ఆఫీస్‌లో ఉండగా ఫోనొచ్చింది. ఓలా యాప్ సరిగ్గా పని చేయడం లేదట క్యాబ్ బుక్ చేయమని చెప్పింది. ‘ఎక్కడికి?’ అడిగాను.,‘లాయర్ దగ్గరికి’ అంది. గతుక్కుమన్నాను. బుర్ర ఇంకా రాని బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా పరిగెత్తింది.పొద్దున దోసెలు పోస్తానంటే వద్దని పాలలో అటుకులు చక్కెర కలిపి తిన్నాను. అందుకా? రాత్రి కంప్యూటర్ ముందు పని చేస్కుంటూచేస్కుంటూ తన ధ్యాస మరిచి అక్కడే కింద కార్పెట్ మీద దిండేసుకుని పడుకున్నాను.
అందుకా? ‘రాజు గారి గది 2’ ఫస్ట్ షో తీసుకువెళ్తానని చెప్పి డుమ్మా కొట్టాను.అందుకా? మొన్న వాళ్లమ్మ ఫోన్ చేసినప్పుడు ‘మాట్లాడండి’ అని ఇస్తే తీసుకొని ‘నమస్తే అత్తగారూ’ అని ఆమెకు షుగరున్నా తియ్యగా మాట్లాడుకుండా ఏవో నాలుగు మాటలు పొడిపొడిగా మాట్లాడి ఇచ్చేసినందుకా? ఎందుకు? లాయర్ దగ్గరకు వెళ్లడం ఎందుకు? విడాకుల్స్ కేనా? ‘లల.. లాయర్ అంటున్నావ్. ఎందుకు?’ ‘తర్వాత చెప్తా. ముందు నల్లకుంటలో ఈశ్వరరావు లాయర్ దగ్గరకు క్యాబ్ బుక్ చేయండి’ అంది. గుండె గుడగుడమని కొట్టుకుంది.
ఈశ్వరరావు ఎలాంటి లాయర్ అంటే మోడీ గారు బ్యాచిలర్ మొర్రో అంటున్నా వినకుండా మీకెందుకు బాసూ ఫీజిస్తే చిటికెలో ఏర్పాటు చేస్తాగా అని విడాకులకు రెడీ చేసే రకం. ‘ఇఇ..ఈశ్వరరావు ఎందుకు?’ ‘కోర్టులో కేసు వేయడానికి’ ‘ఎవరి మీద’ ‘మగాళ్లందరి మీద’ ‘మగాళ్లందరి మీదా?’ ‘అవును. పబ్లిక్ లిటిగేషన్ కేసు’ ‘ఏం పాపం చేశారు’ ‘మీరు చేస్తున్నదే’ ‘నేనేం చేశాను’ ‘జోకులేస్తున్నారు’ ‘జోకులేయడం తప్పా?’ ‘భార్యల మీద జోకులేయడం తప్పేు’ గొంతు సీరియస్‌గా ఉంది.
‘ఏం భార్యల మీద జోకులేయకూడదా?’ ‘లు అంటున్నారు. మీకు ఇంకో భార్య ఉందా?’ ‘సారీ... ఏం భార్య మీద జోకు వేయకూడదా?’ ‘ఏం... మీ అమ్మ మీద వేయొచ్చుగా?’ ‘ఏమన్నావ్?’ ‘ఏం.. పొడుచుకొచ్చిందా?’ మాట్లాడకుండా ఉన్నాను. రోషంగా మాట్లాడుతూ ఉంది. ‘ఈ దరిద్రపు ఫోన్ కొన్నాక నాకు మెల్ల మెల్లగా ఆడవాళ్ల పరిస్థితి అర్థమవుతోంది. అక్కర ఉన్నా లేకున్నా ఈ వాట్సప్ పుణ్యమా అంటూ రకరకాల గ్రూపుల్లో పడ్డాను. ప్రతి గ్రూపులో ఒకటే జోకులు. ఏం జోకులు? భార్యల మీద జోకులు. ‘గురువు దగ్గర వినయంగా ఉండాలి. స్నేహితుల దగ్గర ఉల్లాసంగా ఉండాలి.
