్నీ ఉదాసీనతనీ సమీకరిస్తూ. అంతే. కిరీటం ఆమె తల మీద వాలింది.
ఏతావాతా, మానుషీ ఛిల్లర్ ‘అందంతో ఆదర్శం’ ప్రాజెక్టుకి కృషి చేస్తూ – హరియాణాలో మెడిసిన్ చదువుకుంటున్న ఈ అమ్మాయి–స్త్రీల రుతుస్రావ సమయంలో ఆరోగ్యం పట్ల అవగాహనను కల్పించడానికి 20 గ్రామాలలో పర్యటించి , 5000 మంది మహిళలకు ఉపకారం చేసింది.
20 ఏళ్ల ఛిల్లర్ చేపట్టని క్రీడ లేదు. సంప్రదాయ నృత్యం నేర్చుకుంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తరిఫీదు పొందింది. పారా గ్లైడింగ్, బంగీ జంప్, స్నార్కలింగ్, స్కూబా డైవింగ్ చేస్తుంది. తండ్రి సైంటిస్ట్. తల్లి న్యూరోకెమిస్ట్.
ప్రపంచమంతా అబ్బురంగా చూసే స్థానంలో నిలిచి ఆమె గొంతుని వినే ‘శక్తి’ని ఛిల్లర్ సంపాదించుకుంది. ఇవీ ఆమె మాటలు, ‘నువ్వు కలలు కనడం మరిచిపోతే జీవించడాన్ని నష్టపోతావు. నీ కలలకి రెక్కలు తొడిగి, నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకుంటే ఈ జీవితం జీవన యోగ్యం అవుతుంది.’
ఇంతవరకూ ఎన్నో దేశాల అందమయిన శరీరాలు ఈ కిరీటాన్ని వరించాయి. మానసికమయిన ఉదాత్తత, మన దేశపు విలువలను ఎత్తి చూపే సంస్కారానికి ఇప్పుడు కిరీటం దక్కింది. ఛిల్లర్ సమాధానానికి కాకపోతే ఈ కాలమ్‌లో ఆమెకి ప్రవేశం లభించేది కాదు.
దీనికి చిన్న గ్రహణం. మన రాజకీయ నాయకులు ఎటువంటి విజయాన్నయినా భ్రష్టు పట్టించగలరు. ఛిల్లర్ విజయాన్ని అభినందించడానికి బదులు కాంగ్రెస్ నాయకులు శశి థరూర్‌గారు ఛిల్లర్ పేరుని రాజకీయ రొంపిలోకి లాగి ‘బీజేపీ నోట్ల రద్దు ఎంత పెద్ద పొరపాటు! మనదేశపు ‘చిల్లర’కు కూడా మిస్ వరల్డ్ కిరీటం దక్కింది’ అని చమత్కరించారు. ఛిల్లర్ పేరుని చిల్లరగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ గారిది. ఈ చమత్కారానికి తెలుగులో ఒక పేరుంది– అభిరుచి దారిద్య్రం.
- గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment