అతగాడిని ఈ వుదయమే చూశాను నేను. అతని మొహం చెమటతో కన్నీటి ధారలతో తడిసిపోయి వుంది. అతని ఇంట్లోంచి ఏడుపు వినపడుతోంది. రోజూ ఉదయాన్నే వాహ్యాళికి వెళ్లడం నాకలవాటు. రోజూ అదే సమయానికి ఆ యింటి ముందుకు వస్తూంటాను. సాధారణంగా నాకతడు కనుపించడు. ఆ రోజు అతగాడినలా కలుస్తాననుకోలేదు. కారణం గత సాయంత్రమే రాజు నన్ను యింటి దగ్గర దింపి కారు తీసుకుని వెళ్లిపోయాడు. కెందుఝర్ రోడ్లో జోడాకు తీసుకువెళ్లి తీసుకువచ్చాడు నన్ను. అక్కడ్నుంచి బయల్దేరేముందు టాక్సీ మీటరు విప్పి అంకెలను తలకిందులుగా చేసి, యజమానిని దెబ్బతీసి నాలుగు డబ్బులు చేసుకున్నాడు. అతనికి తెలుసు, నేనేం పట్టించుకోనని. కారణం టాక్సీకి నేను అద్దె కట్టనవసరం లేదు. నన్ను అతిథిగా తీసుకువెళ్లిన మనుషులే టాక్సీ చార్జి చెల్లిస్తారు. రాజు టాక్సీ నడుపుతాడు. తెల్ల ఎంబాసిడరు డీజిల్ గాడీని బాగానే నడుపుతాడు. నేనెక్కడికి వెళ్లాల్సినా అతనే తీసుకువెళతాడు.
గోడనానుకుని అతను నిలబడిపోయాడు. అతనింట్లోంచి ఏడుపులు వినబడుతున్నాయి. చిన్నపిల్లవాడిని గుడ్డకప్పి ఆ మనుషులు మౌనంగా తీసుకుపోయారు. నా కాళ్లూ చేతులూ వణకసాగాయి. నాకు ఎటు చూసినా గోడకానుకుని కళ్లు మూసుకుని నిలబడ్డ రాజు విచార వదనమే గోచరించసాగింది. అతని దుఃఖ సమయంలో అతని పక్కన నిలబడలేకపోయానే అన్న భావన నన్ను దోషిగా నిలబెట్టింది.రాజు నలభై–నలభై అయిదేళ్లవాడు. అతని కొడుకు అంతగా చదువుకోలేదు. ‘వాడికి యేదనా ఓ దారి చూపించండి’ అంటూ నన్ను అడుగుతుండేవాడు. వాడు ఎదరకు చదివేదీ లేదు రాజు చదివించేదీ లేదు.త్రోవలో సంత కనబడితే నాకోసం చవకగా కూరలు తెచ్చిపెట్టాడు. తనకోసం ఓ గుమ్మడికాయ కొని తెచ్చుకున్నాడు. సంసారం పెద్దది గుమ్మడికాయలు, బంగాళదుంపలు ఎన్ని ఉన్నా చెల్లిపోతాయి అంటూ చెప్పేడు.ఇంకా యిలా చెప్పేడు.‘మా చంటాడికి వంట్లో బాగోలేదండి. గాడీ నడపకుంటే రోజు గడవదండి. చంటాడిని కనిపెట్టుకుని ఇంట్లో కూర్చుందుకు నాకు కుదరదండి.’జోడా చేరుకునే వరకూ మౌనంగా కారు నడిపేడు. బహుశా చంటిపిల్లవాడి గురించి అతడు ఆలోచిస్తూండవచ్చు. అతని కుటుంబం అంతా ఆకలి బాధతో మాడిపోతూంది. సహాయం చేసేవారెవరూ లేరు. అదే అతని దుఃఖం.
గమ్యానికి చేరుకుని శుభ్రంగా తిన్న తరువాత రాత్రి అయ్యేసరికి అతను మామూలు మనిషి అయ్యాడు. ఇంటికి తిరుగు ముఖం పట్టే సమయంలో అతను ఉల్లాసంగానే కనిపించాడు.మేం ఈ నగర పొలిమేరకు చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. నన్ను మా యింటిముందు దించి, నా కూరల సంచి నాకందించి, నమస్కరించి సెలవు తీసుకున్నాడు. తెల్లవారే సరికి యిదంతా ఎలా జరిగింది? రాజు మొహం కళావిహీనమయిపోయింది. బహుశా అతను యింటికి చేరేసరికే సంగ్రామం ప్రారంభమయి ఉండాలి. డాక్టరు రావడం, మందు యివ్వడం, మళ్లా డాక్టరు రావడం, మందు మార్చడం... ఇంజక్షను ఇవ్వడం... రాత్రంతా యిదే వరుస... ఒకటే దుఃఖం... బాధ. భళ్లున తెల్లవారడంతో పాటు అతని బతుకు కూడా తెల్లవారిపోయింది. చంటివాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.నేను రోజంతా యిదే విషయం మీద ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఉండడాన్ని యింట్లో అంతా గుర్తించారు. ఎలాగో అయిదు గంటల వేళకు నేను అతని యింటికి చేరుకున్నాను. అతను ప్యాంటు షర్టు వేసుకుని పైన ఓ గావంచానుంచుకుని బయటకు వస్తూ కనిపించాడు. ఈ వేళప్పుడు అతను ఎక్కడకు బయల్దేరుతున్నాడు? అతని అడుగులు తడబడుతున్నాయి. బహుశా ఆ మనిషి తాగేసి ఉండవచ్చు. లోపల రగులుతున్న దుఃఖాన్ని చల్లార్చుకుందుకు!నన్ను చూసి అప్రతిభుడయ్యేడు. నమస్కరించి పళ్లు బయటపెట్టి నిలబడ్డాడు.
‘సార్! టాక్సీ కావాలా సార్?’‘నువ్విప్పుడు గాడీ తీస్తావా?’‘ఏం ఫర్వాలేద్సార్. స్టీరింగు పట్టుకుని కూర్చుంటే చాలు, బండి నడుస్తుంది.’‘నే చెప్పేది అది కాదు రాజు! ఇవాళే కదా నీ...’‘ఓ... దానికి ఎవరేం చేస్తారు? దాని గురించి చింతిస్తూ కూర్చుంటే బతికున్నవాళ్లు తినేది ఏవిటి? కాలం కలిసి రాలేదు. లేకుంటే వాడెంతటివాడయి వుండేవాడో? రెండున్నర సంవత్సరాలు వాడికి. వాడి మొహంలో ఎంత కళ ఉండేదని?!’అతని కళ్లలో నిరాశానిస్పృహలు గూడు కట్టుకున్నాయి. అంతలో తృళ్లిపడి, నన్ను చూసి పళ్లుయికిలిస్తూ – ‘నడవండి సార్! మీరెక్కడికో బయల్దేరినట్టున్నారు...’‘లేదు రాజూ! నేను నిన్ను చూసి పోదామనే వచ్చాను.’అతని పెదాలు వణకసాగాయి, కళ్లు చెమ్మగిల్లాయి. నేను అతని యజమాని గారేజీకి దారి చూపిస్తున్నట్టుగా అతగాడిని తీసుకుపోయేను.ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం.