భార్య దగ్గర నోర్మూసుకొని ఉండాలి’. అదొక జోకు. ‘వైఫ్ ఈజ్ క్యూట్ వెన్ షీ ఈజ్ మ్యూట్’ అదొక జోకు. చావు బతుకుల్లో ఉన్న భర్త భార్యను పిలిచి అంటాడు– నేను పోయాక నువ్వా సుబ్బారావుగాణ్ణే కట్టుకో. ‘అదేమిటండీ. అతను మీ శతృవు కదా’ అని భార్య, ‘అందుకే అంటున్నాను. వాడికి తగిన శాస్తి జరిగాలి’ అని భర్త. ఇదొక జోకు’. ‘ఏదో సర్దాకు టైమ్ పాస్ జోకుల్లేవోయ్’ ‘టైమ్‌పాసా? దానికి భార్యలే దొరికారా? ఏం... తల్లీ చెల్లీ పనికి రారా. తల్లి పుణ్యాత్మురాలు. జన్మనిచ్చినది. ఆమె మీద జోకులు వేయరు. చెల్లి గారాల పట్టి. అందుకని జోకులు వేయరు. అక్క అభిమానంగా చూస్తుంది. అందుకని జోకులు వేయరు.
మరి భార్యేగా దిక్కులేనిది దుర్మార్గమైనది. ఆమె మీద జోకులు. ఎందుకొస్తాయండీ మీకు’ ‘అదీ... అదీ’... ‘మిమ్మల్ని నమ్ముకొని పుట్టింటిని కాదని వస్తుంది. మళ్లీ పోదు. మీ దగ్గరే ఉంటుంది. మీకు వడ్డిస్తుంది. వార్చి పెడుతుంది. ప్రేమగా ఉంటుంది. సంతానాన్ని కని పెడుతుంది. మగాడికి కావాల్సిన చెల్లెలిని అక్కను భార్యను కని పెడుతుంది. అసలా మగాడికే ఉనికి ఇస్తుంది. మీ కష్టం ఆమె కూడా పడుతుంది. తన సుఖం మీకు కూడా పంచుతుంది. ఆమె మీద జోకులేమిటండీ. ఈ జోకుల ముసుగులో మీరు భార్యల మీద ఫన్ పంచట్లేదు. ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. భార్యంటేనే ద్వేషించదగ్గ మనిషిగా చిత్రీకరిస్తున్నారు’ అంత సీరియస్‌గా మాట్లాడటం ఎప్పుడూ చూళ్లేదు.
‘నువ్వు మరీ సీరియస్‌గా తీసుకుంటున్నావోయ్’ ‘కాదు. ఇంతకాలం సీరియస్‌గా తీసుకోక పోవడం తప్పంటాను. అందుకే కోర్టులో కేసు వేద్దామనుకుంటున్నాను’ ‘వేసి...’ ‘ఒకప్పుడు కులాల మీద జోకులు ఉండేవి. కాలక్రమంలో సంస్కారం తెచ్చుకొని వాటిని మానేశాం. శారీరక లోపాల మీద జోకులుండేవి. వాటి మీద కూడా తగ్గించేశాం. మతాల మీద జోకులు సహించాల్సిన పని లేదు. అలాగే భార్యల మీద జోకులను కూడా బ్యాన్ చేయమని కోరుతాను. బ్యాన్ చేసేంత వరకూ పోరాడతాను’ ‘దారుణం. బొత్తిగా సెన్సాఫ్ హ్యూమర్ లేకుండా తయారవుతున్నారంతా’‘సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలండీ. సరదాగా నవ్వుకోవాలి.
