కాస్త... సర్దుకుపోదాం!
సెల్ఫ్‌చెక్
1. మీకు నచ్చని కూర వండితే ముఖం మాడ్చుకుంటారు. ఆ రోజు ఉపవాసమే బెటర్ అనుకుంటారు.
ఎ.కాదు. బి.అవును.
2. టీ ఇవ్వడానికి కాస్త ఆలస్యం అయినా... భార్య మీద మండిపడతారు.
ఎ.కాదు. బి.అవును
3. చెప్పిన పని సకాలంలో చేయలేదని అలకబూనుతారు.
ఎ కాదు. బి.అవును.
4. అతి క్రమశిక్షణతో కుటుంబసభ్యులను చీకాకు పెడతారు.
ఎ.కాదు. బి.అవును.
5. భార్య సరదాగా చిన్న మాట అన్నా... పరువు పోయినట్లు బాధపడతారు.
ఎ.కాదు బి.అవును
6. ప్రతి విషయంలోనూ మీ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు.
ఎ.కాదు బి.అవును
7. సర్దుకుపోవడం అంటే లొంగిపోవడం అనే భావనలో ఉంటారు.
ఎ. కాదు బి.అవును
సంసారం అనే రథానికి భార్యభర్తలు రెండు చక్రాల్లాంటి వారు...అనే డైలాగు పాతదైనా ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకోవాల్సిన పవర్‌ఫుల్ డైలాగు. సంసారం అనే బండి సజావుగా నడవాలంటే, సర్దుకు పోవడాన్ని మించిన గొప్ప ఐడియా లేదు. పై వాటిలో మీకు ‘బి’లు ఎక్కువగా వచ్చాయంటే మీలో సర్దుకుపోయేతత్వం తక్కువ అని. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. ‘‘ఇంత కాలం ఎలాంటి గొడవ లేకుండా కాపురం చేశారు కదా! ఏమిటి మీ విజయరహస్యం?’’ అని ఒక సీనియర్ భర్తను ఒక జూనియర్ భర్త అడిగాడట.
అప్పుడు ఆయన తన తెల్లగడ్డం సవరిస్తూ ‘‘ఆమె బల్లిని చూసి పిల్లి అంటుంది. నేను ఖండించకపోగా... ఎంత ముద్దుగా ఉందో అంటాను’’ అంటూ తన విజయరహస్యం చెప్పాడట. ఇది హాస్యానికే కావచ్చుగానీ, దీని నుంచి నేర్చుకోవల్సింది కూడా ఉంది. ప్రతి దాన్నీ విభేదిస్తూ పోవడం వల్ల అశాంతి తప్ప ఏమీ మిగలదు.