‘నువ్వు నన్ను తీసుకుని వెళ్లకుండా వుంటే నీకీ విపత్తి వచ్చి వుండేది కాదు. నువ్విక్కడ వుండి వుంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు కబురుపెట్టావు కాదు!’‘ఏం చెప్పమంటారు సార్! నేనింట్లో అడుగుపెట్టేసరికే అంతా జరిగిపోయింది.’నాకు ఒళ్లు మండింది. ‘ఏమయిందీ? నువ్వెందుకు పనికిరాని ఒట్టి బడుద్దాయివి. ఇంట్లో కుర్రాడు అంత జబ్బుగా వుంటే నువ్వు సారా తాగుతావన్నమాట. మీటరులోని నెంబర్లు తారుమారు చేసి నాలుగు రూకలు దొంగిలించింది యిలా సారాకి తగలెయ్యడానికా?’‘అసలు విషయం అదికాద్సార్...’‘రాత్రంతా తాగిన మత్తులో యింట్లో తొంగుని ఉంటావు.’‘లేద్సార్, నిన్న రాత్రి సంగతి మీకు ఎలా చెప్పను సార్? నా కర్మ... నిన్న రాత్రి నేనసలు యింటికే చేరలేద్సార్!’‘అదేవిటి? ఏమయింది?’ తీవ్రంగా అడిగేను.అతను గారేజి తెరిచి లోపలికి వెళ్లకుండా తలుపుకి జేరపడి నేలకేసి చూస్తూ అన్నాడు.‘‘నేను ఆమెను ఆసుపత్రికి తీసుకుపోక పోయివుంటే చచ్చిపోయి వుండేది. మిమ్మల్ని మీ యింటి వద్ద దించి వస్తూ, రోగంతో వున్న నా కొడుక్కి ఏపిల్సు, ద్రాక్షపళ్లు కొని తీసుకుపోదామనుకున్నాను. బజారులోకి వెళ్లేను. తిరిగి వస్తూంటే ఓ ఎనిమిది పది సంవత్సరాల వయసున్న ఆడపిల్ల నా గాడీకి ఎదురుపడింది. నాకు తెలియకుండానే సడెన్ బ్రేక్ పడి గాడీ ఆగింది, కాబట్టి సరిపోయింది. తృటిలో చావును తప్పించుకుందా పిల్ల. దారికి అడ్డంగా వచ్చిన ఆ పిల్లమీద నాకు కోపం ముంచుకొచ్చి టాక్సీ దిగేను, ఆ పిల్ల చెవి మెలేసి ఆమె తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుపోదామని! నేను చీదరించుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లేసరికి ఆ పిల్ల యేడుస్తూ చెప్పింది –‘మా అమ్మ చనిపోయేలా ఉంది. మా యింట్లో ఎవరూ లేరు.
కళ్లు నులుముకుంటూ యేడుస్తూంది. అంతలో ఓ ముసలావిడ ఒంగిన నడుముతో నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది. సరిగ్గా మా అమ్మలాగా ఉందామె. ‘పదవా! ఎక్కడున్నావే? నడు... త్వరగా నడు... నాయకా! కాస్తంత ముందుగా రావచ్చు గదా? రా... రా...’ అంటూ నా ముందు నుంచి ఎదరకు నడిచిందామె. ఆమె నన్నలా ఎందుకు పిలిచిందో నాకు అర్థం కాలేదు. ఇంట్లోకి వెళ్లి చూస్తే మా అందరి కొంపల్లాగే దరిద్రం ఉట్టిపడుతూ కనిపించింది. పద్మ తల్లి మంచం మీద గోడకు జేరగిలబడి కూర్చునుంది. ఆమె ఆయాసపడుతూ కనిపించింది. బింది కుండలా ఉన్న నిండు చూలాలు. ‘నడమ్మా నడు. పాపం ఈయన దేవుడిలా వచ్చేడు. నేను నీతో వస్తాను. పద్దవా! నువ్వు తమ్ముడి దగ్గరే ఉండు. మీ నాన్న వస్తే ఆసుపత్రికి పంపు. పద్దవా! నువ్వెళ్లి ఆ బిసియామాని పిల్చుకురా! నేనొంటరిగా దీన్ని తీసుకుపోలేను.’నేను పెదవి విప్పి మాట్లాడలేకపోయాను. నిజంగానే దేవుడున్నాడు, కష్టంలో వున్నవారిని ఆదుకునేందుకు ఎవరినో ఒకరిని ఆయనే పంపుతూంటాడు’’‘అయితే నువ్వామెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలన్నమాట’‘అదే కదా సార్ చెబుతున్నాను. ఆ ముసలామె, మరో బిసియా మా ఇద్దరూ కలిసి ఎలాగో సాయం పట్టి ఆమెను నా బండిలో కూర్చోబెట్టేరు. ఇద్దరూ చెరొక పక్కా కూర్చున్నారు. ‘పోనీ నాయనా! త్వరగా తీసకునడు’ అంది ముసలామె. ఆసుపత్రికి చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావచ్చింది. వాళ్లామెను దించేసుకునుంటే నేను నా యింటికి పోయివుందును కాని ముసలామె అంది –‘మగాడవు నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. డాక్టరుగారితో కాస్తంత మాట్లాడి పెట్టు నాయనా.’ విధిలేక ఆమె వెంట వెళ్లాను.