భార్యలు కూడా ఎంజాయ్ చేసే జోకులు వారి మీద వేయాలి. అంతేతప్ప వారిపై నెగిటివిటీ పెంచే జోకులు వేయొద్దు. అరె... వాళ్లను కట్టడి చేసేది మీరు. స్వేచ్ఛ ఇవ్వకుండా నిర్బంధించేది మీరు. వేధించేది మీరు. బాధ పెట్టేది మీరు. మళ్లీ వాళ్లనే బ్యాడ్‌గా చూపిస్తూ జోకులేస్తారా?. ఇలా ఎంతకాలం?’... గుర్తొచ్చింది. పొద్దున టీ ఇచ్చింది. ‘ఇవి టీయా? టీ నీళ్లు. ఇంకొన్ని పట్టుకొచ్చావంటే గీజర్ అవసరం లేకుండా స్నానం చేసేస్తాను’ అన్నాను.
పిల్లలను స్కూలుకు తయారు చేస్తూ హడావిడిగా పెట్టింది అన్న ఆలోచన కూడా లేకుండా పిచ్చి జోక్ వేసి హర్ట్ చేసినట్టున్నాను. ‘సారీ’ ‘మీరొక్కరే చెప్తే సరి పోదు’ ‘మరి’ ‘సమస్త మగజాతి చెప్పాలి’ ‘ఓరి దేవుడోయ్’ ‘ఆ మాటే మీ అందరి చేతా చెప్పిస్తాను. పెళ్లాం మీద జోక్ వేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే చట్టం తెచ్చేంత వరకూ విశ్రమించను’ ‘అది కాదోయ్’... ఆటో పిలుస్తున్న కేక వినిపించింది. ‘ఆగాగు.. క్యాబ్ బుక్ చేస్తాను’ ‘టైమ్ లేదు. ఇక ఏ విషయమైనా లాయర్‌ని కలిశాకే’ ఆటో డుర్రున కదిలింది.నాకు మాత్రం ఆ సౌండ్ ఆటంబాంబంత అనిపించింది.
సినిమాలో సంసారం
ఫారిన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్!
ప్రశాంత్ (పృ«థ్వి) సింగర్. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ మార్కెట్‌లో నంబర్‌వన్. ప్రశాంత్‌కి పిచ్చి ఫ్యాన్ నిర్మల (రాశి). ఓ ఆల్బమ్ బాలేదని ప్రశాంత్‌ని ముఖం మీదే విమర్శిస్తుంది. ఆ విమర్శ నచ్చి. నిర్మలను పెళ్లి చేసుకుంటాడు ప్రశాంత్. మ్యూజిక్ ఆల్బమ్‌లో కో సింగర్‌గా పాడమని భార్యని కోరతాడు. మొగుడు–పెళ్లాం ఒకే వృత్తిలో ఉండకూడదు. పాడనంటుందామె. ప్రశాంత్ మార్కెట్ డౌన్ అయిందనే విమర్శలొచ్చినప్పుడు ‘నేను పాడతాను ఆల్బమ్ చేద్దా’మంటుంది నిర్మల.
ఒక్క ఆల్బమ్‌తో భర్త కంటే ఎక్కువ క్రేజ్ వస్తుంది భార్యకి. అది ఇబ్బందిగా ఫీలవుతాడు ప్రశాంత్. పుండుమీద కారం చల్లినట్టు.. నిర్మలకు ఫారిన్‌లో ఆల్బమ్స్ చేసే అవకాశం వస్తుంది. ప్రశాంత్ లేకుండా నిర్మల వెళ్లడానికి అతడు ఒప్పుకోడు. ‘ఫారిన్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్. నవ్వు వెళ్లడానికి వీల్లే్లదు’ అని కోప్పడతాడు ప్రశాంత్. ముష్టితో వచ్చే పేరు నాకు అక్కర లేదు, కంపెనీని మూసేస్తానంటాడు. నిర్మల ఫారిన్ వీసా, టికెట్లు చించేస్తాడు. ఇలా తరచూ గొడవ పడి, పడి చివరకు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు భార్యాభర్తలిద్దరూ ‘దేవుళ్ళు’ సినిమాలో.
– నిష్ఠల
Comments
Please login to add a commentAdd a comment