హెల్ప్‌ చేసేదా సుధా? | Movie in Samsaram | Sakshi
Sakshi News home page

హెల్ప్‌ చేసేదా సుధా?

Published Sun, May 7 2017 11:53 PM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

హెల్ప్‌ చేసేదా సుధా?

హెల్ప్‌ చేసేదా సుధా?

సంసారంలో సినిమా

సుధ ఒక భార్య. మధు ఒక భర్త. సుధ కూకట్‌పల్లిలో ఉంటున్న ఎవరికో భార్య కాదు. మధు లింగంపల్లిలో ఉంటున్న వేరెవరికో భర్త కాదు. సుధదీ మధుదీ ఒకే ఏరియా. చిక్కడపల్లి. ఇద్దరూ ఉండేది ఒకే ఇంట్లో. అండర్‌లైన్‌ ఏంటంటే.. ఇద్దరూ ఒకరికొకరు భార్యాభర్తలు.
అయితే ఈ క్షణంలో వాళ్లు కేవలం భార్యాభర్తల్లా లేరు! భర్త గురించి బాగా తెలిసిన భార్యలా.. కోపంగా ఉంది సుధ. భార్య గురించి ఏమీ తెలియని భర్తలా అమాయకంగా పడి ఉన్నాడు మధు.

భార్యాభర్తల్లో ఒకరికి బాగా తెలిసి, ఇంకొకరికి ఏమీ తెలియక పోవడం పెళ్లయిన కొత్తల్లో మాత్రమే ఉంటుంది. అన్నీ తెలిసినవాళ్లు ఏమీ తెలియనట్లుగా, ఏమీ తెలియనివాళ్లు అన్నీ తెలిసినట్లుగా.. కాళ్ల పారాణి ఆరే దాకా మాత్రమే ఉంటారు కాబట్టి కొత్తల్లో అలానే ఉంటుంది. మధ్యలో కొన్నేళ్లు ఒకరి గురించి ఒకరికి తెలిసిపోయి.. ‘తెలిసిపోయింది కదా’ అని తెలుసుకోడానికి ప్రయత్నించరు. ఆ తర్వాత కొత్త కొత్త విషయాలు భార్య దృష్టికి వస్తాయి. పాపం.. ఆమె దృష్టి మంచిదే! భర్తే వెళ్లి ఆమె కంట్లో పడతాడు. ఎలా పడకూడదో అలా పడతాడు. తెలిసి పడినా, తెలియక పడినా.. పడడం అతడి కర్మ.
∙    ∙     
‘‘చేతకాని పనులు ఎందుకు చేస్తారో మీరు!’’ అంటోంది సుధ. ‘‘ఏమైంది సుధా?’’ అంటున్నాడు మధు. ‘‘మిమ్మల్ని నేనేమైనా హెల్స్‌ చెయ్యమన్నానా?’’   ‘‘అరె! ఏమైంది సుధా.. చెప్పు?’’   ‘‘మీరు తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో అర్థం కాదు’’ ‘‘ఏమైందో తెలిస్తేనే కదా.. తెలిసి చేశానో, తెలియక చేశానో నాకైనా తెలిసేది!’’ ‘‘మీ మనసుకు తెలీదా?’’ ‘‘అలా తినేయకు.. ఏం చేశానో నాకేం తెలుసు. ఒక వేళ చేశానే అనుకో. తెలిసే చేసుంటానని నువ్వెందుకనుకుంటావ్‌? నీకు నచ్చనిది నేనెప్పుడైనా చేశానా’’ అన్నాడు మధు. ‘‘నాకేం డౌటు లేదు? మీరు తెలిసే చేసి ఉంటారు’’ అంటోంది సుధ. జనరల్‌గా భార్యలంతా పద్ధతిగా, తెలివిగా ఉంటారనే విషయాన్ని పక్కన పెడితే.. సుధ పద్ధతైన, తెలివైన భార్య. డౌట్‌ పడకపోవడం ఆమె తెలివిలోని ఒక భాగం. సుధ డౌట్‌కి చోటివ్వదు. ‘నో డౌట్‌’కి మాత్రమే చోటిస్తుంది. తను అనుకున్నదే నిజం అని తన నమ్మకం. అయినా నిజం కాకపోతే తనెందుకు నమ్ముతుంది అని కూడా అనుకుంటుంది. సుధ ఎప్పుడూ కరెక్ట్‌. ఆ సంగతి మధుకీ తెలుసు.