డాక్టర్లు ఆసుపత్రుల సంగతి గురించి నేను మీకు చెప్పనవసరం లేదు కానీ ఒక అదృష్టం ఏమిటంటే, ఎంబాసిడరులోంచి దిగిన రోగి కాబోలని అనుకుంటాను వాళ్లు కాస్తంత సానుభూతి చూపేరెందుకనో! ‘తీసుకురండి... తీసుకురండి!’ అన్నారు.చూస్తూనే డాక్టరు, నర్సు ఇద్దరూ అన్నారు –‘వెంటనే పురుడొస్తుంది. ఇంజక్షను, సెలయిన్ బాటిలు వగైరాలు వెంటనే కావాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో మందులు నిండుకున్నాయి. ఆమెను వెంటనే స్ట్రెచరు మీదలోపలకు తీసుకు నడవండి’ అంటూ స్టాఫ్‌కి ఆర్డరిచ్చి డాక్టరుగారు నన్ను చూసి తీవ్రంగా చెప్పారు. ‘ఈ చీటిలోని మందుల్ని ‘బస్‌వారి లాల్ మెడికల్’ నుంచి త్వరగా తీసుకురావాలి అని పురమాయించి డాక్టరు నర్సూ లోపలకు హడావుడిగా నడిచారు. ముసలావిడ నాకు చెప్పింది. ‘వెళ్లు నాయనా ఇంకా అలా చూస్తావేమిటి?’చీటిని వుండచుట్టి ఆమె మొహానవేసి కొట్టి ఉండేవాడినే, దోవే పోయేవాడిని నన్ను యింత దూరం లాక్కొచ్చింది చాలక, ఈ అధికారం ఏమిటి నా మీద? డబ్బెవడిస్తాడు వీళ్ల బాబు..?’అంతలో దీనంగా యేడుస్తూ దారిలో నిలబడ్డ ‘పద్దవా’ మొహం నా కళ్లముందుకొచ్చింది. ‘మా అమ్మ బతకదు. చనిపోయేలా ఉంది’ అన్న ఆమె మాటలు గుర్తుకొచ్చాయి.నేను వెంటనే బండి తీసుకుని బయల్దేరాను. వాటన్నిటికీ రెండొందలు పైన ఖర్చయింది. తీసుకుని వారికందించాను. లోపల ప్రసవం జరుగుతూంది. బయట నేను నిలబడ్డాను. ఎలా వదిలేసి రాగలను? మళ్లా ఏదైనా అవసరం వస్తే, నేను తప్ప అక్కడ యింకెవ్వరున్నారు? రాత్రి పన్నెండు గంటల పది నిముషాలకు మగపిల్లవాడు పుట్టేడు. ఆ బిడ్డడు నా బిడ్డ అయినట్టు. ముసలావిడ నా దగ్గరకు వచ్చి అంది. ‘ఎలాగయితేనేం నాయనా, పుణ్యం కట్టుకున్నావు. నువ్వు యింటికెడతావు యిప్పుడు, కానీ ఆమె ఒంటరిగా నీతో వెళ్లేందుకు భయపడవచ్చు. నేనూ కాస్తంత నడుము వాలుస్తాను. ఉదయాన్నే అయితే నేనూ ఆమె వెంట వస్తాను.’
నేనేమీ మాట్లాడలేదు. ముసలావిడను ‘పద్దవా’ యింటి దగ్గర దింపేశాను. తిరిగి నేను గాడీలో కూర్చుంటూంటే ముసలావిడ అంది.‘మళ్లీ ఎక్కడికి బయల్దేరావు? ఇంట్లోకి రా బాబు!’‘నేను నా యింటికి పోతున్నాను.’‘నీ యింటికేవిటీ?నువ్వు ‘పద్దవా’ బాబాయివి కాదా? నిన్ను వాళ్లు చీటి యిచ్చి పంపారు కదా! నువ్వు పద్మ వూరు నుంచి రాలేదా? ‘పద్దవా’ తండ్రి అయిదారు మాసాలయింది, దేశం పట్టిపోయేడు, నువ్వు ‘పద్దవా’ బాబాయివి కావా ఏమిటి?’‘కాదమ్మా! నేను ‘పద్దవా’కి యేమి కాను. ఈ దారినే పోతూ గాడీని ఆపేను. మీరు పిలిస్తే మీ మాట కాదనలేకపోయాను. సరే నే వస్తాను.’దీపస్తంభం దగ్గర ముసలావిడ బుగ్గలు నొక్కుకుని ‘ఆ’ అంటూ నిలబడి చూస్తూండిపోయింది. నేను అప్పటికీ యింటికి పెందరాళే చేరుకుని ఉండేవాడిని. యోగం లేదు. అది మరో గొడవ. ప్రభుత్వ ఉద్యానవన కాలనీకేసి వెళ్లి చాలా కాలం అయింది. ఆ కాలనీలో మా మావ వరస ఒకరుంటున్నారు. ఆ యింటిని చూసుకుంటూ వస్తున్నాను. ఆ రాత్రివేళ ఆ యింటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏవిటయిందని చూద్దును కదా, మా లక్ష్మణ మావ కాలం చేశాడు.
నేను గాడీ ఆపుకుని కిందకు దిగాను. మా మావ కొడుకు సుదామ వచ్చి నన్ను వాటేసుకుని భోరుమన్నాడు. మరొక వలలో చిక్కాను. పాడిని లేపుతారు. నేను మోయక తప్పదు. శ్మశానానికి చేరుకునేసరికి రాత్రి మూడు గంటలయింది. తిరిగి వచ్చేసరికి వెలగొచ్చేసింది. తడి గావంచా చుట్టబెట్టుకుని యిల్లు చేరుకునేసరికి యిక్కడ జరగాల్సింది కాస్తా జరిగిపోయింది’’రాజు మొహం వాల్చుకుని నిలబడి ఉన్నాడు. వెర్రివాడు కాకపోతే ఏమిటి? ఆ రాత్రి అతని బతుకులో చిమ్మచీకటిని మిగిల్చింది. తరగని చీకటి రాత్రి అయింది. గాడీ యజమాని తన జమాఖర్చులు తీసుకున్నాక పెద్దగా యేమీ మిగల్లేదు. ‘సార్! మీరు ఎక్కడికైనా వెళ్లాలా సార్?’ నాకేసి ఆశగా చూస్తూ అడిగాడు అతను.నేను రాజు కళ్లలోకి చూడలేక తల కిందకు దించుకున్నాను. నిజం! ఆ దేవుడు కూడా అపరాధ భావంతో రాజు ముందు తలవంచక తప్పదు!
ఒడియా కథాసంకలనం తరగని చీకటిరాత్రిసౌజన్యంతో...
‘మా అమ్మ చనిపోయేలా ఉంది. మా యింట్లో ఎవరూ లేరు.’ కళ్లు నులుముకుంటూ యేడుస్తూంది. అంతలో ఓ ముసలావిడ ఒంగిన నడుముతో నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది. సరిగ్గా మా అమ్మలాగా ఉందామె.
ఒడియా మూలం: చంద్రశేఖర్ రథ్
అనువాదం: మహీధర రామశాస్త్రి
తరగని చీకటిరాత్రి
Published Sun, Nov 5 2017 1:04 AM | Last Updated on Sun, Nov 5 2017 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment