డిచ్‌పల్లి చిట్టితల్లీ... అంటూ చిన్ననాట చేయి పట్టి నడిపించిన చేతులే ఉరి బిగించాయి..! బంగారు తల్లీ.. అంటూ మురిపెంగా గుండెలకు హత్తుకున్న కన్నతండ్రే కాలయముడయ్యాడు. పరువు ముందు ఓడిపోయిన తండ్రి ప్రేమ.. కూతురినే బలితీసుకుంది. దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందన్న కోపంతో పక్కాగా ప్లాన్ చేసి మరీ బిడ్డను చంపేశాడు ఓ తండ్రి! ఇంటికి వెళ్దామని కూతుర్ని తీసుకెళ్లి దారిమధ్యలోనే స్నేహితులతో కలిసి దారుణంగా హతమార్చాడు. ఉరి బిగించి చంపేసి, పెట్రోలు పోసి కాల్చేశాడు. తర్వాత ఏమి తెలియనట్టు ఇంటికి వెళ్లి స్నానం చేశాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు. అతడితోపాటు హత్యలో పాలుపంచుకున్నవారంతా ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాద్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం డిచ్‌పల్లి సర్కిల్ కార్యాలయంలో నిజామాబాద్ ఏసీపీ ఆనంద్‌కుమార్ ఘటన వివరాలను వెల్లడించారు.