- నేను ఇటు.. నువ్వు అటు
- చర్చించుకుంటున్న ఉద్యోగులు
- విభజనకు తుది కసరత్తు
- జిల్లా కేంద్రం నుంచే సర్దుబాటు
- 73 శాఖల నుంచి వివరాలు సేకరణ
ఇక ఉద్యోగుల వంతు
Published Thu, Aug 25 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
ముకరంపుర : నిన్న మెున్నటి వరకు జిల్లాల విభజనపై ప్రభుత్వం తర్జనభర్జన పడిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాల ముసాయిదా ప్రకటన వెలువడడంతో ఇక ఉద్యోగుల్లో చర్చ మెుదలైంది. కరీంనగర్‌ను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తుండడంతో ఎవరెవరూ ఎటూ వెళ్తామని చర్చించుకుంటున్నారు. కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ విభాగంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, డీఆర్వో, ఏజేసీలతో రహస్యంగా సమీక్షించడం చర్చనీయాంశమైంది.
కొత్త జిల్లాల్లో పరిపాలన సౌలభ్యానికి జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగుల సర్దుబాటు, మానవ వనరుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మూడు జిల్లాలకు సర్దుబాటు చేసే క్రమంలో ప్రత్యేక నమూనాలో 73 శాఖలకు చెందిన ఉద్యోగుల సమగ్ర వివరాలు తేల్చుతున్నారు. గతంలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల కేంద్రాలుగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.తాజాగా సిరిసిల్ల స్థానంలో పెద్దపల్లి జిల్లాను ఖాయం చేయడంతో మరోసారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేయాలని ఆదేశించడంతో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇందుకు ప్రభుత్వం నాలుగు రకాల ఫార్మాట్‌లను పంపించింది. ఫార్మాట్ 1లో ఉద్యోగి పనిచేస్తున్న విభాగం, పోస్టు, హోదా వివరాలు, మూడు జిల్లాల్లో ప్రాధాన్య క్రమంలో ఆప్షన్ల వివరాలు సేకరించారు. ఇంకా కొన్ని శాఖలు వివరాలు సమర్పించకపోవడంతో మరోసారి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి కొత్తగా ఏర్పాటయ్యే కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు.
రెండు రోజుల్లో నివేదిక
గతంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 73 శాఖల్లో 3,290 మంజూరు పోస్టులు కాగా 2,504 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్‌కు 881, జగిత్యాలకు 826, సిరిసిల్లకు 797 ఉద్యోగులను సర్దుబాటు చేశారు. ఆ సమయంలో అదనంగా 2,696 పోస్టులు అవసరమని నివేదించగా 1,253 పోస్టులు కొత్తగా కేటాయించాలని జిల్లా యంత్రాంగం నివేదికలు రూపొందించింది. కలెక్టరేట్ పరిపాలనపరంగా కలెక్టర్ నుంచి అటెండర్ వరకు 88 మంజూరు పోస్టులుండగా 86 మంది పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మరో 92 మంది ఉద్యోగులు అవసరమని, అన్ని హోదాల్లో 60 మంది చొప్పున మూడు జిల్లాలకు ఉద్యోగులు విభజించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వివరాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముందని సంబంధిత అ«ధికారులు తెలిపారు. రెండు రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధంకానుందని పేర్కొన్నారు.
సమగ్రంగా క్రోడీకరణ
ఫార్మాట్–ఏలో జిల్లా స్థాయి అధికారులెందరు? గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు సేకరిస్తూ వాటిని మూడు జిల్లాలకు సర్దుబాటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఫార్మాట్–2లో ఉద్యోగి పేరు, హోదా, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, వేతనం, ఉద్యోగి ఐడీ నంబర్, ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయం, ఉద్యోగి పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగ విరమణ పొందే సమయం, పూర్తి చిరునామా, కులం, అంగవైకల్యం, రిమార్కులు నమోదు చేస్తున్నారు. ఫార్మాట్ 3లో మంజూరు పోస్టులెన్ని? ఏ జీవో ద్వారా ఎన్ని పోస్టులను మంజూరు చేశారు? ప్రస్తుతం పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులెంత? ఖాళీగా ఉన్న పోస్టులెన్ని? డెప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారు ఏ విభాగం నుంచి వచ్చారు? సెలవులో కొనసాగుతున్నవారు? వంటి వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఉద్యోగులు ఆప్షన్లు కోరుకునే విషయంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. మౌలిక వసతుల విషయానికొస్తే ఇప్పటికే జగిత్యాలలో కలెక్టరేట్‌ను న్యాక్ సెంటర్‌లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా తాజాగా ధరూర్ క్యాంపు ఎస్సారెస్పీ కార్యాలయంలో ఏర్పాటుకు బుధవారం పరిశీలించారు. పెద్దపల్లిలోని పెద్దకల్వలలో గల ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో కలెక్టరేట్ నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించారు.
Advertisement