సుధ.. ఇంటిని పద్ధతిగా ఉంచుతుంది. పిల్లల్ని పద్ధతిగా పెంచుతుంది. భర్తలో ఎవ్రీడే పద్ధతుల్ని పెంచి పోషిస్తుంటుంది. మధు అలాక్కాదు. కొన్నిసార్లే పద్ధతిగా ఉంటాడు. కొన్నిసార్లు ‘అబ్బే మనకు పద్ధతి వర్కవుట్‌ కాదు’’ అనుకుంటాడో ఏమో... ‘‘ఇన్ని పద్ధతుల మధ్య నేను హాయిగా ఉండలేను సుధా’’ అని పద్ధతుల్ని ఎక్కడివక్కడే... టవల్‌ని వదిలేసి వెళ్లినట్టుగా వెళ్లిపోతాడు. అయితే ఈ టైప్‌ ఆఫ్‌ ‘పద్ధతి లేకపోవడం’ సుధకు కోపం తెప్పించేటంతటిది కాదు. భర్త అనేవాడు ఒంటి మీద స్పృహ లేకుండా అభయారణ్యంలో మృగజీవిలా (సమ్‌టైమ్స్‌ మూగజీవిలా) ఇంట్లో సంచరిస్తూ ఉండడం ప్రతి ఇంట్లోనూ ఉండేది. ఆ విషయం ఆమెకు తెలుసు. కానీ అతడిప్పుడు.. మధు అనబడే ఆ భర్త ఇప్పుడు.. తెలిసో, తెలీకో ‘కట్టుబాటు’ లోని పద్ధతిని తప్పాడు! దాన్ని పట్టుకుంది సుధ. తను ఎక్కడ, ఎలా కట్టు తప్పాడో అతడికి తెలిసే అవకాశం లేదు. ‘‘నువ్వు కట్టు తప్పావు’’ అని సుధ నేరుగా చెప్పడం లేదు. అసలు అది కట్టుబాటు విషయమా? కట్టుబట్టల విషయమా అనే సంగతీ అతడికి తెలిసే చాన్స్‌ లేనే లేదు. ఇప్పటికైనా.. తనేం చేశానా అని ఊహిస్తున్నాడు తప్ప, తనేం తప్పు చేశానా అని అతడు ఊహించడం లేదు.
∙    ∙     
‘‘ఊహించని వర్షం కదా!’’ అన్నాడు మధు. ‘‘అవును.. మీ బుద్ధిని కూడా ఊహించలేకపోయాను’’ అంది సుధ. మధు బిత్తరపోయాడు. కాసేపు ఆఫ్‌లైన్‌ అయ్యాడు. ఆ వెంటనే ఆన్‌లైన్‌ లోకి వచ్చాడు. భార్య మూడ్‌ మార్చేందుకు మళ్లీ ఏదైనా ఒక హెల్ప్‌ చెయ్యాలనుకున్నాడు మధు. కొన్ని నిమిషాల ముందే ఆమెకు అతడు ఒక హెల్ప్‌ చేసి ఉన్నాడు. అలా హెల్ప్‌ చేసే సందర్భం కూడా మధుకు అనుకోకుండా, ఒక మహద్భాగ్యంలా దక్కింది. అంతకుముందే అతడు ఆఫీస్‌ నుంచి వచ్చాడు. ఎప్పటిలా టైమ్‌కి కాకుండా, టైమ్‌కన్నా ముందే త్వరగా వచ్చేశాడు. ఇంట్లో చేసే పనిలేదు. బయటికి వెళ్లవలసిన పనీ లేదు. పిల్లలు ఇంకా స్కూల్‌ నుంచి రాలేదు. సుధ వంటింట్లో ఉంది. పిల్లలు వచ్చేలోపు వాళ్లకు ఏదైనా చేసి పెట్టాలని ఆమె తొందర.

ఈ పెద్దమనిషి కూడా వచ్చేశాడు కాబట్టి ఈయనకూ వేరుగా ఏదో చేసే ప్లాన్‌తో కూడా ఉంది. అప్పుడు అడిగాడు మధు.. ‘‘ఏదైనా హెల్ప్‌ చేసేదా సుధా?’’ అని.. వంటగదిలోకి వెళ్తూ. ‘‘వద్దొద్దు. మీరు వెళ్లి హాయిగా టీవీ చూడండి’’ అంది సుధ. గతంలో మధు ఆమెకు చాలాసార్లు ఇంటి పనిలో హెల్ప్‌ చేశాడు. ఆ తర్వాత ఆమె తనకు తాను చాలాసేపు హెల్ప్‌ చేసుకోవలసి వచ్చింది! ‘‘కాదు.. ఇంత కష్టపడుతున్నావు కదా.. చెప్పు.. సరదాగా ఈ ఉల్లిపాయలు తరిగిపెట్టేదా?’’అన్నాడు మధు. ‘‘ఇదేమంత కష్టం కాదు కానీ.. మీకు నేను వేడివేడిగా ఏవైనా ప్లేట్‌లో వేసి అందించాలంటే.. మీరు నాకు హెల్ప్‌ చెయ్యకుండా ఉండాలి’’ అంది నవ్వుతూ. మధు హర్ట్‌ అయ్యాడు. సుధ జాలి పడింది. ‘‘పోనీ, ఈ మూత తీసివ్వండి’’ అని ఉప్పుడబ్బా చేతికిచ్చింది. మధు ఉప్పుడబ్బా అందుకున్నాడు. డబ్బాలో ఉప్పుంది. డబ్బాపై మూత లేదు!‘‘మూత ఏది సుధా’’ అన్నాడు.

‘‘అయ్యో.. ఉందనుకుని ఇచ్చానండీ’’ అంది. మళ్లీ హర్ట్‌ లాంటిదే ఏదో అయ్యాడు మధు. చాలాకాలం తర్వాత ఆఫీస్‌ నుంచి ఇంటికి త్వరగా వచ్చాడు అతను. చాలాకాలం తర్వాత అంటే.. ఓ ఐదారు ఇంక్రిమెంట్‌లు, రెండుమూడు ప్రమోషన్‌ల తర్వాత! రోజూ అతడు వచ్చేటప్పటికి సుధ ఇంటిని పద్ధతిగా సర్ది ఉంచుతుంది. అతడికి అన్నీ అమర్చి ఉంచుతుంది. ఇంట్లో అతడికి అలవాటైన దారిని అలవాటైన దారిగానే ఉంచుతుంది. ఇలా చేస్తే భర్త దారి తప్పడని ఆమెకు పెళ్లయిన కొత్తలోనే సీనియర్‌ సుధ ఎవరో చెప్పారు. ఆఫీసునుంచి వచ్చిన భర్త గేటు తలుపు ఎలా తడతాడో, ఎన్నిసార్లు తడతాడో, తట్టినా తియ్యకపోతే ఎలా లోపలికి చెయ్యిపెట్టి తనే తీసుకుంటాడో, లోపలికి వచ్చాక చెప్పులు ఏమూల వదిలేస్తాడో, ఉన్న రెండు ట్యాపుల్లో ఏ ట్యాపు కింద కాళ్లు కడుగుతాడో, కడిగిన కాళ్లను డోర్‌ మ్యాట్‌ మీద ఎన్నిసార్లు రుద్దుతాడో, తర్వాత నేరుగా ఏ గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటాడో, మార్చుకున్న బట్టల్ని ఏ హ్యాంగర్‌కి తగిలిస్తాడో, తర్వాత ఎంత సేపటికి స్నానానికి కదులుతాడో, స్నానం అయ్యాక భోజనానికి ఎలా ఆవురావురుమంటాడో, భోజనం అయ్యాక అటొక అడుగు, ఇటొక అడుగు ఎలా వేస్తాడో, వేశాక ఏ మంచంపై వాలిపోతాడో, మంచంపై ఏవైపు తలగడలు ఉంచుకుంటాడో.. ఇవన్నీ మధుకు అలవాటైనట్లే, సుధకూ అలవాటై పోయాయి.

ఈ అలవాట్ల ప్రకారమే సుధ ఇంటిని ఎప్పుడూ ఒకే లా భర్తకు అందుబాటులో ఉంచుతుంది. కానీ ఆ ఒక్కరోజు మధు త్వరగా ఇంటికి వచ్చినందుకు.. రోజువారీ అలవాట్లన్నీ తప్పిపోయాయి. సుధ ఇంటినింకా మధు కోసం రెడీ చెయ్యలేదు. దాంతో మధు తనింట్లో తనే దారి తప్పాడు.  తడుముకుంటూ నడుస్తున్నాడు. తడబడుతూ నడుస్తున్నాడు. భర్త దారి తప్పడం సుధ చూస్తూనే ఉంది.. అదేమంత విషయం కాదనుకుంది. ఇల్లు సర్దితే అదే సర్దుకుంటుంది అనుకుంది. కానీ అతడు ఇంకో వైపు నుంచి దారి తప్పుతాడని ఆమె ఊహించలేదు! నిజానికి మధు దారి తప్పలేదు. తప్పాడని, లేదా తప్పి ఉంటాడని సుధ అనుకుంది.  
∙    ∙     
‘‘చినుకులు పడుతున్నాయ్‌ సుధా’’ అన్నాడు మధు.. గడపలోంచి తల పైకెత్తి చూస్తూ. ఆవకాయ పెట్టే కాలంలో..ఆకాశంలో మబ్బులు! ‘‘వర్షమా!!..’’ అంది సుధ. మధు పసిగట్టేశాడు! ‘‘మేడ మీద వడియాలు ఎండబెట్టావు కదూ?’’ అన్నాడు. ‘‘కాదండీ... బట్టలు ఆరబెట్టాను’’ అంది సుధ. తను ఎప్పటికీ, ఏదీ పసిగట్టలేనని మధుకు అర్థమయింది. ‘‘అయ్యో!నా బట్టలు కూడా ఉన్నాయా పైన’’ అన్నాడు మధు. మర్నాడు అతడికి ఆఫీసులో మీటింగ్‌ ఉంది. ఆ మీటింగ్‌కి వేసుకెళ్లాల్సిన చొక్కా, ప్యాంటు మేడ మీద ఉన్నట్లు అతడికి అనిపించింది. మేడ పైకి పరుగు తీయబోయాడు’’. ‘‘లేవు.. లేవు.. పిల్లలవీ, నావీ ఉన్నాయి. మీరు వెళ్లకండి. నేను తెచ్చేస్తాను. మీవి మాణింగే ఇస్త్రీ చేయించి ఉంచాను’’ అని వంటింట్లోంచే అరిచి చెప్పింది సుధ. ‘‘పర్లేదు.. నేను తెస్తాను’’ అని బడబడా మెట్లెక్కి మేడపైకి వెళ్లిపోయాడు మధు.

‘‘మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త’’ అని మళ్లీ అరిచి చెప్పింది సుధ. చినుకులు పెద్దవయ్యాయి. ఇవి ఇంకా పెద్దవి కాకముందే.. మేడపైన దండెం మీద ఉన్న సుధ బట్టల్నీ, పిల్లల బట్టల్నీ  క్లిప్పులు తప్పించి.. కుప్పగా కిందికి మోసుకొచ్చాడు మధు. ఆ కుప్పనంతా మంచం మీద పడేశాడు. తడవకుండా తెచ్చినందుకు తనకే తెలియని ఒక çసంతోషంతో ఉన్నాడు మధు. అక్కడేదో చిన్న అచీవ్‌మెంట్‌ జరిగినట్లుగా ఉంది అతడికి. ‘‘అయ్యో! నేను తెచ్చేదాన్ని కదండీ. పిల్లల బట్టలంటే పర్వాలేదు, నా బట్టల్నీ మీరు మోసుకొస్తే చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారు?’’ అని నొచ్చుకుంది సుధ. పిల్లలు వచ్చే టైమ్‌ అయింది, వంటా పూర్తయింది. సింక్‌ క్లీన్‌ చేసి చేతులు కడుక్కుంటోంది సుధ. మధు హాల్లో ఉన్నాడు. ఒక పెద్ద పని చేశాక, దొరికిన తీరికను అనుభవిస్తున్నవాడిలా ఉన్నాడు. కాసేపు అటూఇటూ తిరిగాడు. భార్యకు ఇంకా ఏదైనా హెల్స్‌ చేయాలనిపించింది. మంచం మీద తను వేసిన బట్టల కుప్పల్లోంచి ఒక్కోటీ తీసి మడతపెట్టే పనిలో పనిలో పడ్డాడు. రెండు బట్టలు మడతపెట్టాక  లైట్‌ పింక్‌ కలర్‌ లంగా చేతికి వచ్చింది.

దాన్ని శ్రద్ధగా మడత పెడుతున్నాడు. అటునుంచి ఒక ఫోల్డ్, ఇటునుంచి ఒక ఫోల్డ్‌ వేశాడు. మధ్యకు ఇంకో ఫోల్డ్‌ వేయబోతూ, చిన్నచిన్న మడతల్ని వేళ్లతో సవరిస్తున్నాడు. భర్త వైపు నుంచి సౌండ్‌ లేకపోవడం కిచెన్‌ నుంచి నేరుగా భర్త ఉన్న దగ్గరికి వచ్చి చూసింది సుధ. అయితే ఆమెకు భర్త కనిపించలేదు. భర్త చేతిలో ఉన్న లైట్‌ పింక్‌ కలర్‌ లంగా కనిపించింది! ఒక్కసారిగా పెద్దగా అరిచేసింది సుధ. ‘‘ఎందుకు మీకీ పనులు’’ అంటూ అతడి చేతుల్లోంచి లంగా లాగేసుకుని అతణ్ణి దూరంగా నెట్టేసింది. మధు బిక్కమొహం వేశాడు. ‘‘ఏమైంది సుధా’’ అన్నాడు. సుధ చెప్పలేదు. ‘‘ఇంకెప్పుడూ మీరు మేడ పైకి వెళ్లి బట్టలు తేకండి’’ అని మాత్రం అంది. మధు అయోమయంగా ముఖం పెట్టాడు.
∙    ∙     
ఆ అయోమయంలో చాలాసేపు అర్థాలు వెతుక్కుంది సుధ. ఎంత వెతుక్కున్నా అందులో అమాయకత్వం తప్ప ఏమీ కనిపించడం లేదు. అనవసరంగా డౌట్‌ పడ్డాను అనుకుంది. ‘‘నో డౌట్‌.. హి ఈజ్‌ గోల్డ్‌’ అని కూడా అనుకుంది. రాత్రి ఎనిమిదింటికి ఆఫీస్‌ నుంచి వచ్చిన పక్క పోర్షన్‌ అమ్మాయి శ్రావణికి ఆ లైట్‌ పింక్‌ కలర్‌ లంగా ఇచ్చి చెప్పింది సుధ.. ‘‘వర్షం పడుతుంటే నేనే దండెం మీద నుంచి కిందికి తెచ్చా... మా బట్టలతో పాటు’’ అని. థ్యాంక్స్‌ చెప్పింది శ్రావణి. రెండు పోర్షన్‌లకీ ఒకటే మేడ. తిరిగి తమ పోర్షన్‌లోకి వచ్చేసింది సుధ.
మధు భోజనం చేస్తూ, టీవీ చూస్తున్నాడు.. అమాయకంగా. ఆ అమాయకత్వాన్ని అలానే ఉంచేయదలచుకుంది సుధ. రోజూ భర్త వచ్చేటప్పటికి సుధ ఇంటిని పద్ధతిగా సర్ది ఉంచుతుంది. అతడికి అన్నీ అమర్చి ఉంచుతుంది. ఇంట్లో అతడికి అలవాటైన దారిని అలవాటైన దారిగానే ఉంచుతుంది. ఇలా చేస్తే భర్త దారి తప్పడని ఆమెకు పెళ్లయిన కొత్తలోనే సీనియర్‌ సుధ ఎవరో చెప్పారు.

సినిమాలో సంసారం
ఏదో లేంది... డౌటు ఎందుకొస్తుంది?

చిత్రం : మావిచిగురు
దర్శకత్వం : ఎస్వీ కృష్ణారెడ్డి
దంపతులు : ఆమని, జగపతిబాబు

ఆమని ఊరి నుంచి ఆటోలో వస్తుంటుంది. ఆటోలోంచి చూసి, ‘మమ్మీ... డాడీ...!’ అంటాడు కొడుకు. ‘ఎక్కడ్రా?’ అంటుంది ఆమని. వేలు చూపిస్తాడు కొడుకు. ‘ఆటో ఆపు’ అంటుంది ఆటో డ్రైవర్‌తో ఆమని. ఆటో ఆగుతుంది.ఓపెన్‌ ఎయిర్‌ రెస్టారెంట్‌లో జగపతిబాబు, వాళ్ల ఆఫీస్‌ అమ్మాయి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మూన్‌లైట్‌ డిన్నర్‌ చేస్తుంటారు. ఆ దృశ్యాన్ని చూసి ఆమని ఉడికిపోతుంది. ఆటోని ‘పోనియ్‌’మంటుంది.తల్లీబిడ్డ ఇంటికి చేరతారు. జగపతిబాబు కోసం కోపంగా బాల్కనీలో ఎదురుచూస్తుంటుంది ఆమని. జగపతి బాబు వస్తాడు. ‘ఏయ్‌ సీతా... ఎప్పుడొచ్చావ్‌? బాగున్నావా?’ అంటాడు స్కూటర్‌ ఆపుతూ. ‘తాతగారికి ఎలా ఉంది?’అని అడుగుతాడు స్కూటర్‌ స్టాండ్‌ వేస్తూ.బక్కెట్‌లో నీళ్లు ఎత్తి జగపతిబాబు తలమీద కుమ్మరిస్తుంది ఆమని.

‘‘ఏయ్‌... ఏంటిదీ... మతీగితీ పోయిందా నీకు’’ అని బాల్కనీలోకి ఎక్కేస్తాడు.‘‘మీరు చేసిన పనులకి మతిపోవడం ఏం కర్మ! పిచ్చెక్కుతోంది’’ అంటుంది ఆమని.ఇక అక్కడి నుంచి ఈ సంభాషణ :‘‘అయినా ఇక్కడికెందుకొచ్చారూ... దానింటికే వెళ్లకపోయారా?’’‘‘దేనింటికీ!!’’‘ఆహహహా.. ఏమి తెలియనట్టుగా దేనింటికీ అని ఎంత గడుసుగా అడుగుతున్నారో! గుటుకూ గుటుకూమంటూ ఐస్‌క్రీమ్‌లు మెక్కుతున్నారుగా... దానింటికి...’’ ‘‘ఓహో... అందుకా నీ అలక! పిచ్చీ మా ఆఫీస్‌ స్టాఫ్‌ అందరికీ మా ఎండీగారు పార్టీ ఇచ్చారు. స్టాఫ్‌ మొత్తం ఉన్నారు.’’‘‘పిచ్చిమొహందీ... ఏం చెప్పినా నమ్మేస్తుందనేగా?’’‘‘నీకంతగా అనుమానంగా ఉంటే... రేపు మా ఆఫీస్‌కొచ్చి మా ఎండీగారినే అడుగూ’’.‘‘ఎందుకూ... ఆఫీస్‌కొచ్చి పరువు తీస్తావా అని ఈ చెంపా ఆ చెంపా చెళ్లున వాయించడానికా?’’‘‘అబ్బా... లోపలికి పద నువ్వు’’‘‘మీరేం లోపలికి రానక్కర్లేదు.

ఈ అరుగు మీదే పడుకోండి’’.‘‘పొద్దున్నే ఆవిడ గారు ఒకచేత్తో ఇడ్డెన్ల పొట్లాం, ఒకచేత్తో కాఫీ ఫ్లాస్కు పట్టుకునీ వయ్యారంగా తిప్పుకుంటూ వచ్చి కొసరి కొసరి తినిపిస్తుంది. ఆ ఇడ్డెన్లు తినేసి, ఆ కాఫీ తాగేసి ఇద్దరూ కలిసి మొగుడూపెళ్లాల్లాగా ఒకే ఆటోలో ఆఫీస్‌కి వెళ్లండి’’.(ఇక్కడ పెద్దగా నవ్వుతాడు జగపతిబాబు).అసలు విషయం చెబుతాడు.ఆమని కన్నీళ్లు పెట్టుకుంటుంది.‘‘అయ్యయ్యో! అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా కస్సుబుస్సులాడాను. నా గడుసుతనమంతా ఏమై పోయిందో. పాపిష్టిదాన్ని. జ్వరం పడి లేచిన మనిషి మీద నీళ్లు పోశాను. ముందు మీరు లోపలికి రండి... రండి’’ అని భర్తలో పాటు లోపలికి వెళ్తుంది ఆమని.తెలుసుకొనర మగడా!
(భార్య... భర్తను అనుమానించిందీ అంటే కారణం ఉంటుంది. భయం ఉంటుంది. ఈ రెండింటినీ మించి భర్తపై ప్రేమ ఉంటుంది).
తెలుసు  కొనర మగడా!
భార్య... భర్తను అనుమానించిందీ అంటే కారణం ఉంటుంది. భయం ఉంటుంది. ఈ రెండింటినీ మించి భర్తపై ప్రేమ ఉంటుంది. 

∙భావిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement